ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 7 August 2013

సహనంతో అహం దహనం

హనం మానసిక పరిపక్వతగల శక్తి. కష్ట సమయాల్లో ఉద్వేగం కలిగినప్పుడు సమస్యను దాటవేయాలన్నా, వాయిదా వేయాలన్నా సహనం అనివార్య లక్షణం. అనుకున్నది జరగనప్పుడు, మౌనంగా చిరునవ్వుతో ఆ పని జరిగేవరకు నిరీక్షిస్తుండటమే సహనం. ఈ సద్గుణం ఉన్నవారు స్థితప్రజ్ఞులవుతారు. సహనం మనిషిని సాత్విక పురుషుడిగా తీర్చిదిద్దుతుంది.

మనిషిలో సహజంగా తొందరపాటు అనే బలహీనత ఉంటుంది. అనుకున్న పని వెంటనే అయిపోవాలనుకుంటాడు. సందర్భాసందర్భాలు, ఉచితానుచితాలు, న్యాయాన్యాయాలు ఆలోచించడు. జరిగిన పని సత్ఫలితాలు ఇవ్వకపోతే అంతర్విశ్లేషణ చేసుకోడు. భగవంతుడినో, ఇతరులనో నిందిస్తాడు. ఆపద కలిగినప్పుడు డీలా పడిపోతాడు. భయపడిపోతాడు. ఆవేశం వచ్చినప్పుడు ఆలోచన కోల్పోయి అక్కసు వెళ్లగక్కుతాడు. కొంత సహనంతో, కొంచెం ఓపికతో, ఆలోచనతో నిగ్రహంగా ఉంటే వివేకం మేల్కొని సరైన దారి చూపుతుంది. 'సత్యమేవ జయతే'- సత్యం వల్లనే విజయం లభిస్తుందని ముండకోపనిషత్తు చెబుతోంది. ఆ సత్యాన్ని గెలిపించేందుకు సహనం తప్పనిసరి. హరిశ్చంద్రుడు సహనం వల్లనే సత్యవ్రతుడని శ్లాఘనీయుడైనాడు. అర్జునుడు సహనశీలుడు కావడంవల్లనే పలు విజయాలు సాధించి విజయుడనిపించుకున్నాడు. శివసహస్రనామాల్లో శివుడికి 'సుసహః' అన్న పేరుంది. 'సహిష్ణు' అని విష్ణు సహస్రనామాలలో ఉంది. శివకేశవులు సహనమూర్తులు.

మహా భారతంలో వాసుదేవుణ్ని దుర్యోధనుడి వద్దకు రాయబారిగా పంపే సందర్భంలో ధర్మరాజంటాడు- 'పగను పెంచుకోకూడదు. దాన్ని అణచుకోవటమే శుభం, సుఖం. నిప్పుతో నిప్పు చల్లారదు. పగతో పగ చల్లారదు!' ఆ సహనగుణం వల్లనే ధర్మజుడు సంగ్రామంలో విజేత అయ్యాడు.

అల వచ్చినప్పుడు తలవంచితే, తలమీంచి వెళ్లిపోతుంది. అదే నిటారుగా అహంతో నిలుచుంటే దెబ్బతగులుతుంది. ఎదుటివారు కోపంలో నిందిస్తుంటే కొన్ని క్షణాలు మౌనంగా ఉంటే జరిగే నష్టమేమిటి? పైగా ఎదుటివాడే తన తప్పును తెలుసుకునే అవకాశమిచ్చినవాళ్లమవుతాం కదా! 'క్షమయా ధరిత్రీ' అనేది కేవలం స్త్రీలకోసమే కాదు, పురుషులకూ వర్తిస్తుంది. భూమి నుంచి ప్రతి మనిషీ నేర్చుకోవలసింది 'సహనం' అనే మహాగుణం. దూషణభూషణ తిరస్కారాలకు స్పందించనివాడే సహనమూర్తి.

