ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday, 5 September 2013

ఆచార్య దేవోభవ


 జన్మనిచ్చే తల్లి దైవ సమానురాలు. మనకు స్వశక్తి వచ్చేవరకు పోషించే తండ్రి కూడా దైవసమానుడే. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానమనే వెలుగు బాటలో నడిపించే గురువూ దైవ సమానులే. ఏ విద్య బోధించే గురువైనా పరబ్రహ్మస్థానీయుడే. విద్య అంటే విముక్తిని ప్రసాదించేదిగనుక భారతీయ సంప్రదాయంలో గురువుకు పరమోత్కృష్ట స్థానం ఉంది.

ఆచార్యుడు, గురువు అనే పదాలు అర్థవంతమైనవి, పవిత్రమైనవి. ఆచార్యుడంటే తాను అధ్యయనం చేసి శిష్యుని చేత అధ్యయనం చేయించేవాడు. 'గు' అంటే అంధకారం, 'రు' అంటే దాన్ని నిర్మూలించేవాడు. అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్నిచ్చే వ్యక్తే గురువు. 'గ'కారం గణేశబీజం. రేఫం అగ్నిబీజం. ఉకారమంటే హరి. గురువు త్రిమూర్త్యాత్మకుడు. మేఘానికి, గురువుకు సహజమైన ఔదార్యం ఉంటుంది. మేఘం తనకున్నదంతా మనకిచ్చి 'అయ్యో! వీరికి నేనేమీ చేయలేకపోయానే' అని వెలవెలపోతుంది. అదేవిధంగా ఆచార్యుడు కూడా తనకున్నదంతా శిష్యులకిచ్చినా సంతృప్తిపడడు. శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించి తన నుంచి ఏదైనా ఫలం స్వీకరించినవారిని ఉదారులు అని పేర్కొన్నాడు. లోకంలో దాతను ఉదారుడు అని సంబోధిస్తారు. పరమ కరుణామూర్తియైన శ్రీకృష్ణ పరమాత్మ గీతలో తన అమృతోపదేశాన్ని స్వీకరించిన అర్జునుని ఉదారుడని స్తుతించడం ఆయన భక్త వాత్సల్యానికి నిదర్శనం.

భారతీయ సంప్రదాయంలో గురుశిష్య సంబంధం అతి పవిత్రమైనది. గాంభీర్యం, ఔదార్యం, సౌలభ్యం గురువు ప్రధాన లక్షణాలు. ద్రోణాచార్యుడు శిష్యుల్ని పరీక్షించి వారి వారి సంస్కారాల్నిబట్టి విద్య బోధించేవాడు. ఉత్తమ శిష్యుల్ని వరించి వారికి అగ్నిపరీక్షలు పెట్టి మేలిమి బంగారంలా ప్రకాశించేవారినే ప్రియశిష్యుడిగా స్వీకరించే ఉత్తమాచార్య సంప్రదాయం ద్రోణుడిది. తన కుమారుడైన అశ్వత్థామకు చెప్పని అస్త్ర విద్యా రహస్యాలను అర్జునుడికి బోధించాడాయన.

సద్గురువు తన ఆత్మబలంతో శిష్యుణ్ని ఆధ్యాత్మిక గమ్యానికి చేర్చగలడు. గురువు ఒక వ్యక్తి కాదు... జ్ఞానవ్యవస్థ! గురువు స్వయంగా సంసారాన్ని తరించినవాడై ఉండాలి. ఈత నేర్చినవాడే మునుగుతున్నవాణ్ని రక్షించగలడు. అందుకే జైనులు గురువును తీర్థంకరుడంటారు. గురువులో స్వార్థం, ఈర్ష్య ఉండవు. తనలో వెలిగే దివ్వెను అందరిలో చూడగలిగేవాడు ఉత్తమ గురువు. బుద్ధుడు 'నేను ఏనాడైతే బుద్ధత్వం పొందానో ఆ బుద్ధత్వం అందరిలోనూ నాకు కనిపించింది. నేను ప్రస్తుతం తెలుసుకున్నాను. వారు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. వర్తమానంలో నేను బుద్ధుడినైతే భవిష్యత్తులో వారు బుద్ధులు!' అన్నాడు. కాలభేదమే తప్ప చైతన్యంలో భేదం లేదు.

గురుశిష్యుల మధ్య ప్రేమబంధం ఉండాలిగానీ- లోభం కాదు. ముడిపదార్థంగా తన వద్దకు వచ్చిన శిష్యుని వజ్రంగా తీర్చిదిద్దడానికి గురువులో సేవాభావం, నిబద్ధత, తాత్వికత పరవళ్లు తొక్కాలి. అప్పుడే అధ్యయన, అధ్యాపనలకు సార్థకత.
                                                       - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు 

No comments:

Post a Comment