ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 2 July 2013

కేదారనాథాయ నమశ్శివాయ!

   దరీ పుణ్యధామ సమీపంలో ఉన్న గంధమాదనం ఒక దివ్య పర్వతం. సులభంగా చేరలేని ఈ చోటు, పరిసరాల గురించి మహాభారతం చెబుతోంది. చిరంజీవి అయిన ఆంజనేయస్వామి యోగమూర్తిగా ఇక్కడ సుస్థిరంగా ఉంటాడని పురాణేతిహాసాల కథనం. కాశీవిశ్వనాథుడి ఆజ్ఞ ప్రకారం, ఆదిశంకరులు బదరీ చేరుకొని వేదాంత గ్రంథరచన చేశారనీ, ఇక్కడి దివ్య జ్ఞానశక్తిని అనుభవించి, తన నాలుగు పీఠాల్లో ఒకదాన్ని స్థాపించారని శంకర విజయగాథ వివరిస్తోంది.

నరనారాయణుల తపోఫలంగా శివుడు ప్రత్యక్షమై, వారి కోరిక మేరకు స్వయంభువై జ్యోతిర్లింగంగా వెలశాడని, ఆ మూర్తే కేదారనాథుడని శివ పురాణాదులు విశదపరుస్తున్నాయి. హిమశోభిత దివ్య శిఖరాల్లో నెలకొన్న కేదారనాథ జ్యోతిర్లింగ దర్శనాన్ని జన్మచరితార్థంగా భక్తులు భావిస్తారు. 'కేదార' శబ్దానికి అనేక అర్థాలున్నాయి. యోగపరంగా బ్రహ్మరంధ్ర స్థానమే కేదారం. 'క' శబ్దానికి శిరస్సుగాను, దాని నడుమనున్న శివశక్తి స్థానమే కేదారంగాను యోగభూమికలో అర్థం చెప్పవచ్చు. జ్ఞానానందాలను పండించే కేదారం (దున్నిన పొలం) ఈ క్షేత్రం.

ఆదిశంకరులు తన ముప్ఫైరెండో ఏట జీవిత కర్తవ్యాన్ని నిర్వహించాక, ఈ పావనధామం వద్దనే సమాధి పొందారని 'శంకర విజయం' చెబుతోంది.

ఈ కేదార పర్వత సమీపంలో వాసుకి పర్వత శిఖరం, చౌఖాంబా శిఖరాలు రమణీయ దృశ్యాలు. మందాకినీ తీరంలో నెలకొన్న ఈ కేదారనాథుడికి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో 'త్రియుగి నారాయణ' ప్రాంతం ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడే శివపార్వతుల కల్యాణం జరిగిందని పురాణగాథ.

తుంగనాథ, రుద్రనాథ, మద్మహేశ్వర, కల్పేశ్వర, కేదారనాథ- ఈ అయిదింటినీ 'పంచ కేదారాలు' అంటారు. కేదార్‌నాథ్‌ను ప్రధానంగా చేసుకొని మిగిలిన నాలుగు కేదారాలు ఉంటాయి. ఇవన్నీ శివక్షేత్రాలే. అదేవిధంగా- గంగ వివిధ పాయలుగా ప్రవహిస్తూ, కొన్నిచోట్ల కలుసుకొని కొనసాగుతుంది. ఆ సంగమ స్థానమే ప్రయాగ. అలాంటి ప్రయాగలు అయిదు ఈ పవిత్ర ప్రాంతంలో ఉన్నాయి. అవి రుద్రప్రయాగ, దేవప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ. బదరీ కేదార ప్రాంతాల్లో ఉన్న ఈ పంచప్రయాగలను మహామహిమాన్విత క్షేత్ర, తీర్థ భూములుగా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి.

శీతకాలంలో మంచుతో కేదార ధామం కప్పి ఉన్నప్పుడు, ఆ కాలమంతా 'ఊఖీమఠం'లో కేదారనాథుడికి అర్చన జరుగుతుంది. ఈ ఊఖీమఠంలోనే ఉషాఅనిరుద్ధుల వివాహం జరిగిందని స్థానిక ఐతిహ్యం. ఈ వూఖీమఠ పరిసరాలు దైవీయ కళలతో తేజరిల్లుతూ మానసోల్లాసాన్ని కలగజేస్తుంటాయి. ఇటువంటి పవిత్ర స్థలాలు అధిక సంఖ్యలో కేదారనాథుని సమీపాన భక్తులను అనుగ్రహిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో మరో పుణ్యక్షేత్రం గుప్తకాశీ. ఈ శివసన్నిధి ఒక దివ్యభూమి.

