ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 10 November 2013

మానవత


ప్రాణులకు పునరుత్పత్తి శక్తి దైవప్రసాదం. సంతానంపై అంతులేని మమకారం వాటికి కొంతకాలం ఉంటుంది. ఆ ప్రేమే పిల్లలకు శ్రీరామరక్ష. జంతువులు పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి. పక్షులు ఆహారం తెచ్చి పిల్లల నోటికి అందిస్తాయి. పిల్లలు రెక్కలు వచ్చి ఎటో ఎగిరిపోతాయి. పశువులూ అంతే! దేనికి అదే!
మనుషులు అలా కాదు. తల్లీ, తండ్రీ, పిల్లలూ... ఒక కుటుంబ వ్యవస్థ. ఈ బంధం శాశ్వతం. పిల్లలకు ఒక బాధ్యత ఉంటుంది. 'తల్లి దైవం, తండ్రి దైవం' అని వేదఘోష. వాళ్లు జీవించినంతకాలం గౌరవంతో, భక్తితో చూడాలి. వాళ్లు స్వర్గస్తులైన తరువాతా భక్తితో స్మరించాలి. ఇలా శ్రద్ధను ప్రదర్శించడమే 'శ్రాద్ధం'.

తల్లిదండ్రులు తమ సంతానం కోసం ఏ త్యాగానికీ వెనకాడరు. తాము తినీ తినకా బిడ్డలను చక్కగా పోషిస్తారు. వారి త్యాగాలను బిడ్డలు సదా స్మరిస్తూ ఉండాలి. కని పెంచడం అనేది కేవలం భౌతిక ధర్మంగా భావించకూడదు. తల్లిదండ్రులకు, బిడ్డలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు మధ్య ఉండే అనిర్వచనీయ బంధం పవిత్రతను సంతరించుకుంది.

మన సంస్కృతిలో భార్యాభర్తల బంధానికి దైవమే సాక్షి. ఈ సంబంధాలన్నీ మన పురాణేతిహాసాల్లో ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. భరతుడు అన్నగారి పాదుకలను శిరస్సున పెట్టుకుని పూజించాడు. శ్రీరామునితోపాటు ఒక వైపు తమ్ముడు లక్ష్మణుడూ, ఇంకోవైపు సీతాదేవీ పూజలందుతారు. వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు త్యాగం, ప్రేమ, స్నేహం, దయ, వాత్సల్యం, భక్తి... మొదలైన ఉత్తమ గుణాలతో కూడినవి. ఇవన్నీ దైవాంశలు. వీటిని రసవత్తరంగా వర్ణిస్తూ మహాకవులు కావ్యాలనూ, నాటకాలనూ మనకు ప్రసాదించారు.

మానవ సంబంధాలు ఎలా ఉండాలో భాసమహాకవి తన రూపకాల్లో గొప్పగా చిత్రించాడు. 'మధ్యమ వ్యాయోగం' రూపకంలో తల్లిదండ్రులకూ సంతానానికీ మధ్య ఉండే అనుబంధం, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడానికి సిద్ధపడే ఘట్టం హృదయాలను కరిగిస్తుంది. కళ్లు చెమ్మగిల్లేట్లు చేస్తుంది.

