ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 6 September 2013

ఆధ్యాత్మిక లాభాలు


 మనం ఏ పని చెయ్యాలన్నా ముందుగా దానివల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేసుకుంటాం. ధనం మదుపుచేస్తే, ఏ విధానంలో మనకు అధిక వడ్డీ లభిస్తుందో ఆలోచిస్తాం. సాధారణ వడ్డీనా, చక్రవడ్డీనా? చక్రవడ్డీ అయితే- 'అసలు మదుపు' విలువ చూస్తుండగానే పెరిగిపోతుంది. రోజువారీ వడ్డీ అయితే ఇక వేరే చెప్పేదేముంది? డబ్బు చెట్టు నుంచి లాభాల పండ్లు కోసుకోవటమే!
భూముల మీద పెట్టుబడులకు సంబంధించి సగటుమనిషి ఆలోచన ఇలాగే ఉంటుంది. చవకలో కొని, పది రెట్లో, ఇరవై రెట్లో ధర పెరిగే విధంగా ప్రాంతాలను వెతుక్కుంటాడు. కొంతమంది వ్యాపారులు లాభం వస్తుందనుకుంటే ఏం చేయడానికైనా, ఎంత వెచ్చించటానికైనా వెనుదియ్యరు. కాకపోతే రూపాయి తీయాలంటే పదిసార్లు ఆలోచిస్తారు.

సరిగ్గా ఇలాంటి పద్ధతులనే మనం ఆధ్యాత్మిక విషయాల్లోనూ పాటిస్తున్నాం. ఫలానా వ్రతం చేస్తే సిరిసంపదలు కలుగుతాయనో, ఫలానా దేవుణ్ని అర్చిస్తే సంతానం కలుగుతుందనో ప్రచారంలో ఉన్న విషయాన్ని నమ్ముకుని వాటిని చేస్తుంటాం.

కార్యసాఫల్యానికి గణపతి పూజనీ, లక్ష్మీ కటాక్షానికి లక్ష్మీదేవి పూజనీ, చదువుల కోసం సరస్వతినీ... ఇలా దేనికి సంబంధించిన లాభాల కోసం ఆ దేవతల్ని పూజిస్తుంటారు. అంతే తప్ప, అసలైన ఆధ్యాత్మిక లాభం ఏమిటో అర్థం చేసుకోలేకపోవడం సర్వసాధారణం.

ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో భక్తులకు ఒక ప్రత్యేక పరీక్ష ఉంది. అక్కడ బంగారం అతి చవకగా అమ్ముతారు. ఆ ప్రదేశంలోనే అద్భుతమైన ప్రార్థనా మందిరం ఉంది. అందులో కూర్చున్నవారికి తమ జీవితకాలంలో ఎన్నడూ పొందని ఆధ్యాత్మిక ఆనందం, ప్రశాంతత లభిస్తాయి. కానీ, వారు తమ శరీరం మీద తెల్లని పరిశుభ్ర వస్త్రాలు మినహా ఎలాంటి ఆభరణాలూ ధరించకూడదు. వారి దగ్గర పొరబాటునైనా బంగారం ఉండకూడదు. అలాంటివారిని మాత్రమే ధ్యానమందిరంలోకి అనుమతిస్తారు.

ఒకవేళ మనమే అలాంటి ఆధ్యాత్మిక కేంద్రానికి వెళితే ఎలా ప్రవర్తిస్తాం? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.

ప్రాపంచిక ప్రయోజనం కోరుకుంటే కొనగలిగినంత బంగారాన్ని కొని, ఇంటికి తెచ్చుకుంటాం. నగలు చేయించుకుని మురిసిపోతాం.

ఆధ్యాత్మిక ప్రయోజనం కోరుకుంటే, పరిసరాలను పట్టించుకోకుండా నేరుగా ధ్యానమందిరంలోకి వెళ్తాం. చర్మచక్షువుల్ని మూసుకుని, అంతర్నేత్రాన్ని జాగృతం చేయటానికి ప్రయత్నిస్తాం. భ్రమాభరిత ప్రపంచానికి దూరంగా, అంతర్యామికి దగ్గరగా వెళ్లేందుకు నిజాయతీగా ప్రయత్నిస్తాం. అప్పుడు అంతర్యామి తప్పక ప్రసన్నుడవుతాడు.

ఆధ్యాత్మిక లాభానికే 'పుణ్య'మని పేరు.

ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, దాహార్తులకు నీరు ఇవ్వటం, బాధాతప్తులను ఆదుకోవటం, నిస్సహాయులకు సహాయపడటం, దుఃఖార్తులకు మంచి మాటలతో ఉపశమనం కలిగించటం, కులమతాలకు అతీతంగా అందర్నీ సమభావంతో ప్రేమించగలగటం- ఇవన్నీ అధిక లాభాన్నిచ్చే పెట్టుబడులు. అదృశ్య ఫలాలను ఇచ్చే కల్పవృక్షాలనదగిన సత్కార్యాలివి.

వీటి లాభాలు ఇహపరాల్లో మనల్ని వదలవు. మనతోనే ఉంటాయి.
                                                                   - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 

No comments:

Post a Comment