'చార్‌ధామ్‌'లో మూడోది గంగోత్రి.

మహాపుణ్య నది గంగాదేవి జన్మభూమి ఇది. గోముఖంలో ఆవిర్భవించే గంగమ్మ, ఈ స్థలంలో స్పష్టంగా వ్యక్తమవుతుంది. భగీరథుడి తపోఫలంగా ఆవిర్భవించిన గంగాదేవి భువిపై పాదం మోపిన చోటుగా దీని పవిత్రతను శాస్త్రగ్రంథాలు శ్లాఘిస్తున్నాయి. శివలింగ, తలసాగర్‌, మేరు, భగీరథ- అని పిలిచే ఉన్నత శిఖర మార్గాల నడుమ ఈ గంగోత్రి విరాజిల్లుతోంది. సమున్నతమైన చౌఖాంబా శిఖర శ్రేణిలోనిదిది. ఉత్తరకాశీ జిల్లాలోని ఈ పవిత్ర స్థలం ఒక ప్రాకృతిక అద్భుతం. 'ఉత్తరకాశీ' విశ్వనాథ మందిరంలో శోభిల్లుతూ క్షేత్రంగానూ, తీర్థంగానూ ప్రసిద్ధి పొందింది.

నాలుగో ధామమైన 'యమునోత్రి' పౌరాణికంగా, చారిత్రకంగా మరో గణనీయ స్థలం. యమున సూర్యపుత్రికగా, యముడి సోదరిగా పురాణాలు చెబుతున్నాయి. కళింద పర్వత ప్రాంతంలో ఉద్గమించిన యమునోత్రి దర్శనం, స్నానం- శని దోషాలను, యమయాతనలను తొలగించి పాపనాశనం చేస్తాయని శాస్త్రాలు తేటపరుస్తున్నాయి. చల్లని శిఖరాల నడుమ 'ఉష్ణగుండం' ఇక్కడి ప్రత్యేకత. సూర్యకుండంగా ప్రసిద్ధి చెందిన ఈ జలస్థానంలో సౌరశక్తి విశేషమేదో దాగి ఉందని భావించవచ్చు. పుణ్యనదుల్లో గంగతోపాటు యమునకూ ప్రశస్తి ఉంది. యమునా తీరభూములు పవిత్ర రుష్యాశ్రమ స్థానాలే కాక, మధుర బృందావనాల్లో యుమునా తీరాన శ్రీకృష్ణ పరమాత్ముడి దివ్య లీలా చరిత్రలు విలసిల్లాయి. యమునా నది దేవతా రూపంగా 'కాళింది' పేరుతో శ్రీకృష్ణుడి పత్నిగా ఉన్నదని పురాణగాథ. కృష్ణపత్ని అయిన యమునాదేవిని యమునోత్రిలో ఆరాధిస్తారు.

దివ్యగాథలకీ, అబ్బురపరచే ప్రకృతి రమణీయతకీ, అపురూపమైన అద్వితీయ యోగానుభూతికీ నిలయమైన నాలుగు ధామాలు భారతదేశం గర్వించదగ్గ పావన ప్రాంతాలు. ప్రకృతిపట్ల నియమబద్ధంగా, పర్యావరణ పరిరక్షణకు వలసిన పద్ధతులతోనూ మనిషి ప్రవర్తిస్తే ప్రకృతి జగన్మాతగా అనుగ్రహిస్తుంది. సౌకర్యాల పేరుతో విలాసాలు, వ్యాపారాలు ప్రధానంచేసి, నిర్మల ప్రకృతిని కాలుష్యానికి గురిచేస్తే అది ప్రళయకాళీ ఆగ్రహంగా ప్రకటితమవుతుంది. ప్రకృతి నైర్మల్యాన్ని కాపాడుకుంటూ జీవించడమే నిజమైన ఈశ్వరారాధన అని గుర్తిస్తే నాలుగు ధామాల దివ్యత్వం అనుభవానికి వస్తుంది.
                                                                - సామవేదం షణ్ముఖశర్మ

No comments:

Post a Comment