ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 20 September 2013

అప్రమత్తత


లోకంలో చరాచరాలన్నింటికీ కొన్ని అవధులు ఉన్నాయి. అవి సక్రమంగా ఉన్నంతకాలం దేనికీ ఏదీ లోపం ఉండదు. పట్టుతప్పితే మాత్రం అంతా ప్రమాదమే. ప్రమాదాన్నే ప్రమత్తత అంటారు. ఇది లేకుండా అంతా సవ్యంగా ఉండాలంటే అప్రమత్తత చాలా అవసరం.
మనిషి నూరేళ్లూ హాయిగా జీవించాలంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండటం అవసరం. మనిషిని చెడగొట్టేవీ, బాగుపరచేవీ మూడే మూడున్నాయి. అవి మనోవాక్కాయాలు. అంటే మనసు, మాట, శరీరం అన్న మాట. వీటినే 'త్రికరణాలు' అని పెద్దలు అన్నారు. త్రికరణాలంటే పనిచేసే మూడు సాధనాలని అర్థం.

త్రికరణాల్లో మనసు పాత్ర గొప్పది. ఇది అన్నింటినీ బాగుచేయడానికీ, చెడగొట్టడానికీ ఉపకరిస్తుంది. ఇది పాదరసం లాంటిది. ఎప్పుడూ జారిపోతూ ఉంటుంది. ఎంత పట్టుకుందామన్నా దొరకదు. దీన్ని గురించి వేదాంతులు ఎన్నో నిర్వచనాలు చెప్పారు.

మనసు ఒకసారి కిలకిలా నవ్వుతుంది. ఒకసారి భోరున విలపిస్తుంది. భ్రమతో అన్ని దిక్కులకూ పరుగెత్తుతుంది. ఒకనాడు సంతోషంతో వూగిపోతుంది. మరొకరోజు విషాదాన్ని పులుముకొంటుంది. ఒకణ్ని ద్వేషిస్తుంది. ఒకణ్ని ప్రేమిస్తుంది. మంచివాళ్లను తిడుతుంది. చెడ్డవాళ్లను పొగుడుతుంది. ఇదీ మనసు స్వభావం. దీన్ని అదుపులో పెట్టుకోకపోతే అడుగడుగునా కష్టాలే ఎదురవుతాయి. దీన్ని అదుపు చేయడానికి వివేకం కావాలి. విజ్ఞత రాటుతేలాలి. ఆలోచన పదునుతేలాలి. అప్పుడే అప్రమత్తత సాధ్యం. మనసు కోతి వంటిది అనడం అక్షరసత్యం. అలాంటప్పుడు కోతిని అదుపులో పెట్టుకొని, మనిషి తనకు ఇష్టం వచ్చిన తీరులో ఆడించాలేగాని, కోతి చెప్పినట్లు మనిషి ఆడకూడదు. అలా ఆడితే ప్రమాదమే.

మనిషి మాట కూడా చాలా విలువైనది. మాట వజ్రాయుధంలా పని చేస్తుంది. పువ్వులా మెత్తగా తాకుతుంది. బాణంలా మనసుకు గుచ్చుకుంటుంది. బురదలా అంటుకొంటుంది. కనుక మాట్లాడేటప్పుడు అప్రమత్తత అవసరం. మాటల కారణంగా సామ్రాజ్యాలు వైభవంతో వెలిగిపోవడమూ, కాలగర్భంలో కలిసిపోవడమూ అందరికీ తెలిసిందే. అనుకూలమైన మాటలు, వ్యతిరేకమైన మాటలు మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఒక్క సాంత్వన వాక్యంతో- చావాలనుకొనేవాడు బతుకుతాడు. ఒక్క నిందావాక్యంతో- బతకాలనుకొనేవాడు చస్తాడు. ఇదే- మాటకు ఉండే విలువ. అసలు ప్రపంచం అంతా మాట మీదే జీవిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. మాట అంటే శబ్దమే కదా. అది లేకుంటే ప్రపంచం ఎలా ఉంటుందో మహాకవి దండి ఒక్క మాటలో చెప్పాడు- 'శబ్దం అనే దీపం ప్రపంచమంతటా వెలుగుతూ ఉండకపోతే ఈ ప్రపంచమంతా కటిక చీకటిలో మునిగిపోతుంది'. ఈ మాట త్రికాల సత్యం. అందువల్ల జాగ్రత్తగా మాట్లాడాలి. పెద్దలు 'ఆచి, తూచి' మాట్లాడాలని అంటారు. మాట విలువ తెలిసినవాళ్లు అతిగా మాట్లాడరు. సందర్భోచితంగా, మితంగా మాట్లాడతారు. మాట విలువ తెలియనివాళ్లు పనికిరాని మాటల్ని పదేపదే మాట్లాడుతుంటారు. కనుక మాటల్లో అదుపు అవసరం.

మంచి పనులు చేయడానికి భగవంతుడు ప్రసాదించిన గొప్ప సాధనం శరీరం. శరీరం ప్రతిక్షణం విధ్వంసానికి గురి అవుతూ ఉంటుందని అంటారు చార్వాకులు. అంటే అశాశ్వతమైనదని అర్థం. ఈ మాట నిజమే. యౌవనంలో ఉన్నంత అందంగా మనిషి ముసలితనంలో ఎందుకు ఉండటం లేదు? శరీరంలోని అణువులన్నీ అనుక్షణం విధ్వంసానికి గురి కావడమే అందుకు కారణం. ఎలాగైనా నశించిపోయే శరీరాన్ని మంచి పనులతో పవిత్రంగా మార్చుకోవడం మంచిది. మంచి భోజనంతో, వ్యాయామంతో పెంచి పోషించిన శరీరం ఎల్లకాలం ఉంటుందా? ఉండనే ఉండదు. కాలం మూడితే పతనం అవుతుంది. అందువల్ల శరీరాన్ని మంచి పనులతో అప్రమత్తంగా కాపాడుకోవడం అవసరం.

ఏ పని చేసినా త్రికరణశుద్ధిగా చేయాలని మానవ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. త్రికరణాలు (మనసు, మాట, శరీరం) శుద్ధి కావాలంటే అప్రమత్తత అవసరం. సుగుణాల వల్లనే అప్రమత్తత ఏర్పడుతుంది. దుర్గుణాల వల్ల ఏర్పడదు. కనుక మనిషి త్రికరణాల విషయంలో సదా జాగ్రత్త వహించడం శ్రేయస్కరం.
-డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

No comments:

Post a Comment