వెలుగు నీడల్లా కష్టసుఖాలు అందరి జీవితాల్లోనూ తారసిల్లుతాయి. ఆపదల్లో సహనం అలవరచుకుంటే, తేలిగ్గా గట్టెక్కే అవకాశముంటుంది. అరణ్య, అజ్ఞాతవాసాల్లో పాండవులంతటి వాళ్లు అష్టకష్టాలు అనుభవించారు. ఎవరినీ నిందించలేదు. ఒకరినొకరు నిందించుకోనూ లేదు. ఓర్పుతో అవకాశం కోసం నిరీక్షించారు.

'ఆవేశం అనర్థదాయకం, సహనం సర్వజనామోదం' అని ఆర్యోక్తి. మనసు భావోద్వేగాల నిలయం. నిగ్రహం కోల్పోయిన మనసు మనిషిని నరకకూపంలో పడేస్తుందని ఉపనిషత్కథనం. సహనం ఓ వజ్రకవచం. ఆపదలో ఆదుకుంటుంది. దుఃఖంలో సాంత్వన చూపుతుంది. సహన సంపద ఆత్మస్త్థెర్యాన్నీ వివేచనను ప్రసాదించి, మనిషిలో మానవీయ విలువల కలువలు పూయిస్తుంది. రాగద్వేషాలను మదినుంచి తరిమేస్తుంది. అహాన్ని దహించేస్తుంది.

ఏసుక్రీస్తు తనను సిలువవేసి హింసించిన వారిపట్ల క్షమాగుణం ప్రదర్శించి, మహనీయుడయ్యాడు. మహత్తరమైన మనోబలం సాధించాలంటే అంతశ్శత్రువులను జయించాలి. చిత్తశుద్ధితో మనసున ఒక బిందువుమీద కేంద్రీకృతం చేస్తే ఏకాగ్రత సిద్ధిస్తుంది. దీన్నే యోగా, ధ్యానం, తపస్సు అంటాం. సహనగుణ సముపార్జనకు వీటిని అలవరచుకోవాలి. పరమగయ్యాళి అయిన భార్య సభలో కూర్చుని ఉన్న భర్త సోక్రటీస్‌ మీద బిందెడు నీళ్లు ఆగ్రహావేశాలతో గుమ్మరిస్తే 'ఉరుము ఉరిమాక కురవడం సహజమే కదా!' అంటూ తన ఓర్పును చూపించాడు ఆ తత్వవేత్త!

ఒక ఉత్సవంలో వూరేగింపుగా దేవత విగ్రహాన్ని తెస్తున్నారు. దాన్ని చూసిన ఓ పడికట్టురాయి అంది- 'నీవూ రాయివే, నేనూ రాయినే. మరి నీకెందుకీ పూజలూ, వూరేగింపులు, త్రాసులో నాకీ ఖర్మేంటి?'. విగ్రహం అంది- 'పిచ్చిదానా! ఉలిదెబ్బలను సహించి, ఎన్నో నెలలు శిల్పి ముందు నిలుచున్నాను. శిల్పి సుత్తితో ఎన్నిసార్లు కొట్టినా భరించాను. ఆ సహనం వల్లనే నాకీ అర్చనం, ఆరాధనం కలుగుతున్నది. పడికట్టు రాయి తలవంచుకుంది. అంగుళం నాలుకను అధీనంలో ఉంచుకోగల మనిషే మనీషి అవుతాడు. మితభాషి మాటలు ఇతరులకు అసహనం కలిగించవు. అసహనం ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధం కలిగిస్తుంది. సామాన్యుణ్ని మాన్యుణ్ని చేసేది సహనమే. అహాన్ని దహనం చేసేదీ సహనమే. అందుకే ఆవాహనం పలుకుదాం సహనానికి!                                                                    - చిమ్మపూడి శ్రీరామమూర్తి

No comments:

Post a Comment