ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 4 November 2013

దీపారాధన


 పంచభూతాల్లో ప్రధానమైన 'అగ్ని' ప్రాణికోటి మనుగడకు అవసరమయ్యే తేజస్సును, ఆహారాన్ని ఐహిక ప్రయోజనరూపంలో, సనాతన ధర్మ గరిమను ఆధ్యాత్మిక ప్రయోజన రూపంలో ప్రసాదిస్తోంది. ఏ కార్యక్రమాన్నయినా 'అగ్నిసాక్షి'గా ఆరంభించటం హైందవ సంప్రదాయంలోని ముఖ్యాంశం. దీపాలను వెలిగించడమంటే, మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలి జ్ఞానకాంతిని ఇమ్మని ఈశ్వరుణ్ని వేడుకోవడమన్నమాట.
దీపంలో మనకు కనిపించే నీలం, పసుపు, తెలుపు వర్ణాలు మనలోని సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలు. సత్యం, శివం, సుందరాలకు సంకేతాలు.

స్వామి దయానంద సరస్వతి అమావాస్యనాడే సన్యసించి తిమిర జగతికి జ్ఞానకాంతిని అందించారు. చీకటి పనులన్నీ పాపాలుగాను, వెలుగులో చేసే పనులను సత్కార్యాలుగాను మహాత్ములు అభివర్ణిస్తారు. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగాను, మనో వికాసానికి, నిర్మల హృదయానికి, పావన భావనకు, ఆనందానికి, ప్రసన్నతకు, ప్రశాంతికి సజ్జనత్వానికి నిదర్శనంగాను భావిస్తారు భాగవతులు. జగతిని జాగృతం చేసే చైతన్య కిరణాలు దీపకాంతినుంచే ఆవిష్కృతమవుతాయి. మానవ శరీరం మట్టితో చేసిన ప్రమిద అనీ, ప్రాణం ప్రకాశించే దీపమనీ, ఆధ్యాత్మిక సాధన అందులో పోసే తైలమనీ, అందుకే భగవంతుడికి భక్తుడు చేసే షోడశోపచారాల్లో దీప సమర్పణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందనీ పౌరాణికులు చెబుతున్నారు. దీపం లక్ష్మీస్వరూపం కనుక దీపారాధన ద్వారా ఆమెకు ఆహ్వానం పలుకుతాం. అన్ని భారాలనీ భరించే భూమాత దీపం వేడిని భరించలేదట. అందుకే ప్రమిదలో ప్రమిదవేసి మరీ ప్రమదలు, దీపం వెలిగిస్తారట. ఒక దీపం వెలిగించామంటే ఇంట్లోకి అష్టలక్ష్ముల్నీ ఆహ్వానించినట్టేనంటారు. దీపకాంతి జగతికి క్రాంతి, శాంతి ప్రసాదించి భ్రాంతిని తొలగిస్తుందని హైందవ సంప్రదాయ విశ్వాసం.

కార్తిక శుద్ధపాడ్యమి 'బలిపాడ్యమి'గా ప్రశస్తినందుకుంది. ఆరోజునుంచీ మొదలుకొని నెలంతా దీపాలు వెలిగిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని పౌరాణికులు చెబుతారు. నెలంతా వెలిగించలేనివారు కార్తిక సోమవారాల్లో దేవాలయాల్లో దీపదానం చెయ్యవచ్చనీ, అదీ సాధ్యం కాకపోతే కనీసం కార్తికపౌర్ణమినాడయినా దీప ప్రకాశనం చేసి దివ్యలోక సాయుజ్యాన్ని పొందవచ్చని అంటారు. ప్రదోష సమయాల్లో దీపాలు వెలిగించి, పిల్లలు దక్షిణ దిశగా నిలుచుంటే దాన్నే 'ఉల్కాదానం' అంటారు. ఆ దీపాలు పితృదేవతలకు మోక్షద్వారాలు చూపుతాయట. శరదృతువులో క్రిమికీటకాలు వ్యాధుల్ని ప్రబలజేస్తాయి. ఈ కార్తిక దీపాలు ఆ వ్యాధుల్ని నిరోధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాయి. పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి.

దీపం ఎప్పుడూ అధోదిశవైపు చూడదు. వూర్ధ్వ దిశనే సూచిస్తుంది. మనిషి కూడా ఆ కాంతిలో ఉన్నతమైన ఆలోచనలతో అభ్యుదయ దిశవైపు పయనించాలని అది సంకేతం ఇస్తోంది. 'జ్యోతి స్వరూపమైన ఓ పరమాత్మా! నీవు ఆ కవుల్లో కవిగా మర్త్యజీవుల్లో అమృతుడివిగా భాసిస్తావు. నీ వల్ల మా దుఃఖాలు తొలగుగాక!' అని రుగ్వేదంలో దీపకాంతిని గురించి ప్రార్థన ఉంది. సార్వకాలీనమైన దైవం దీపం. దీపానికి నమస్సునర్పిస్తే సకలదైవాలను ప్రార్థించినట్లే.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి

No comments:

Post a Comment