ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 17 September 2013

పంచామృత కలశం

  వృద్ధాప్యం పాపం కాదు. వృద్ధాప్యం శాపం కాదు. అదో పక్వఫలం. జీవన పోరాటంలో పోరాడి గెలిచి, కాలానికి ఎదురు నిలిచిన విజేత వృద్ధుడు. అయితే అంతటి యోధుడూ భీరువైపోతున్నాడు. డీలా పడిపోతున్నాడు. వయసు మానని గాయంలా బాధపెడుతోంది. భయపెడుతోంది.

ఈ చరాచర సృష్టి యావత్తూ పరిణామశీలమే. ప్రతి ఒక్కటీ మార్పు చెందేదే. నాశనమయ్యేదే. ఆది ఉన్నచోట అంతం తప్పదు. ఈ మధ్యలోదే జీవితం. అనుభవం. పరిణామం. మనిషి జీవితంలోనే నాలుగు ఆశ్రమాలున్నప్పుడు శరీరంలో ఉండవా? అవే బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్యాలు. వానకాలం వచ్చేస్తోందని చీమలు సైతం వేసవిలోనే ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. గుడ్లు పెట్టే సమయానికి ముందే పక్షులు గూళ్లు కట్టుకుంటాయి. అవన్నీ పరిణామాన్ని అంగీకరిస్తున్నాయి. ఆహ్వానిస్తున్నాయి. ఆస్వాదిస్తున్నాయి. బుద్ధి, జ్ఞానాలున్న మనిషి మాత్రం అలా ఎందుకు చేయలేకపోతున్నాడు? పుట్టిన మరుక్షణమే బిడ్డకు అందే క్షీరం అమ్మ అడిగిందా, శిశువు కోరాడా? ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో ఆ మహాధార్మికుడు, దాత ఇచ్చే తీరతాడు. వృద్ధాప్యమూ ఆయన ఇచ్చిందే. ఏం కావాలో ఏం చేయాలో ఆ కర్తకు తెలీదా? కాకపోతే అనుభవించేందుకు మన కర్మఫలాలతోపాటు ఆచరించేందుకు కొన్ని కర్తవ్యాలూ ఉంటాయి. వాటిని విస్మరించి పైకి చూస్తే కళ్లలో దుమ్ము మాత్రమే పడుతుంది. ధూళి మాత్రమే రాలుతుంది.

వృద్ధాప్యం పక్వమై మిగలపండిన ఫలం. నవరసాల అనుభవసారం. గోక్షీరం, గోదధి, గోఘృతం, చక్కెర, చక్కెరకేళీలతో నిండిన పంచామృత కలశం. దుర్భరం, దుర్మార్గం కాదు. పంచదారనైనా పక్వపాకంగా వాడుకోవాలి. లేకపోతే వెగటు పుడుతుంది. మూతగల తగిన పాత్రలో భద్రపరచుకోవాలి. లేకపోతే చీమలు, ఈగలు మూగిపోతాయి. వృద్ధాప్యంలాంటి సున్నిత శారీరక, మానసిక స్థితిని తగినట్లుగా నిభాయించాలి.

వృద్ధాప్యంలో ముందుగా భయపెట్టేది అనారోగ్యం. ఆపై పిల్లల అలక్ష్యం. అవికాక మరెన్నో. వృద్ధాప్యం అనారోగ్యానికి నిర్వచనం కాదు. లేదా అనారోగ్యం వృద్ధాప్యానికి నిర్వచనం కాదు. అలా అయితే ప్రతి వృద్ధుడూ అనారోగ్యాన పడాలి. లేదే!? కొందరు శతాధిక వృద్ధులూ ఉల్లాసంగా జీవించేస్తుంటారు. దీనికి కారణం జీవన విధానం. జీవితాన్ని స్వీకరించే వైఖరి. జీవితం పట్ల తగిన దృక్పథం. చివరిక్షణం వరకూ జీవితాన్ని పూర్తి అవగాహనతో ఆస్వాదించాలనే ఆకాంక్ష అనారోగ్యాన్ని చాలావరకు దూరంగా తరిమేస్తుంది. ముందునుంచీ ఆరోగ్యంపట్ల అవగాహన, శ్రద్ధ, తగిన జీవన విధానం, సానుకూల దృక్పథం... ఇవన్నీ వ్యాధులకు... చికిత్సకు ముందే నివారణగా పనిచేస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండటమన్నది మనకంటే ముఖ్యంగా ఆత్మీయులకు, సమాజానికి ముఖ్యం. అవసరం.

వృద్ధులైనా, పిల్లలైనా చైతన్యవంతమైన పనుల్లో పాలుపంచుకోనివారి పట్ల కొంత ఉదాసీనత సహజమే. సమయాభావం కారణం కావచ్చు. అవసరమైన వ్యక్తుల పట్ల కొంత అధిక శ్రద్ధ వహించే అవసరం కారణమై ఉండవచ్చు. వృద్ధుల ఆరోపణ కొంత నిజమైకూడా ఉండవచ్చు. ఏ వయసువారికైనా ఆదరణలు, ప్రాధాన్యాల్లో అడపాదడపా కొంతకోత తప్పదు. అది వృద్ధులూ అర్థం చేసుకోవాలి. నిస్వార్థంగా, నిష్కామంగా కుటుంబాన్ని ప్రేమించాలనుకున్నప్పుడు, సమాజాన్ని సేవించాలనుకున్నప్పుడు ఈ పట్టింపులు పరిగణనలోకే రావు. రాకూడదు. మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ పోవడమే. దానిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ పోవడమే. అన్నింటికంటే ముఖ్యంగా, జీవితం అత్యంత అమూల్యం. క్షణక్షణం అమృత బిందు సమానం. చివరి క్షణాన్నీ ప్రయోజనకరంగా ఆస్వాదించే దిశగా ప్రణాళిక రచించుకుందాం. వృద్ధాప్య భయాన్ని అధిగమిద్దాం.
- చక్కిలం విజయలక్ష్మి

No comments:

Post a Comment