ఆనంద కిరణాలను మనమే వెతుక్కోవాలి. సూర్యుడు అస్తమించి, అంధకారం ఆవరిస్తున్నదే అని దిగులుపడే బదులు చుక్కల్ని చూసి ఆనందించే సమయం వచ్చిందిగదా అని సంతోషించవచ్చు. అంతర్యామి ఆనందనిలయుడు. 'కష్టకాలంలో ఇష్టదైవాన్ని స్మరిస్తుంటాం. సంతోషంగా ఉన్నప్పుడు సర్వేశ్వరుడు స్మరణకు వస్తాడా? అప్పుడు కూడా దైవం మన మదిలో మెదిలితే ఇక జీవితంలో విషాదానికి తావే ఉండదు' అంటాడు కబీరుదాసు. భౌతిక స్పర్శ వల్ల కలిగే సుఖం నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. రమణమహర్షి, రామకృష్ణ పరమహంస శారీరక బాధలను పట్టించుకోలేదు. సంతోషంగా తనువులు చాలించగలిగారు. 'బాధే సౌఖ్యమనే భావన' చేయమన్నాడొక కవి.
ఆనందాల్లో కూడా మంచివీ చెడ్డవీ ఉంటాయి. మూర్ఖుడొకడు అబలలను ఏడిపిస్తుంటాడు. 'చదువుకొని ఉద్ధరించరా' అని బడికి పంపితే, తోటి విద్యార్థినిని అశ్లీలపు మాటలతో వెంటాడుతూ ఉంటాడొక యువకుడు. ఇంకొక దుశ్శీలుడు పవిత్ర క్షేత్రంలో అపవిత్రంగా ప్రవర్తిస్తూ పైశాచికానందం పొందుతాడు. వీళ్లందరూ పొందుతున్నది ఏ విధమైన ఆనందం? రాక్షసుల వికటాట్టహాసం వెనక ఉన్నది క్రౌర్యమేగాని సంతోషం కాదు. 'మంచి నుంచి పుట్టినదే నిజమైన సంతోషం. పరపీడనంతో పొందేవి నిజమైన సంతోషాలు కావు' అన్నాడు తిరువళ్లువర్.
పాపం పుణ్యం తెలియని పసివాడు మిడతను పట్టుకొని, దాని కాళ్లూ రెక్కలూ లాగి ఆనందిస్తుంటాడు. అతడి ఆనందం చూసి పెద్దలు ముచ్చటపడిపోతూ ఉంటారు. దీనికి బదులు వడలిపోయే మొక్కకు చేరెడు నీళ్లు పోసో, దిక్కుమాలిన కుక్కపిల్లకు కొంచెం పాలు తాగించో- సంతోషించడం పిల్లలకు నేర్పాలి. ఈ సంతోషం సంతృప్తిని మిగిలిస్తుంది. లేకుంటే హింసావాదులు తయారవుతారు. ఒకరిని బాధించి, ఇంకొకరికి సంతోషం కలగజేయడం హేయం. తాను బాధపడుతూ పరులకు సంతోషం కలగచేయడం త్యాగం.
శిల్పి సుత్తితో ఉలిపై కొడుతూ నయనానందకరమైన శిల్పాలు చెక్కుతాడు. ఉలిని చూసి సుత్తి జాలిపడింది.
'ఉలీ, నీ నెత్తిన నేను ఎన్నోసార్లు కొడుతూ ఉంటాను... పాపం, నీకెంత బాధ కలుగుతున్నదో!' ఉలి చలించలేదు. చిరునవ్వుతో సమాధానమిచ్చింది. 'అన్నా! నీ దెబ్బ నాకు తగిలే ప్రతిసారీ, నా మొనతో చెక్కే మనోహర శిల్పాన్నే తలచుకుంటాను. నాకు ఆనందమే కలుగుతుంది!'
'పాపం! అప్పుడప్పుడు శిల్పి నిన్ను ఆకురాతితో అరగదీస్తుంటాడు. ఎంత కుమిలిపోతావో ఏమో!'
'లేదు! మరింత పదునుగా తయారై, సుకుమార శిల్పాలను సైతం చెక్కడానికి పనికొస్తానుగదా అని సంతోషిస్తాను.'
'పనికిరాని రాతి బండలను చెక్కే కఠినమైన పని నీతో చేయించడం విచారకరం గదూ!'
'కానే కాదు! ఎందుకూ పనికిరాని శిలలను సైతం మనోహర శిల్పాలుగా మలుస్తున్నానుగదా అని పొంగిపోతాను!'
'కొన్నాళ్లు నీతో పనిచేయించుకొని, తరవాత నిన్ను పాత వస్తువుల్లోకి విసిరిపారేస్తారు. సరికొత్త ఉలితో తమ పని కొనసాగిస్తారు. పాపం! నువ్వు దిగులుతో కుళ్లి కుళ్లి ఏడుస్తావు! అవునా?'
'కాదు! నేను బాగా ఉన్నంతకాలం మంచి పనులకు ఉపయోగపడ్డానుగదా అని సంతోషంతో, సంతృప్తిగా శేషజీవితాన్ని గడుపుతాను!'
మనిషికి ఈ ఉలి మంచి ఆదర్శం. భగవంతుడు ఒక ఇనప ముక్కకు కూడా సార్థక జన్మనే ఇచ్చాడు. సర్వమూ 'ఆతని' దివ్యకళామయమని భావించేవారికి అంతా సంతోషమే!
ఏ ఒక్కరినో సంతోషపెట్టడానికి చేసే ఒక మంచి పని అందరికీ ఆనందదాయకం కావచ్చు. అది ఆధ్యాత్మికమైనదైతే కలకాలం ఇలలో నిలుస్తుంది. జగన్నాథ్‌దాస్ ఒడిశాలోని కపిలేశ్వరంలో 1490లో జన్మించాడు. ఆయనను భక్తులు శ్రీ రాధిక అవతారంగా భావిస్తారు. శాక్తేయులు శ్రీ దుర్గావతారంగా పూజిస్తారు. జగన్నాథ్‌దాస్ తల్లి పద్మావతి. ఆమె రోజూ జగన్నాథస్వామి దేవాలయానికి వెళ్లి, పండాలు ప్రవచించే భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించేది. పౌరాణికుడికి అందరూ కానుకలు సమర్పిస్తున్నారు. ఈమె వద్ద డబ్బులు లేవు. తానేమీ ఇవ్వలేకపోయినందుకు కన్నీరు కార్చుతూ ఆమె ఇంటికి వచ్చింది. జగన్నాథ్‌దాస్ తల్లి వేదనను గ్రహించాడు. శ్రీమత్ భాగవతాన్ని అతిసుందర, సరళ ఒరియా భాషలో, భక్తిభావ బంధురంగా రచించి తల్లికి వినిపించాడు. తన మాతృమూర్తిని సంతోషపెట్టడానికి జగన్నాథ్ దాస్ ఆనాడు రచించిన భాగవతం ఈనాటికీ లక్షల మందిని ఆనందపరవశులను గావిస్తోంది.
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు
No comments:
Post a Comment