ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 22 August 2013

సర్వవ్యాపక దైవం


ప్రపంచమంతటా పరమాత్మ పరివ్యాప్తమై ఉన్నాడని ఈశావాస్యోపనిషత్‌ చెబుతుంది. విచిత్రమేమిటంటే ఆ పరాత్పరుని చూసే శక్తి మన ఇంద్రియాలకు ఏమాత్రం లేదు. అనంత రూపాలు, నామాలు కనిపిస్తాయి కానీ ఆయన దివ్య సాన్నిధ్యం అనుభూతికి రాదు.

భగవంతుడి సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిని, సర్వవ్యాపకత్వాన్ని ఆయన యోగమాయా మహత్యం దాచిపెడుతుంది. భగవంతుడి గొప్పతనాన్ని తెలుసుకున్న వారికి సైతం ఆయన వ్యక్తంకాడు. ఆయన్ని కళ్లారా తిలకించాలంటే సాధన కావాలి. అదృష్టం ఉండాలి. ఆయన కారుణ్యం కావాలి. భగవంతుడి దర్శనానికి సాధన ఒక సుదీర్ఘ ప్రస్థానం. అది కష్టసాధ్యమని అనుకుంటే భగవంతుడు ఈ ప్రకృతిలో దొరకడు. ఎన్ని యుగాలైనా సాధనచేస్తే తప్పక కనిపిస్తాడన్న ఉత్సాహం ఉండాలి. కష్టసాధ్యమైన ఆవిష్కరణలు ఎన్నో మనిషి ఈ జన్మలోనే సాధిస్తున్నాడు.

మన ఇంద్రియాలు, మనసు, మేధ ప్రాపంచిక వస్తువులను, అందచందాలను జీవితకాలమంతా చూసినా ఆ తృప్తికి అంతు ఉండదు. వీనులకు మధుర ధ్వనులు వినిపిస్తుంటాయి. కళ్లు ప్రాపంచిక సౌందర్యాలను తనివితీరా చూస్తుంటాయి. ఈ అనంత విశ్వం అనంత మనోజ్ఞత్వం మనసును పరవశింపజేస్తుంది. ప్రపంచంలో అంతులేని బంధాలు ఏర్పరచుకుంటాం. ప్రాణికోటికి అతీతంగా, వస్తువులకు ఆవల దివ్యసాన్నిధ్యాన్ని చూసే శక్తి జ్ఞానం ద్వారా లభిస్తుంది. ఈ విశ్వమంతా భగవంతుడి దివ్య లీలా ప్రాభవంగా జ్ఞానికి గోచరిస్తుంది. ఇంద్రియాలకు అంతులేని తృప్తి ఉన్నట్లు, ఆత్మకు అంతులేని ఆనందం ఉంది. అదే దైవం.

ఈ లోకంలో అవతార మూర్తులు, సాధువులు, పుణ్యపురుషులు ఉన్నారు. వారు ఎప్పుడూ ఉంటారు. కొందరి దృష్టిలో కుహనా అవతారులు, దొంగ సాధువులు కనిపిస్తుంటారు. భక్తులు అవతారాలుగా వారిని ఆరాధిస్తుంటే, వారి తెర వెనుక 'లీలలు' ఆరా తీస్తుంటారు కొందరు. భగవంతుడు అంతటా ఉన్నప్పుడు కొందరు భావిస్తున్నట్లు కుహనా అవతారాల్లో కూడా ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు. వాల్మీకి దొంగగా, వేటగాడిగా ఉన్నప్పుడు సైతం రాముడు ఆయనలో శోభిల్లుతున్నాడు. వాల్మీకి తపస్సువల్ల రాముడు మరింత స్పష్టంగా, పూర్ణంగా కనిపించాడు. స్త్రీ వ్యామోహంవల్ల రావణాసురుడు శివభక్తి తత్పరుడు కాకుండా పోయాడా?

భగవంతుడు ఆయా ఉపాధులకు తగినట్లు, అంతంతమాత్రంగా జీవుల్లో అదృశ్యుడై ఉంటాడు. పూర్ణ అవతార స్వరూపంలో ఆయన నిండుగా ప్రకాశిస్తాడు. యుగానికి ఒక్కడిగా, ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక బుద్ధుడిగా మనకు దర్శనమిస్తుంటాడు.

ఒక రాజు ఉండేవాడు. ఆయన సాధువుల్లో తేడాలు చూడకుండా, అందరినీ మంచివారిగానే తలచి గౌరవించేవాడు. మంత్రి మాత్రం ఒక మంత్రగాడు రోడ్డుపై ఇంద్రజాల విద్యలను ప్రదర్శించడం గమనించాడు. అతడు దొంగ సాధువు అని మంత్రికి తెలుసు. కానీ, ఆ సాధువు రాజునుంచి బహుమతి అందుకొన్నాడు. మంత్రి రాజును నమ్మించడానికి సాధువు చేసే ఇంద్రజాల విద్యల్ని చూపించాడు. రాజుమాత్రం నిశ్చలంగా ఉండి- 'ఈ దొంగ సాధువులో కూడా నాకు భగవంతుడి దివ్య సాన్నిధ్యం కనిపిస్తోంది' అన్నాడు. అతిలోక రమణీయమైన గులాబీ పువ్వులోనూ, ఎవరూ గమనించని గడ్డిపువ్వులోనూ, గడ్డిపరకలోనూ భగవంతుడు ఒదిగి ఉన్నాడు. కంటికి కానరాని తొలి జీవి అమీబాలో దైవత్వం లేకపోతే, అద్భుతావహమైన పరిణామం జరిగి మానవుడు ఈ మట్టిలో పుట్టి ఉండేవాడు కాడు!
                                                                                         - కె.యజ్ఞన్న 

No comments:

Post a Comment