ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 8 November 2013

గృహస్థ ధర్మం

లోకాలన్నీ కలిపి పరమాత్మ దివ్యశరీరం. సమస్త దేవతలకు ఆయన శరీరమే గృహం. పంచభూతాలకు తమ అధికార ప్రదేశాలే గృహాలు. భూలోక ప్రాణులకు ఈ చరాచర జగత్తే గృహం. మానవులకు తమ దేహాలే గృహాలు. 
దేహాలను ఆలయంగా వర్ణిస్తుంది వేదం.
ఆ విధంగా ప్రతివారికీ ఒక ఆలయం ఉంది. అది వారి దేహమే. తిరిగి ఆ దేహాలయ రక్షణకు ప్రకృతి వనరులతో మరొక గృహాన్ని నిర్మించుకుంటాడు. అందులో సకుటుంబంగా నివసిస్తుంటాడు. దీన్నే నివాసగృహం అంటారు.
 
స్థిరనివాసం అయితే, అది స్వగృహం. తన ధనంతో నిర్మించుకున్నదన్నమాట. లేదా వారసత్వ ఆస్తిగా లభించినది. ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు నివసించేదాన్ని ఆశ్రమం అంటారు. భగవంతుడి విగ్రహాలకు ఆవాసంగా నిర్మించేది కోవెల. అంతరాలయంలో మూలవిరాట్టును ఉంచుతారు. 

ఎవరు గృహ యజమానో అతడే గృహస్థు. వివాహితుడు, భార్యాసమేతుడు అయితే అతడు పూర్ణగృహస్థుడు. భార్యలేనివాడు అర్ధగృహస్థుడు. భార్యకు వివాహమంత్రాల ద్వారా అర్ధశరీర హోదా కల్పిస్తారు. ఆమె అర్ధాంగి అవుతుంది. ఆ క్షణం నుంచీ భార్యాభర్తలిద్దర్నీ గృహస్థులంటారు. యజమాని గృహస్థుడు, యజమానురాలు గృహిణి. 

వేదవిహితమైన సమస్త కర్మలు భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాల్సిందే, లేకపోతే ఫలితాలు లభించవని చెబుతారు. సీతాపరిత్యాగం తరవాత శ్రీరాముడు అశ్వమేధయాగానికి సిద్ధపడతాడు. ప్రత్యామ్నాయంగా స్వర్ణసీతను పక్కన ఉంచి యాగాన్ని పరిసమాప్తి చేస్తారు. 
పర, అపర కర్మలు, పూజలు, వ్రతాలు దంపతసమేతంగానే నిర్వహించాలి. అలా చేయాలంటే ఇద్దరిదీ ఒకేమాట, ఒకేమనసు, ఒకేరీతిగా ఉండాలి. దానినే దాంపత్యధర్మం అంటారు.
గృహస్థధర్మం విస్త్రృతమైనది. గృహిణి తన గృహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలి. పరిశుభ్రతను పాటిస్తూ, గృహదేవతలకు (వీరే ఇలవేల్పులు) నివాసయోగ్యంగా, వారు ప్రసన్నులయ్యే విధంగా గృహాన్ని నిర్వహించాలి. ఇంటికి ఇల్లాలే లక్ష్మి. ఆమె సంతోషంగా, ప్రసన్నంగా ఉంటూ అతిథి అభ్యాగతుల్ని ఆదరంగా చూడాలి. అతిథుల్ని విష్ణుస్వరూపాలుగా భావించమంటుంది మన ధర్మం. 

ఆదిశంకరులు భిక్షకు వెళ్లినప్పుడు కటిక బీదరాలు కేవలం ఒక ఉసిరికాయను మాత్రమే సమర్పించుకుంది. ఆ క్షణంలోనే ప్రసన్నులైన ఆదిశంకరులు ఆశువుగా కనకధారాస్తోత్రం చదివి కనక వర్షం కురిపించారని చెబుతారు. ఇదీ, ఆతిథ్యఫలం.
అతిథులందరూ కనకవర్షాలు కురిపించలేరు. కానీ, అందుకు సమానమైన ఆశీస్సులు కురిపిస్తారు. 
గృహిణి తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించే విధంగా గృహస్థు ఏర్పాట్లు చేయాలి. అప్పుడే గృహస్థధర్మాలు సవ్యంగా నిర్వర్తించడం సాధ్యపడుతుంది. రెండు చేతులు కలిస్తేనే పని చేయగలం. రెండు కళ్లూ ఒకే దృశ్యాన్ని చూసినప్పుడే స్పష్టత ఉంటుంది. ఒక కన్నుతో స్పష్టత ఉండదు. భార్యాభర్తల విషయం కూడా ఇంతే. ఏకస్తులుగానే వ్యవహరించాలి. భార్యాభర్తల అభిన్నత్వం రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములతో పోల్చదగింది.
శరీరం గృహం కాబట్టి, శరీరధర్మాలను శాస్త్రోచితంగా నిర్వహించాలి. శరీరానికి నివాసగృహం ఉంటుంది గనక, గృహస్థధర్మాలు ప్రత్యేక శ్రద్ధతో పాటించాలి. ప్రపంచమూ గృహంతో సమానం గనుక సర్వప్రాణుల్ని తన గృహంలోని సహజీవులుగా, సమానాధికారాలు గలవారిగా గుర్తించి, ఆత్మీయంగా, ప్రేమాస్పదంగా వ్యవహరించాలి. ప్రపంచ గృహానికి పరమాత్మే నిజయజమాని గనుక, ఆయన పట్ల భక్తిశ్రద్ధలు, విధేయత కలిగి ఉండాలి. సర్వమూ ఆయన సంపదే గనుక వాటి విలువల్ని కాపాడాలి. అందరి సంతోషమూ మన సంతోషంగా భావిస్తే ప్రపంచం ఆనంద నిలయమవుతుంది. ఆ విధంగా ప్రవర్తించటమే అసలైన, సిసలైన గృహస్థ ధర్మం.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 

No comments:

Post a Comment