ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 1 November 2013

ధన త్రయోదశి


రోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. 'అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అకాల మత్యుభయాలు లేకుండా, సిరి సంపదలతో విలసిల్లాలి'- అనే శుభాకాంక్షలకు నేపథ్యమే ధనత్రయోదశి పర్వదినం. సంపదలతో తులతూగడానికి లక్ష్మీదేవినీ, సంపూర్ణ ఆరోగ్యంకోసం ధన్వంతరినీ, సుస్థిర ఆర్థిక వృద్ధికి కుబేరుణ్నీ, అపమృత్యు బాధలు తొలగడానికి యమధర్మరాజును వివిధ రీతుల్లో ధన త్రయోదశినాడు పూజిస్తారు.
ధన త్రయోదశికి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. లక్ష్మీదేవిని నరక చెరనుంచి విముక్తి చేసి, శ్రీహరి ఆమెను ధనాధిష్ఠాన దేవతగా ప్రకటించి, ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.

సకల సిరులకు, అష్త్టెశ్వర్యాలకు, నవ నిధులకు, సుఖసంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ధన త్రయోదశినాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విశిష్టమైన పర్వదినంనాడు మనం ఏ భావనతో ఉంటామో, అదే భావం సంవత్సరమంతా కొనసాగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కారమైన రోజు కాబట్టి ఈ ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీంతో ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మీ కృపాకటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ని ధన త్రయోదశినాడు వ్రతాచరణ పూర్వకంగా ఆరాధిస్తారు. కుబేరుణ్ని కుబేర యంత్రసహితంగా పూజించడంవల్ల అక్షయ సంపదలు అందుతాయని భావిస్తారు. ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలతోపాటు రాగి, పంచలోహ పాత్రలు కొనుగోలు చేస్తారు. రాబోయే సంవత్సరానికి ఇది సమృద్ధిదాయకమని నమ్ముతారు. అలాగే ఈ పర్వదినంనాడు ఇతరులకు రుణాల్ని ఇవ్వకపోవడం, వృథా ఖర్చులు చేయకపోవడం వంటివి సంప్రదాయాలుగా పాటిస్తారు.

పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి. విష్ణుమూర్తి అనేక అవతారాల్లో ధన్వంతరీ స్వరూపం కూడా ఒకటి. ధన త్రయోదశినాడే ధన్వంతరి క్షీరసాగర మథన సందర్భంలో అమృతకలశంతో ఉద్భవించాడంటారు. శ్రీహరి ఆయనకు 'జలుడు' అని నామకరణం చేశాడంటారు. ఆరోగ్యంగా జీవించడానికి ఉపయుక్తమైన ఆయుర్వేదానికి ధన్వంతరిని అధిపతిగా నియమించాడని చెబుతారు. సప్త ధాతువుల్లో బంగారానికి వైద్యపరమైన శ్రేష్ఠత అధికంగా ఉందనీ, స్వర్ణభస్మ సేవనంవల్ల మనిషి జీవన కాలాన్ని పెంపొందించుకోవచ్చని ధన్వంతరి వెల్లడించాడు. ధన త్రయోదశికీ, బంగారానికి అవినాభావ సంబంధం ఏర్పడటానికి ఇది కూడా ఓ కారణంగా చెబుతారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, వారణాశిలో, తమిళనాడులోని శ్రీరంగంలో, కేరళలోని అష్ట ధన్వంతరీ ఆలయాల్లో ధన్వంతరిని ధన త్రయోదశి నాడు విశేషంగా ఆరాధిస్తారు.

ఉత్తర భారతదేశంలో ధన త్రయోదశిని 'ధన్‌ తేరస్‌' పేరిట నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా ఉత్తరాది పండుగే అయినా ప్రస్తుతం దేశమంతా వ్యాప్తి చెందింది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ అనే అయిదు పండుగల సమాహారానికి ధన త్రయోదశి శుభశ్రీకారం చుడుతోంది. ఆరోగ్యలబ్ధి, సౌభాగ్య సిద్ధి, ఆయుర్‌వృద్ధి, ఆర్థిక సమృద్ధి ఏకీకృతంగా దైవారాధన ద్వారా అందుకోవడానికి ధన త్రయోదశి పావనకరమైన పర్వదినం.
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

No comments:

Post a Comment