ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 6 June 2013

'పర'ధ్యానం


మందార మకరందం పరమేశ్వర ధ్యానం. 'మందార మకరందాన్ని గ్రోలే తుమ్మెద ఉమ్మెత్తపూల మీద వాలుతుందా? శ్రీహరి పాద చింతన అనే అమృతాన్ని తాగి మత్తెక్కిన నా మనసు ఇతర విషయాలపైకి ఎలా మరలుతుంది?' అంటాడు ప్రహ్లాదుడు. పరమేశ్వర ధ్యానంలో బ్రహ్మానందాన్ని అనుభవించే ప్రహ్లాదుణ్ని భౌతిక శిక్షలు బాధించలేక పోయాయి. పరమాత్మపై సహజంగానే ధ్యాస ఉండాలే గాని, ఏదైనా ఆశ చూపితే అది కలుగుతుందా?- అని ప్రహ్లాదుడి చేత పలికిస్తాడు పోతన.
                       ఒక మాతృమూర్తి యుద్ధభూమిలో ఉన్న కుమారుడినే సదా స్మరిస్తూ ఉంటుంది. దూరమైన ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు అదే పనిగా తలచుకుంటూ ఉంటారు. యాత్రకు పోయినవాళ్లు కొందరు తాము ఇంట్లో విడిచి వచ్చిన శునకం స్మృతులతో సతమతమవుతూ ఉంటారు. ఇవన్నీ ఐహిక ధ్యాసలు. ఇలాంటివాళ్లు తరచూ పరధ్యానంగా ఉంటారు. ఇందువల్ల ఇహపరాలు రెంటికీ దూరం అవుతారు. పరమాత్మను లక్షించిన ధ్యానం మాత్రం ముక్తికి సోపానం.

లోకంలో ఇప్పుడు ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. తన శక్తులతో వారికి సుఖాలు ప్రసాదించాలనుకున్నాడు ఒక మహాత్ముడు. దారి పక్కన మూలుగుతున్న రోగగ్రస్తుణ్ని చూశాడు. జాలిపడ్డాడు. తన శక్తితో అతడి వ్యాధి నిర్మూలనం గావించాడు. కన్నులు కనబడని ఒక యువకుడికి చూపు ప్రసాదించాడు. ఇంకోచోట విగతజీవుడై పడివున్న వృద్ధుడికి తిరిగి ప్రాణం పోశాడు. కొన్నాళ్ల తరవాత ఆ మహాత్ముడు తిరిగి ఆ ప్రదేశానికి వచ్చాడు. దారి పక్కన పీకల దాకా తాగి మద్యం మత్తులో పడి ఉన్న వ్యక్తిని చూశాడు. 'ఎందుకు నీవు ఇలా తప్పతాగి విలువైన మానవజన్మను వృథా చేసుకుంటున్నావు?' అని దయతో ప్రశ్నించాడు. 'ఏం చేయను? నేను తాగీ తాగీ రోగం తెచ్చుకున్నాను. తమరు లోగడ వచ్చినప్పుడు నా రోగం పోగొట్టారు. మళ్లా తాగబుద్ధయింది. తాగుతున్నాను!' అని అతడు జవాబిచ్చి తిరిగి తాగడం మొదలు పెట్టాడు. మహాత్ముడు మౌనంగా ముందుకు సాగాడు. అక్కడ ఒక వ్యభిచారి తారసపడ్డాడు. 'ఎందుకు నాయనా? పవిత్రమైన మానవ జన్మను ఇలా మైల పరచుకుంటున్నావు?' అని ప్రశ్నించాడు. 'మీరు నాకు నేత్రాలు ప్రసాదించారు. నా కన్నులెప్పుడూ స్త్రీలవైపే మళ్లుతుంటే నన్నేం చేయమంటారు?' అని అతడు ఎదురుప్రశ్న వేశాడు. మహాత్ముడు మరింత ముందుకు పోయాడు. అక్కడ వృద్ధుడొకడు పెద్దగా ఏడుస్తూ కనబడ్డాడు. 'ఏమిటి నాయనా, ఎందుకు ఏడుస్తున్నావ్‌?' లాలనగా అడిగాడు మహాత్ముడు. 'ఏడవక ఏం చేయమంటావయ్యా? హాయిగా నన్ను చావనీయక, మళ్ళీ బతికించావు! ఇప్పుడు చూడు! కన్నబిడ్డలు కూడా నన్ను తన్ని తరిమేశారు. చావలేక బతకలేక ఇలా ఏడుస్తున్నాను!' అన్నాడు వృద్ధుడు. 'పరమేశ్వరుణ్ని ధ్యానించే మంచి అవకాశం నాకు వచ్చిందే, శేష జీవితాన్ని అయినా సార్థకం చేసుకుందామని వీరికి అనిపించడం లేదే! బుద్ధిని మార్చే శక్తి లేనప్పుడు, ఎన్ని ఇతర శక్తులు నాకుఉన్నా వ్యర్థమే కదా...' అనుకున్నాడు మహాత్ముడు.