ఒక వృద్ధుడి కుటుంబం అరణ్యమార్గంలో పోతూ రాక్షసుడి చేతిలో పడింది. ఆ రాక్షసుడు మంచివాడే! కానీ, తల్లి ఆజ్ఞ చొప్పున, ఒక మనిషిని ఆమె తినడానికి పట్టుకుపోవలసి వచ్చింది! మాతృభక్తి పరాయణుడైన రక్కసుడు ఈ కుటుంబాన్ని పట్టుకున్నాడు. తల్లీ, తండ్రీ, ముగ్గురు కొడుకులు- ఇదీ, ఆ బాటసారుల కుటుంబం. వారిలో ఒకర్ని విడిచిపెడితే, మిగతావారికి హాని తలపెట్టకుండా వదిలివేస్తానని ఆ రాక్షసుడు పలికాడు. 'నేను వృద్ధుణ్ని. సంసారఫలం గ్రహించినవాడిని. నన్ను తీసుకుపో!' అన్నాడు వృద్ధుడు. 'భారతీయ స్త్రీ ముత్తయిదువుగానే జీవితాన్ని ముగించాలనుకుంటుంది కాబట్టి నన్ను నీ వెంట తీసుకువెళ్లు!' అంటుంది ఆ మాతృమూర్తి. ఇలాగే వరసగా ఆ ముగ్గురు కుమారులూ నేను వస్తానంటే నేను వస్తానని ఆ రాక్షసుడి ముందుకు వస్తారు. అందరి లక్ష్యమూ ఒక్కటే. తాను బలియైనా మిగతావారిని రక్షించాలి! వాళ్ల దృష్టిలో త్యాగమే గొప్పది. కుటుంబసభ్యుల రక్షణ కోసం తన ప్రాణం అర్పించడం మహద్భాగ్యం అని ప్రతివారూ భావిస్తున్నారు. తాను పోయినా మిగతావారు క్షేమంగా ఉంటే చాలు! లోకమే తమ కుటుంబంగా మహాత్ములు భావిస్తారు. 'లోకం సమస్తమూ సుఖంగా ఉండాలి' అని మన సనాతన ధర్మం ఉపదేశిస్తున్నది. లోక క్షేమం కోసం తమ జీవితాన్ని హారతి కర్పూరం చేసిన మహాత్ములు దైవసమానులు. భాసుడి 'మధ్యమ వ్యాయోగం' రూపకంలో ఆ పేదకుటుంబ సభ్యుల సంభాషణ విని ఆ రాక్షసుడే చలించిపోతాడు. అతడెవరో కాదు- ఘటోత్కచుడే! అతడు తన తల్లి హిడింబి కోరికను అనుసరించి ఒక మానవుణ్ని పట్టుకువెళ్లడానికి వచ్చాడు. కేవలం తన భర్త భీమసేనుణ్ని దర్శించడానికే హిడింబి ఈ యుక్తి పన్నింది కానీ, నరమాంస భక్షణ కోసం కాదు! అది వేరే కథ. మమతలు ఉన్న చోట మానవత్వం ఎలా పరిఢవిల్లుతుందో చెప్పడానికి భాసుడు మధ్యమ వ్యాయోగంలో ఈ సంఘటన కల్పించాడు.

ఈ మహాకవే రచించిన 'వూరుభంగం' రూపకం- దుష్టుడు సైతం తుది క్షణాల్లో పశ్చాత్తాపం చెందితే, మానవతా లత మరుక్షణమే పుష్పించి, ముక్తి అనే ఫలాన్ని ప్రసాదిస్తుందని నిరూపిస్తుంది. దుర్యోధనుడు ప్రాణం విడిచే ఘట్టం అది. తల్లిదండ్రులతో, గురువుతో, కుమారుడితో, భార్యలతో అతడు సంభాషించిన తీరు ఉత్తమ మానవత్వానికి మచ్చుతునక. తాను గతంలో చేసిన అమానవీయ కృత్యాలను పశ్చాత్తాపంతో గుర్తుచేసుకుంటాడు. ద్వేషం కంటే ప్రేమే గొప్పదంటాడు. హింసకు స్వస్తిచెప్పాలంటాడు. అంతా శ్రీకృష్ణుడి లీల తప్ప వేరేమీ కాదని అతడు గ్రహించడంతో మోక్షం పొందుతాడు. తెలిసి చేసినా, తెలియక చేసినా, కర్మకొద్దీ చేసినా, తుది క్షణాల్లోనైనా హృదయపరివర్తన చెంది భగవన్నామం జపిస్తే సత్ఫలం లభిస్తుందని భాసుడు భంగ్యంతరంగా ఈ రూపకంలో చెప్పాడు. పాండవులను అష్టకష్టాలపాలు గావించిన సుయోధనుణ్ని సైతం మానవతా దృక్కోణం నుంచి చూసిన భాస మహాకవి- వ్యాస హృదయాన్ని తన రూపకాల్లో రసవత్తరంగా ఆవిష్కరించి, లోకంలో శాంతి, అహింసలే ముక్తికి మార్గాలని సూచించాడు.
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment