ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 27 September 2013

యువతరం


లోచనల్లో వేడి, వాడి లేకపోతే యువకులైనా వృద్ధాప్యాన్ని అనుభవించవలసిందే. పుట్టుకతో అందరికీ గొప్ప భావాలు కలగవు. ప్రపంచాన్ని చూసి, మనుషులు పడే బాధలు, పెనుగులాట బతుకును చూసి ఇదేం జీవితం అనుకుంటే- అప్పుడు అన్వేషణ మొదలవుతుంది.

లోకాన్ని చూసి స్పందించనివాడికి ఆత్మాన్వేషణకు దారి ఎలా దొరుకుతుంది? దుఃఖ నివారణ మార్గం ఎలా తెలుస్తుంది? జగత్తును మనం చూసే విధానాన్ని బట్టే మన భావాలు మారుతూ ఉంటాయి. కొందరు రవ్వంతలో కొండంత సాధిస్తారు. మరికొందరు కొండను అద్దంలో చూసి సంతృప్తి చెందుతారు.

భావాలు మొదట బండల్లాగానే ఉంటాయి. వాటిని చెక్కి శిల్పాలను చెయ్యాలి. ప్రారంభంలో ఆలోచనలు విత్తనాల్లాగానే ఉంటాయి. వాటిని సారవంతమైన మట్టిలో నాటి మొక్కలు చేయాలి. అంతా మనమే చెయ్యాలి.

గొప్ప భావాలు కలిగిన యువకులు, మంచివారైన వృద్ధులు ఇప్పుడు కావాలి. దేశానికి వృద్ధాప్యం లేదు. జీవించేవారి భావాలే దాన్ని కుంగదీస్తున్నాయి. సంస్కృతి తల్లడిల్లిపోవటంలేదు. దాన్ని రక్షించాల్సినవాళ్లే మంటపెడుతున్నారు.

భగవంతుడు ఇచ్చిన దేహాన్ని రక్షించుకోవాలి. మనసుని ఆధ్యాత్మిక భావాలతో జాగృతం చెయ్యాలి. లోకక్షేమం కోసం అవకాశం దొరికినంత మేర ఆచరణాత్మక సాధన చెయ్యాలి. పాత భావాల్లోని గొప్పతనాన్ని నిలబెడుతూ కొత్త భావాలను స్వీకరించి పోషించాలి.

నీరసం, నిస్తేజం, నిర్వీర్యం, జడత్వం, అయోమయం అనే మాటలకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. వెలుగే దాని జీవం. ప్రేమే దాని మార్గం. సత్యమే దాని పరమావధి. వృద్ధులను యువకులను చేస్తుంది. మూర్ఖులను వివేకులను చేస్తుంది. నరపశువులను కూడా నారాయ ణుడి సరసన కూర్చోబెడుతుంది.

శరీరాలు అందంగా ఉంటే సరిపోదు. శ్రీమంతులైతే సరిపోదు. గొప్ప నామగోత్రాలతో జన్మిస్తే సరిపోదు. భావదారిద్య్రం లేకుండా ఉండాలి. లోకంలో దుఃఖానికి తీవ్రంగా స్పందించగలగాలి. మన ఆలోచనలు మనకు, ఇతరులకు దారి చూపించాలి. వయసుతో సంబంధం లేకుండా జ్ఞానాగ్నిని రగిలించుకుంటూ నింగి వైపు దూసుకుపోవాలి. వాళ్లు నిజమైన సంఘసంస్కర్తలు, దైవాంశసంభూతులు.

మన ఆలోచనలను మార్చుకుంటూ కొత్తరకం ఆలోచనలు చేస్తూ మనం సంకల్పించుకున్నది సాధించుకోవాలి. అది చూసి ముందుతరం ప్రేరణ పొందాలి. పిన్న వయసులోనే గొప్ప భావాలు ఎలా కలిగాయా అని వాళ్లు ఆశ్చర్యపోవాలి.

ప్రహ్లాదుడి మాటలకు, భక్తికి అందరూ ఆశ్చర్యపోయేవారు. హిరణ్యకశ్యపుడికి కూడా ఒక్కోసారి మతిపోయి హరినామ స్మరణలో పడిపోయేవాడు. తరవాత సర్దుకుని కొడుకు పట్టుదలకు విస్తుపోయేవాడు.

చిమ్మచీకటిలో చిన్నదీపకళికైనా వెలుగునిస్తుంది. వంశచరిత్రను మార్చేసే ఒక్క బీజం చాలు. తరతరాలు తరిస్తాయి. రాముడు భువిపై నడయాడటం చూసి దేవతలు, రుషులు, తల్లిదండ్రులతో పాటు అయోధ్య పులకించింది. ధరణి పల్లవించింది. విశ్వం శ్లాఘించింది.

పద్నాలుగేళ్లకే నిర్భయులై మారీచ సుబాహులను ఎదుర్కొని విశ్వామిత్రుడికి సహాయం చేసి యాగం పూర్తిచేసిన రామలక్ష్మణుల అనుభవమెంత? జగత్తుకు వారేమి సందేశం ఇచ్చారు?

ఎప్పుడు మన జీవితం మొదలుపెట్టాలి? ఏ వయసులో జ్ఞానోదయం కావాలి?

ఏదో ఒకరోజు అందరం వృద్ధులమవుతాం. కానీ, మన భావాలకు వృద్ధాప్యం రాకూడదు. అవి శిథిలం కాకూడదు. నిత్యనూతనంగా ఉండాలి. దివ్యంగా ఉండాలి. యౌవనంతో తొణికిసలాడాలి.

రథాన్ని వెనక్కి తిప్పకూడదు. శత్రువులకు వెన్ను ఇచ్చి పారిపోకూడదు. నిలబడాలి. కురుక్షేత్రం మధ్యలో నిలబడాలి. జీవన సమరానికి సిద్ధంకావాలి. అప్పుడే దైవ సహాయం అందుతుంది. అంతర్నేత్రం తెరుచుకుంటుంది. సత్యం బోధపడుతుంది. కర్తవ్యం పరుగులు తీయిస్తుంది. విజయం వరిస్తుంది.

మన దేశం గర్వించేలా బతకాలి. ఆలోచనలకు పదునుపెట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మన జీవితంలో ఆధ్యాత్మికత ఒక భాగమై పోవాలి. స్వామి వివేకానందను స్మరించండి- ఇక ప్రతి ఆలోచనా అగ్నిశిఖలా మండుతుంది. నిత్యనూతనంగా పండుతుంది. అదే యువతరం చెయ్యాల్సింది!
- ఆనందసాయి స్వామి

No comments:

Post a Comment