ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 18 July 2013

తొలి ఏకాదశిహైందవ సంప్రదాయ సాంస్కృతిక జీవన విధానంలో ఏకాదశి అత్యంత పవిత్రమైన తిథి. హరినామ సంకీర్తనానికి ఈ పర్వదినం ప్రశస్తమైనది కావడంతో దీన్ని 'హరివాసర'మన్నారు. 

సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని 'తొలి ఏకాదశి'గా వ్యవహరిస్తారు. విష్ణ్వార్చనతోపాటు ఈ రోజున ఉపవాసానికి ప్రాధాన్యమిస్తారు. ఈ శుభ దినాన శ్రీమహావిష్ణువు క్షీరాబ్ధిలో శేషపర్యంకంమీద శయనించి నిద్రకు ఉపక్రమిస్తాడని 'శయనైకాదశి'గా పరిగణిస్తారు. ఈ రోజు నుంచి సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు గోచరిస్తాడు. ఈ పర్వడిరోజున 'గోపద్మ వ్రతం' ఆచరిస్తారు. ఆషాఢ శుక్ల ఏకాదశితో ఆరంభమై, కార్తిక శుక్ల ఏకాదశి వరకు ఉండే పవిత్ర సమయాన్ని 'చాతుర్మాస్యం' అంటారు. ఈ కాలమంతా విష్ణువు శేషశాయిగా నిద్రిస్తాడంటారు. చాతుర్మాస్య వ్రత విధానం స్కంద, భవిష్య పురాణాల్లో విశేషంగా వర్ణితమైంది. అనేక వ్యాధులకు ఆలవాలమైన క్రిమికీటకాలు విస్తరించే ఈ వర్షకాలంలో అపథ్యాహారాన్నే త్యజించి, శాకాహారులుగా, ఉపవాస వ్రతులుగా భగవచ్చింతనతో గడపాలన్నది ఈ చాతుర్మాస్య సందేశం, సంకేతం!

దశమినాటి రాత్రి నిరాహారంగా గడిపి ఏకాదశినాడు పూర్తిగా ఉపవసించి, ద్వాదశిరోజున పారణ చేసి, ప్రసాదం తీసుకుని త్రయోదశినాడు నృత్యగీతాలతో, భజనలతో ఏకాదశీ వ్రతం ముగిస్తారు. బ్రహ్మహత్యాది మహాపాతకాలన్నింటినీ తొలగించి, భక్తుడికి ముక్తిని ప్రసాదించే మహత్తర వ్రతమిది. ఈ వ్రతం ఆచరించే ఇంటివైపు యముడు కూడా కన్నెత్తి చూడలేడట. అందుకే గంగవంటి తీర్థం, తల్లివంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు 'ఏకాదశి' వంటి వ్రతం లోకంలో లేవని పురాణ గాథలు అభివర్ణించాయి.

కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు తనకు లభించిన బ్రహ్మవరంవల్ల గర్వితుడై దేవతలను, రుషులను హింసిస్తుంటే విష్ణువు అతడితో వెయ్యి సంవత్సరాలు పోరాడి అలసిపోయి, నిరాశ చెంది, ఓ గుహలో విశ్రాంతి తీసుకొంటుండగా, ఆయన దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి, ఆ అసురుణ్ని ఎదుర్కొని సంహరించిందని చెబుతారు. అందుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు వరం కోరుకొమ్మంటే, 'ఏకాదశి' తిథిగా విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంటుంది. అది మొదలు 'తొలి ఏకాదశి' వ్యవహారంలోకి వచ్చిందంటారు.

ఏకాదశికి మరో పవిత్రమైన అంతరార్థం పురాణాలు చెబుతున్నాయి. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు- వెరసి పదకొండింటిపైన నియంత్రణ కలిగి వ్రతదీక్ష కొనసాగించాలన్నది ఆంతరిక సందేశం. 
అంబరీష మహారాజు దుర్వాస మహర్షి శాపం నుంచి తప్పించుకుని, హరిభక్తితో ఏకాదశీ వ్రతాన్ని నియమ నిష్ఠలతో నెరవేర్చడం వల్ల విష్ణు సాయుజ్యం పొందినట్లు పురాణగాథ ఉంది. సతీ సక్కుబాయి తొలి ఏకాదశీ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వర్తించి, అదేరోజున విష్ణు సాయుజ్యం పొందిందట.

ఆనందకరమైన ఆరోగ్యప్రాప్తికీ, చిదానందకరమైన ఆధ్యాత్మిక దీప్తికీ తొలి ఏకాదశి జ్ఞానసుధావారాశి. ఈ వ్రతం ఆచరించేవారికి భూరి దానాలు చేసిన పుణ్యం, అశ్వమేధయాగ ఫలం, అరవై సంవత్సరాల తపోఫలం లభిస్తాయని స్మృతి పురాణ కథనం. వ్రతం చేయలేనివారు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేసి, అర్చించి, ఉపవాసం చేసి దైవచింతనతో గడిపినా ఎంతో మంచిదని చెబుతారు. 

మానవ మనోవికాసం, సాత్విక చింతన, దానధర్మ కర్మాచరణ, సత్యనిష్ఠ, జ్ఞాన పిపాస, మోక్షాసక్తికి 'తొలి ఏకాదశి' తొలి సోపానం.
                                                             - చిమ్మపూడి శ్రీరామమూర్తి

No comments:

Post a Comment