ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 29 October 2013

సహజాన్వేషణ


   లోకం మనలను మార్చడానికి ఉంది. మనం లోకాన్ని మార్చడానికి లేం. లోకానికి ఒక ప్రయోజనం ఉంది. లోకానికి ఒక ఉద్దేశం ఉంది. లోకానికి ఒక లక్ష్యం ఉంది.

మనమూ ఒక లక్ష్యం పెట్టుకుని లోకం వైపు సాగితే, అందులో ఉన్న మంచిచెడ్డలు లోకం విచారించి, దారి చూపుతుంది. తన గమ్యంవైపు తాను వెళుతూ వ్యక్తి ప్రయోజనాలు కాపాడటమే లోకం ఉద్దేశం. అదే, లోకేశ్వరుడి అంతరంగం.

లోకంలో ఎందుకు ఇంత బాధ, బీభత్సం, కన్నీళ్లు, ఆవేదనలు ఉన్నాయి? సృష్టిని మరోలా ఒక సుందర స్వప్నంలా తీర్చిదిద్దవచ్చు కదా అని కొందరికి అనిపించవచ్చు. కొందరికి నిజంగా ఈశ్వరుడి మీద కోపం రావచ్చు. అందరినీ, అందరి భావాలను అలవోకగా విని, హాయిగా నవ్వుకుని, తన పని తాను చేసుకుపోయే స్థితప్రజ్ఞుడు దేవుడు.

లోకాన్ని చూసి మనం స్పందించాలి. స్పందించకపోతే మనుషులం కాలేం. ఎంత ఎక్కువగా స్పందిస్తే, అంత తొందరగా ఈశ్వరుడి ప్రయోజనం నెరవేరుతుంది. కదలని రాయిలా ఉండేవాడినీ కదిలించగలడు దేవుడు- తన సృష్టిలోని వ్యక్తీకరణల ద్వారా.

వసంతం వస్తే కూసే కోయిలనెవరైనా ఆపగలరా? శరత్కాలపు చంద్రుణ్ని చూడకుండా కళ్లు మూసుకుని ఉండగలరా? కట్టలు తెంచుకున్న సంతోషాన్ని కనపడనీయకుండా ఆపగలరా? గుండెలు బద్దలయ్యే రోదనను పెదవి అంచున ఒడిసి పట్టగలరా?

మనిషిని అన్నివైపులనుంచి రకరకాల భావాలతో అంతర్ముఖుణ్ని చేసి లోపలికి పంపించే సత్తా ఉండే లోకాన్ని సృష్టించాడు ఈశ్వరుడు. మనం వద్దన్నా, కాదనుకున్నా ఆయన భావాలకు వశమైపోతుంటాం. అది మన అదృష్టం. తనవైపు తీసుకువెళ్ళే గురువులా, భగవంతుడు మన మీద దృష్టిపెడితే ఇంకేం కావాలి?

కష్టమో, నష్టమో జీవితం మనలను కదిలించాలి. లోకం మనలను వివిధ సంఘటనల్లోకి, సమస్యల్లోకి ఈడ్చాలి. అప్పుడే మన సత్తా తెలుస్తుంది. అలజడిలోనే నిజమైన మనిషి బయటపడతాడు. సుఖదుఃఖాల్లోనే మానవత్వం పూర్తిగా వికసిస్తుంది.

సాధన చెయ్యి, సాధన చెయ్యి అని ఎంతమంది చెప్పినా మనం వినం. జీవితం కొట్టిన దెబ్బలకు, లోకం కదులుతున్న తీరుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాం. ఇదే సహజాన్వేషణ. ఇందులోంచే అన్ని మార్గాలు, అన్ని సాధనలు పుట్టుకొచ్చాయి.

శాస్త్రాలు, గురువులు చెప్పినదానికంటే జీవితం బాగా నేర్పిస్తుంది. జీవితం క్షమించదు. లోకం మరో అవకాశాన్ని ఇవ్వదు. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

నలుగురితో కలిసి ఉంటూనే, మనలాగ మనం ఉండాలి. అందరితో కలిసి అన్ని విషయాల్లో పాలుపంచుకుంటూనే మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. కొండలు, కోనలు పట్టకుండా, రంగుదుస్తులు మార్చకుండానే లోతుగా సత్యాన్వేషణ చెయ్యవచ్చు. బతుకు, మరణం రెండూ రెండు సింహాల్లాంటివి. వాటితో సర్కస్‌ చెయ్యాలి. బలైపోకూడదు. రింగ్‌మాస్టర్‌లా అతీతంగా నిలవాలి. అప్పుడే సుఖం, శాంతి. అప్పుడే అందరి కరతాళ ధ్వనులూ వినిపిస్తాయి.

ఎవరిని ఎప్పుడు తన వైపు తిప్పుకోవాలో భగవంతుడికి తెలుసు. లోకంలో మనం జీవించే విధానంలోనే, మన తాత్వికత ఇమిడి ఉంది. చక్కగా జీవిస్తే చాలు. రోగం ఎలా కుదర్చాలో దైవ ధన్వంతరికి బాగా తెలుసు!

ఆధ్యాత్మిక సంపదను లోకంలో ఎక్కడ చూసినా కనిపించే విధంగా అమర్చిపెట్టాడు భగవంతుడు. మనకే కనపడటం లేదు. ఏదో ఒకరోజు బలవంతంగా బల్ల ఎక్కించి, శస్త్రచికిత్సచేసి కంటిచూపును ఇస్తాడు. అప్పుడు చూడక తప్పదు. మూడో కన్ను ప్రాముఖ్యం తెలుసుకోక తప్పదు. ముక్కంటి చేష్టలకు అవగాహన రాక తప్పదు!
- ఆనందసాయి స్వామి 

No comments:

Post a Comment