మృత్యుకోరల నుంచి బయటపడాలని వేయి దేవుళ్లకు మొక్కుకున్నవారు సైతం, ఆ ఆపద నుంచి బయటపడగానే తమ ధ్యాసను భౌతిక సుఖాలవైపు మళ్ళిస్తారు. స్వార్థమే పరమార్థంగా జీవిస్తారు. 'పర'ధ్యాసగలవారి జీవన గమనం వేరే తీరులో ఉంటుంది. కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా ఈశ్వరధ్యాస నుంచి మనసు మరలదు. రామదాసు చెరసాలలో దెబ్బలు తింటూ కూడా రామనామాన్నే స్మరించాడు. త్యాగయ్య తన పూజా విగ్రహాలు పోయినా, దొరికినా స్వామి స్మరణ విస్మరించలేదు. అన్నమయ్యకు సంకెళ్లు వేస్తే 'ఆకటి వేళల అలపైన వేళల...' అంటూ వేంకటేశ్వరుణ్నే కీర్తించాడు. 'పర'ధ్యాన బలం ఎలాంటిది? వేంకటేశ్వరుడికి అడ్డుగా కట్టిన తెర త్యాగయ్య కీర్తనతో తెగిపడిపోయిందని, అన్నమయ్య సంకెళ్లు ముక్కలయ్యాయని ఇతిహ్యాలున్నాయి.

పరమాత్మకు అంకితమయ్యే కళలు అలౌకిక ఆనందాన్ని ప్రసాదిస్తాయి. తాన్‌సేన్‌ను అక్బర్‌ 'నీ గానం అత్యంత మధురం' అని ప్రశంసించాడు. 'జహాపనా! మా గురువుగారి గానం ముందు నాదెంత!' అన్నాడు తాన్‌సేన్‌ వినయంగా. తాన్‌సేన్‌ను వెంటబెట్టుకొని అక్బర్‌ సంత్‌ హరిదాస్‌ ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ ఆనంద పారవశ్యంతో గానం చేస్తున్న హరిదాస్‌ పాటను విని ఆనంద బాష్పాలు రాల్చాడు అక్బర్‌. 'మీ గురువుగారు ఇంత గొప్పగా ఎలా పాడగలుగుతున్నారు?' అని ప్రశ్నించాడు అక్బర్‌. 'చక్రవర్తీ! మేము పాడేది ఢిల్లీశ్వరుడి గురించి. వారు పాడేది జగదీశ్వరుడి గురించి. అదే మాధుర్య రహస్యం!' అన్నాడు తాన్‌సేన్‌. 'పర'ధ్యానంలో ఉన్న హరిదాస్‌ చక్రవర్తి రాకను గూడా గమనించకుండా గానం చేస్తూనే ఉన్నాడు!
                                             - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment