ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 2 September 2013

ఎవరు గొప్ప?


  పుట్టిన ప్రతి మనిషీ బుద్ధి తెలిసిననాటి నుంచి ఆధిపత్యం కోసం పాకులాడుతుంటాడు. తానే గొప్పవాడినని అనుకుంటాడు. అందరూ తన ఆజ్ఞను పాటించాలని కోరుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల కంటే తాను తక్కువ కావడానికి ఎంతమాత్రం ఇష్టపడడు. ఇది సాధారణంగా మానవనైజం.

ఇంతకూ మనుషుల్లో ఎవరు గొప్ప అనే చర్చ అనాదిగా సాగుతూనే ఉంది. సామ్రాజ్యాలను పాలించే చక్రవర్తులు గొప్పవారని కొందరు, అపార ధనసంపత్తిగల ఐశ్వర్యవంతులు గొప్పవారని కొందరు, ప్రపంచానికి సన్మార్గోపదేశం చేసే యతీశ్వరులు, మహాత్ములు గొప్పవారని మరికొందరు... ఇలా ఎవరికి వారు తాము ఏర్పరచుకొన్న అభిప్రాయాలు ప్రకటిస్తుంటారు. తృప్తిపడుతుంటారు. కాల ప్రవాహంలో కొందరు గొప్పవాళ్లుగా మిగిలిపోతే, మరికొందరు కాలగర్భంలో కలిసిపోయి నామరూపాలు లేకుండా పోతున్నారు.

పూర్వం నీతికోవిదులు ఈ విషయంలో ఎన్నో సత్యాలను ప్రబోధించారు. అలాంటివాటిలో భర్తృహరి ప్రవచించిన 'యతి-నృపతి సంవాదం' ఒకటి. ఇందులో ఒక నరలోక చక్రవర్తికీ, ఒక అధ్యాత్మలోక చక్రవర్తికీ మధ్య జరిగిన సంభాషణల సారం ఉంది. అందులో యతీంద్రుడు ఇలా అంటాడు-

'ఓ రాజా! నీవు రాజువు. నేను గురువుల వల్ల సంక్రమించిన ప్రజ్ఞాభిమానాలు గలవాణ్ని. నీవు ధనంతో ప్రసిద్ధుడివి. నేను సజ్జనుల స్తుతిచే కీర్తిని పొందినవాణ్ని. కనుక నీకూ నాకూ పోలికే లేదు. నీవు నన్ను నిష్కపట బుద్ధితో చూడకపోతే నాకు నీపై ప్రేమ కలగదు. నీ దగ్గర భౌతికధనం ఉంది. నా దగ్గర విద్యాధనం ఉంది. నీవు శూరుడివి. నేను గర్వాన్ని అణచేవాణ్ని. నిన్ను ధనవంతులు ఆశ్రయిస్తారు. నన్ను సామాన్య జనులు ఆశ్రయిస్తారు. కనుక నీవు నాపై వినయాన్ని చూపకపోతే నీతో నాకు పొత్తు కుదరదు. నీవు పట్టు పీతాంబరాలు కట్టుకుంటావు. నేను నారచీరలు కట్టుకుంటాను. అయినా సంతోషంలో నీకూ, నాకూ ఏ భేదమూ లేదు. వ్యత్యాసం అంతకంటే లేదు. నీవు అధికధనాన్ని ఆశిస్తావు. అందువల్ల నీలో అత్యాశ ఎక్కువ. అత్యాశ ఉన్నవాడు దరిద్రుడే అవుతాడు కానీ ధనవంతుడు కాలేడు. నాకు సంతోషం సంపూర్ణంగా ఉంది కనుక నాకు దారిద్య్రమూ లేదు, ఐశ్వర్యమూ లేదు. ఇంతకూ నీవైనా, నేనైనా బతకడానికి ఎంత కావాలి? కడుపునిండ పండ్లు తింటే చాలదా, నీళ్లతో దప్పిక తీర్చుకుంటే సరిపోదా, కట్టుకోవడానికి సామాన్యవస్త్రాలు చాలవా, నిద్రించడానికి నేలమాత్రం సరిపోదా? అర్థం లేకుండా పరుల సొమ్ములను అపహరించాలా? వినోదాలూ, గానాబజానాలు ఎందుకు? మద్యపానాలు ఎందుకు? మగువల కోసం కామవాంఛలు ఎందుకు? ఇవన్నీ సామాన్య జీవితానికి అవసరమా? ఈ లోకమంతా నీది కాదు గదా! ఇంత విశాలమైన ప్రపంచంలో చిన్న భూభాగాన్ని పాలిస్తున్నంత మాత్రాన నీకు ఇంత అహంకారం ఎందుకు? పూర్వం ఎందరో చక్రవర్తులు ఎన్నో సామ్రాజ్యాలను గెలుచుకొని కూడా అన్నింటినీ వదిలేసి పోలేదా? ఎందరికో దానాలు చేయలేదా? వాళ్లంతా పరిపాలించి, అనుభవించి, వదిలేసిన భూమిని నీవు పాలిస్తున్నావు. దీనివల్ల నీకు వచ్చిన గొప్పతనం ఏమిటి? చిన్న రొట్టెముక్కవంటి భూభాగాన్ని పాలిస్తున్న నీవు ఎంత మూర్ఖుడివి? నీ సంతోషానికి ఏమైనా అర్థం ఉందా? చిన్న మట్టి ముద్దలాంటి రాజ్యం కోసం పోట్లాడుకునే రాజులు ఇతరులకు ఏమి దానాలు చేస్తారు? ధనం, అధికారం అంటూ వాటి వెంటపడే రాజులు లోకానికి ఏం ఉపకారం చేస్తారు? కనుక ఎవరు గొప్పవారో ఒక్కసారి ఆలోచించు. ఎన్నో కళలకు నెలవైన చంద్రుణ్ని భగవంతుడైన శివుడు తన తలపై పెట్టుకొన్నాడు. దేవదేవుడి మన్నన పొందిన చంద్రుడు గొప్పవాడు. అలాగే సద్గుణాలతో అందరి శిరస్సులపై మణిలా నిలవగలిగినవాడే గొప్పవాడు. వాడే ధన్యజీవి. అంతేగాని, గొప్పతనానికి రాజ్యాధికారం అవసరం లేదు. డబ్బుతో పనిలేదు. సుగుణరాశి ఒక్కటే చాలు. అదే పదివేలు!' ఈ సంవాదం వల్ల తెలుసుకోవలసింది ఒక్కటే- గొప్పదనం అనేది ఎవరికివారు ఆపాదించుకునేది కాదు.సహజంగానే రావాలి. దానికి నిరాడంబరత, నిర్మలత్వం, త్యాగనిరతి మూల పదార్థాలు. బాహ్యప్రకటనలు ఎంతమాత్రం కావు.
                                                             - డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

No comments:

Post a Comment