ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 1 September 2013

ఉత్సాహం


కార్యసిద్ధికి సామర్థ్యం ఎంత అవసరమో, తలపెట్టిన కార్యనిర్వహణలో ఉత్సాహమూ అంతే అవసరం. ఉత్సాహశక్తి అంటే- అనుకొన్న పనిలో ఆసక్తి, అది జరుగుతుందనే ఆశాభావం, విశ్వాసంతో ముందడుగు వేసే శక్తి. ఆటంకాలు వస్తాయనే భయంతో కార్యం ఆరంభించని వాడు అధముడు, ఆరంభించిన తరవాత ఎదురయ్యే ఇబ్బందులతో ఉత్సాహం కోల్పోయి విరమించుకొనేవాడు మధ్యముడు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యం, ఉత్సాహంతో ముందుకు పోయేవాడు కార్యసాధకుడైన ఉత్తముడని భర్తృహరి సుభాషితం.
సాత్వికుడైన కార్యసాధకుడు ధైర్యం, ఉత్సాహంతో ముందడుగు వేస్తాడని భగవద్గీత ఉపదేశించింది. చక్కగా రూపకల్పన చేసిన ప్రణాళికను ఉత్సాహంతో నిర్వహిస్తే విజయం వరించి, సంపద కలుగుతుందనేది కాళిదాసు మాట. ప్రపంచాన్ని నడిపే ఇంధనం ఉత్సాహశక్తి అన్నాడు పాశ్చాత్యవేదాంతి ఎమర్సన్‌.

ఉత్సాహశక్తికి రెండు పార్శ్వాలు. స్వయంగా కార్యసాధకుడికి తాను తలపెట్టిన కార్యంలో ఉండే ఉత్సాహం ఒక పార్శ్వం. పరిసరాల ప్రభావం వల్లా, సాటివారి ప్రోత్సాహం వల్లా, 'ఉత్సాహనం' వల్లా కలిగే ఉత్సాహం మరొక పార్శ్వం. విజయవంతంగా కార్యం నిర్వహించేందుకు రెండూ అవసరమే. పరిసరాలు, తోటివారి ప్రభావం వల్ల ఉత్సాహం పెరగనూవచ్చు, క్షీణించనూవచ్చు. ఉత్సాహం పెంపొందితే కార్య జయం సులభం, నిశ్చయం. అది క్షీణించితే అపజయం ఖాయం. ఈ నిత్య సత్యానికి దృష్టాంతమే శల్య సారథ్యం కథ. కురుక్షేత్ర యుద్ధం మొదలై, భీష్ముడు పడిపోయిన తరవాత, కర్ణుడు కౌరవ సేనకు సేనాధ్యక్షుడవుతాడు. అతడి కోరిక ప్రకారం దుర్యోధనుడు, శల్య మహారాజును కర్ణుడి రథానికి సారథిగా ఉండమని బతిమాలతాడు. 'అర్జునుడికి కర్ణుడు సాటి, శ్రీకృష్ణుడికి నువ్వు సాటి!' అని పొగడగా పొగడగా, శల్యుడు అయిష్టంగా ఒప్పుకొంటాడు.

కానీ కర్ణుడికి తనకున్న మిగిలిన శాపాలతోపాటు, ఈ శల్యసారథ్యం కోరి తెచ్చుకొన్న గుదిబండగా పరిణమిస్తుంది. ఎంతో ఉత్సాహంతో, పాండుసేనను ఇప్పుడే సర్వనాశనం చేస్తానని కర్ణుడు రథమెక్కుతుండగానే, రథసారథి శల్యుడు, 'కర్ణా! పాండవులను ఎదిరించటమంటే ఇలా బీరాలు పలకటం కాదు. వాళ్లు మహాశక్తిమంతులు. పైగా ధర్మం కూడా వాళ్లవైపే ఉంది. వాళ్లను గెలిచే శక్తి నీకేది? వాళ్ల బలం ముందు నువ్వెంత?' అంటూ వాదం పెట్టుకొని రథం కదిలిస్తాడు. మళ్ళీ కొంత ఉత్సాహం పుంజుకొని, కర్ణుడు 'ఈరోజు ఇంద్రుడినైనా గెలిచే వూపు మీద ఉన్నాను. పద' అంటే- 'కర్ణా, అవివేకపు మాటలు వద్దు. అర్జునుడు నీకంటే గొప్ప యోధుడని అందరికీ తెలుసు. ఆయన అంగారపర్ణుడినీ, చిత్రసేనుడినీ, ఇంద్రుడినీ, శివుడినీ గెలిచినవాడు. ఉత్తర గోగ్రహణంలో మిమ్మల్నందర్నీ తానొక్కడే ఎదుర్కొని మట్టి కరిపించాడని మరిచిపోకు! ఆయన పులీ, నువ్వు నక్కా. ఆయన ఏనుగూ, నువ్వు కుందేలూ. ఆయన సింహం, నువ్వు జింకపిల్ల. వాళ్లను శరణువేడుకోకపోతే నువ్వు నిష్కారణంగా చచ్చిపోతావు' అంటాడు.

కర్ణుడికి శల్యుడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాడు? బుద్ధి పొరపాటు వల్ల, కోరి కోరి సారథిగా తెచ్చుకొన్నాడాయె. 'ఇక ముందు ఇలా మాట్లాడితే చంపేస్తా'నంటాడు. చివరకు, దుర్యోధనుడు వాళ్లకు ఎలాగో సర్దిచెప్పాల్సి వస్తుంది. అవసర సమయంలో అతడి ఉత్సాహ శక్తిని పెంపు చేయాల్సిన సొంత రథసారథి తన మాటలతో దాన్ని పూర్తిగా దెబ్బతీసి కర్ణుడి అపజయానికీ మరణానికీ కారణభూతుడవుతాడు. ఎంత సేనా, ఎంత శక్తీ ఉండి- ఏం లాభం! విచిత్రమేమంటే, అవతలి పక్షంలో 'నేను ఆయుధం పట్టను. యుద్ధం చేయను. నా సైన్యం నాతో రాదు. కావాలంటే రథం తోలుతూ మాట సహాయం, ప్రోత్సాహనం చేస్తాను' అంటాడు శ్రీకృష్ణుడు. కేవలం తన ప్రోత్సాహంతో పాండవుల మనోబలాన్నీ, ఉత్సాహాన్నీ పెంచి, సంఖ్యాపరంగా తమకంటే ఎంతో బలవంతులైన కౌరవుల్ని పాండవులు జయించేలా చేస్తాడు!


ఉత్సాహశక్తి లోపిస్తే కార్యసిద్ధికి కావలసిన సాధనాలు ఎన్ని ఉన్నా, ఏమీ లేనట్టే. పని జరగాలంటే, పని చేసేవాడికి ఉత్సాహం ఉండాలి. తోటివారు ప్రోత్సహిస్తే అది మరింత బలపడుతుంది. నిరుత్సాహపు మాటలు, ఆలోచనలు, సలహాలు కార్యసాధనను భంగపరచినట్టు, మరే విఘ్నమూ భంగపరచలేదు. మరే శత్రువూ అంత నష్టాన్ని కలిగించలేడు!
- మల్లాది హనుమంతరావు 

No comments:

Post a Comment