ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 26 August 2013

సహజమార్గం


 మనిషి ఈ భూమిపైన మరిమరి వూపిరి పోసుకోవటానికి కారణం- కర్మఫలం అనుభవించటానికే. ఆ మాటే నిజమైతే- ఆలోచించటానికి మనసు, ఎలాగైనా జీవించాలన్న ఆలోచన, మనసులో ఏ భావం ఉన్నా దాన్ని కట్టడి చేసి నలుగురు మెచ్చుకునేలా మాట్లాడే వాక్‌చాతుర్యం, కంటితో ప్రత్యక్షంగా చూడగలగడం, చెవితో పరోక్షంగా వినగలగడం- వీటితో పనేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం- కర్మ కోసమే కాకుండా ఈ జన్మలో ఆత్మోన్నతి సాధించటమే ముఖ్యమైన కారణమని చెప్పక తప్పదు. అలాంటి ఉన్నతమైన ఆదర్శం లేకపోతే, మనిషి కావటంకన్నా అడవిలో మానై నిలిచిపోవటం నయం. మనిషిగా పుట్టడమే ఒక గొప్పవరం అయినప్పుడు అది శాపం కాకుండా కాపాడుకుంటూ, జీవితంలో ఉన్నతశిఖరం అందుకోవటం ఎంతో ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతూ, శిఖరాగ్రం చేరుకోవటానికి ఈ శరీరాన్ని, మనసును, అందుబాటులో ఉన్న జీవితావకాశాల్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. అందుకు ఏం చేయాలి? ఇది రెండో ప్రశ్న.

రుషులు, దార్శనికులు ఇందుకు తగ్గ మార్గనిర్దేశం ముందుగానే చేశారు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా, ఆ మార్గదర్శకాలను జీవితంలో అమలుపరచటమే. మనకు శ్రమలేకుండా, వేదవేత్తలు నాలుగు ఆశ్రమధర్మాలను అందజేశారు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం- ఈ నాలుగింటిని శిఖరాగ్రం చేరటానికి మేడమెట్లలా ఉపయోగించుకోవాలి.

మనిషి ఒక జీవితకాలంలో ఇహమైనా పరమైనా సాధించాలనుకుంటే, ఒక లక్ష్యం ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒక పథకం ప్రకారం ఆ లక్ష్యం వైపు సర్దుబాట్లు, దిద్దుబాట్లు చేసుకుంటూ- అడుగు ముందుకు వెయ్యాలి. ఈ పనిని నిర్దుష్టంగా, నిర్దిష్టంగా చేపట్టడానికి బ్రహ్మచర్యాన్ని మించిన అవకాశం లేదు. జిజ్ఞాస, జ్ఞానసముపార్జన, పరిశీలన, విశ్లేషణ... ఇవన్నీ నిర్విఘ్నంగా చేయటానికి ఏ చీకూచింతా లేని బ్రహ్మచర్య ఆశ్రమమే ఆదర్శప్రాయమైన సమయం. గార్హస్థ్యంలో ఒక కుటుంబ యజమానిగా సంసార సాగరం ఈదటంవల్ల జీవితంలోని లోతుపాతులు తెలుసుకోవచ్చు. అంతకుమించి, అనుభవపూర్వకంగా ఇంద్రియాల లాలస, విషయభోగాల స్వభావం గ్రహించవచ్చు. భోగించి యోగించటమే ఉత్తమమైందని, జీవితాన్ని కాచి వడబోసిన వేమన తన వేదంలో చెప్పాడు. అసలైన వైరాగ్యానికి సిసలైన వేదిక గృహస్థ జీవితమే. మూడోదైన వానప్రస్థం మహాప్రస్థానానికి ఒక ఉపోద్ఘాతంగా చెప్పుకోవచ్చు. సహనం దాని సారాంశం. రాజులు రాజర్షులై భర్తృహరిలా సుభాషితాలు, హితబోధకాలైన గ్రంథరచనలు, ధర్మ, న్యాయసూత్రాలు సృష్టించింది ఈ స్థితిలోనే. చరమ పాదమైన సన్యాసం జీవన పరిసమాప్తికోసం నిర్దేశితమైంది. కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కర్తవ్యకర్మ ఆచరించేవాడే నిజమైన సన్యాసి, యోగి అంటోంది గీత. ఒక సమన్వయకర్తగా మనిషి ఎదుగుదలకు నిదర్శనమే సన్యాసం. అలాంటి నిఖార్సయిన సన్యాసి కాషాయం కట్టి, సిగచుట్టి, విభూతిపెట్టి, కమండలం పట్టి వూరూ, వాకిలీ వదిలి వెళ్లవలసిన అవసరం లేదు. మనలాగే మన మధ్యనే ఉంటూ, తామరాకుపైన నీటిచుక్కగా నిలవటమే జీవిత సాఫల్యం. ఈ జీవన్ముక్తి వివేకమే సర్వగమ్య మోక్షానికి సహజమైన మార్గం.
                                                                           - ఉప్పు రాఘవేంద్రరావు

No comments:

Post a Comment