ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 17 June 2013

బుద్ధిమార్గం


    కోరికలే కష్టాలకు కారణం. కాబట్టి అలాంటి కోరికల్ని త్యజించమన్నాడు బుద్ధుడు. కోరికలంటే ఎలాంటి కోరికలు? ప్రపంచమంతా సుఖంగా వర్ధిల్లాలని కోరుకోవడం ఇలాంటి కోరిక కాదు. శాంతి అహింసలు పరిఢవిల్లాలని కాంక్షించడమూ ఈ కోవలోకి చేరదు. కర్మఫల త్యాగాన్ని మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కోరికలు లేకపోతే సుఖంగా బతకవచ్చని, ప్రజల హృదయాల్లో ముద్రవేసే విధంగా బుద్ధుడు చెప్పగలిగాడు. బుద్ధుడికి స్వర్గకాంక్ష లేదు. రాజ్య కాంక్ష అసలే లేదు. సంసారాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఏ కోరికాలేని మనీషి (బుద్ధుడు) అయ్యాడు. కాబట్టే శత్రువుకు మేలుచేయడం, ద్వేషించేవారిని ప్రేమించడం ఆయనకు సాధ్యపడింది.
               ఎంత జ్ఞానం ఉంటే ఇది సాధ్యపడుతుంది? ఆకాశమంత! తాను ఆ స్థాయికి చేరుకోవడమేగాక, సాధన చేస్తే అందరూ ఆ స్థాయిని పొంది 'బుద్ధులు' కావచ్చుననీ ఆయన బోధించాడు. ఈ సాధనకు మూల సూత్రం 'కోరిక లేకపోవడం'. తాను జీవితంలో ఆచరించి మరీ చెప్పాడు. భిక్షాటనతో బతికాడు. జంతుజాలమంతా మనవంటిదే కాబట్టి జాలితో చూడమన్నాడు. వాటిని రక్షించడం కోసం నిత్యం తహతహలాడాడు. 'మేకపిల్లను బలి ఇస్తే మోక్షం వస్తుందా? అయితే, మనిషిని బలి ఇస్తే మరీ మంచిది కదా! కాబట్టి నన్నే బలి ఇవ్వండి' అని ఒక జీవిని రక్షించడంకోసం తానే బలిపీఠం ఎక్కాడు. ఇందువల్ల ఆ మహాపురుషుడికి ఒరిగిందేమిటి? తాను అధికారంలోకి రావడానికో, పూజలందుకోవడానికో ఈ పనిచేయలేదు. ఉన్న అధికారాన్ని వదులుకున్నాడు. పూజలపై విశ్వాసంలేదు. 'కరుణ' కోరికలతో సంబంధంలేనిది. దేవుడు, స్వర్గం, ముక్తి... వీటిని గురించి బుద్ధుడు పట్టించుకోలేదు. స్వార్థ రహితమైన సజీవ ప్రేమను ప్రపంచ ప్రజలకు ఒక సందేశంగా అందించాడు.

ఈ లోకానికి మహోపకారం గావించిన మహాత్ములెవరూ తమకంటూ ఏమీ కోరుకోలేదు. ఆఖరికి తమ సంతానం సిరిసంపదలతో తులతూగాలనీ వాంఛించలేదు. 'నాకేంటి?' అనే ప్రశ్న కలలో కూడా మొలకెత్తని 'బుద్ధులు' వీళ్లు. ధర్మానికి బద్ధులు. 'సరే! నీకు ఇది ఇస్తా! మరి నాకేంటి? తిరిగి నాకు ఏమిస్తావు?' అనే ప్రబుద్ధులు నేటి సమాజంలో కనబడుతున్నారు. తమకు లాభం లేకపోతే వీళ్లు దేవుడికి దండం కూడా మనస్ఫూర్తిగా పెట్టరు. భక్తి వెనక ఏ కోరికా ఉండకూడదు. అధికమైన కోరికలకు కారణం అజ్ఞానం. ఒక శాస్త్రజ్ఞుడు అహర్నిశలూ పరిశోధిస్తున్నాడు. ఒక నూతన గణన యంత్రాన్ని నిర్మించడానికి శ్రమిస్తున్నాడు. అతడి కుమారుడు వచ్చి 'నాన్నా! ఇదేమిటి?' అని ప్రశ్నించాడు 'ఒక అపూర్వ గణన యంత్రాన్ని కనిపెడుతున్నాను!' అన్నాడు తండ్రి. 'ఇందులో నుంచి చాక్లెట్లు వస్తాయా?' ఆశగా ప్రశ్నించాడు కుమారుడు. 'అలాంటివేమీ రావు!' అన్నాడు శాస్త్రజ్ఞుడు. 'అయితే ఇది వట్టి పనికిమాలిన యంత్రం... దీంతో నాకు పనిలేదు!' అంటూ ఆ పుత్రరత్నం నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లోకం మొత్తానికి మేలుచేసే వస్తువు తనకూ మేలు చేస్తుంది గదా అనే ఆలోచన ఆ పసివాడికి కలగలేదు. అతడికి కావలసింది చాక్లెట్‌. తన కోరిక తీర్చేది ఉంటే చాలు. లోకం మేలుతో అతడికి పనిలేదు. పసివాళ్లకు అలా అనిపించడం సహజం. కారణం అజ్ఞానం. కానీ, ఉత్తమ విద్యలభ్యసించి, ఉన్నత పీఠాలు అధివసించినవారిది అజ్ఞానమా? కాదు అత్యాశ!

కన్నబిడ్డలకు అన్నం పెడతారు. వస్త్రాలిస్తారు. తల్లిదండ్రులకు ఎలాంటి ప్రతిఫలాపేక్షా ఉండదు. ఇలాంటి సేవాదృక్పథమే పాలకులకు ఉండాలి. 'ఇతరుల కోసం చేసే అతిస్వల్ప కార్యం కూడా మనలోని మహాశక్తిని మేల్కొలుపుతుంది' అంటాడు వివేకానందుడు. లోకానికి మనం ఇచ్చే ప్రతి వస్తువునూ ప్రతిఫలాపేక్ష రహితంగా సమర్పించడమే సనాతనధర్మం. ఒక పర్యాయం లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ బొంబాయిలో ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన అపార పరిజ్ఞానానికి సభాధ్యక్షుడు ఆశ్చర్యపోయాడు. 'తిలక్‌ మహాశయా! మీతో సాటిరాగల ప్రజ్ఞావంతులెవరూ లేరు. మీరు అనవసరంగా స్వాతంత్య్రపోరాటంలో కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. విశ్వవేదికలపై మీ అపార పాండిత్యాన్ని ప్రదర్శిస్తే అఖండ ఖ్యాతిని ఆర్జిస్తారు గదా!' అన్నాడు. తిలక్‌ ఇలా సమాధానమిచ్చాడు- 'అధ్యక్ష మహోదయా! దేశానికి స్వాతంత్య్రం వస్తే నావంటి ప్రజ్ఞానిధులు వేలమంది ఉద్భవిస్తారు. నాకు పేరు ప్రఖ్యాతులపై కోరికలేదు. భగవంతుడు నాకిచ్చిన శక్తిని దేశసేవకే వినియోగిస్తాను. నాకంటూ ఏమీ అవసరంలేదు!' ప్రతి ఒక్కరూ ఈ త్యాగమూర్తుల ఆదర్శ జీవితాన్ని స్మరిస్తే 'నాకేంటి'అనే మాట నోట రానేరాదు.
                                                      - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment