ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 2 June 2013

కాలమహిమ


'సమయం అశ్వంలా పరుగెడుతుంది' అని అధర్వణ వేదం కాలమహిమను అభివర్ణించింది. కాలానికి ఆది, అంతం లేవు. అది భగవత్‌ స్వరూపం. కాలానికి మంచీ-చెడూ అంటూ ఏవీ లేవు. అండపిండ బ్రహ్మాండమంతా కాలంతోనే ముడివడి ఉంది. ప్రకృతి ధర్మాలు, రుతువులు కాలంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. కాలానికి ఒకరు ఇష్టులు, మరొకరు అయిష్టులు అంటూ ఉండరు. కాలగమనంలో మనకు కలిగే సుఖదుఃఖాలకు కాలదోషమని కాలానికి కల్మషం అంటగట్టడం అవివేకం. 'కాలం చాలా పాడైపోయింది' అంటూ నిందిస్తుంటాం. మన దోషాల్ని, పాపాల్ని సమర్థించుకుంటూ కాలాన్ని దూషించడం సరైన పని కాదు. మన కర్మలు, ఆలోచనలు కలిసివచ్చి సత్ఫలితం అందితే మంచికాలమనీ, కలిసిరాక దుష్ఫలితాలు ఎదుర్కొంటే చెడ్డకాలమనీ అనడం కేవలం అవగాహనారాహిత్యమే. తామరాకు నీటిమీద ఉన్నంతవరకు వాడదు, నీటిచుక్క తనపైన పడినా తడవదు. అలాగే కాలం దేనికీ ప్రతిస్పందించదు. కాలానికి ప్రతిస్పందిస్తున్నది మనిషే! కాలానికి తగినట్లు తనను తాను మలచుకుని, అనుకూలంగా వర్తిస్తూ జీవితాన్ని అర్థవంతం చేసుకోవడమే వివేకశీలి లక్షణం.

కాలం 'అదృష్టం' రూపంలో ఎప్పుడో ఒక్కసారే తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే జ్ఞాని పని. 'దురదృష్టం' రూపంలో అదే పలుమార్లు తలుపు తడుతుంది. అర్థం చేసుకుని తలుపులు తెరవకపోవడమే విజ్ఞుడి లక్షణం. జీవితం చాలా స్వల్పం. జీవితకార్యం చాలా విస్తృతం. అందుకే రేపటి పని ఇవాళ, ఇవాళ్టి పని ఇప్పుడే చేయాలన్నారు మహాత్ములు. ఏ క్షణంలో ఏ ఆపద ఎదురవుతుందో ఎవరు చెప్పగలరు? చేయాల్సిన పనిని వాయిదా వేయటం పిరికివాడి లక్షణం. పోయిన ధనం, క్షీణించిన ఆరోగ్యం, మరిచిపోయిన విద్య, పరహస్తగత సామ్రాజ్యం ఇవన్నీ... మళ్ళీ కృషిచేస్తే పొందవచ్చేమో! గడిచిన కాలాన్ని తిరిగి పొందలేం. పూర్వమహర్షులు తమ జప తప సంపద, శాస్త్ర అధ్యయనం, సత్కర్మలతోనే జీవితంలోని ప్రతిక్షణం భగవత్‌ ప్రతీక్షణంతో సద్వినియోగం చేశారు. అందుకే మోక్షార్హులయ్యారు.

మనిషికి కాలం గడవటం లేదన్నా, తగినంత సమయం దొరకటం లేదన్నా అంతా తన లోపమే. కావ్య-శాస్త్రాలు అధ్యయనం చేస్తూ, ఆధ్యాత్మిక రహస్యాలను అవగతం చేసుకుంటూ సజ్జనులు కాలం గడుపుతుంటారు. దుర్వ్యసనాలతో, నిద్రతోనూ, కలహాలతో దుర్జనులు కాలాన్ని వ్యర్థం చేస్తారని భర్తృహరి ప్రవచించాడు. విషయభోగ లాలసుడైనవాడికి కాలమహిమ తెలీదు. జీవితం విలువ తెలీదు. అది కాలవశుడైనవాడి అసమర్థత. కాలాన్ని మన వశంలో ఉంచుకుని, సమయజ్ఞతను ఆరాధించగలిగితే ప్రతికార్యంలో సాఫల్యమే.

కాలాన్ని ఎదుర్కోవటమనే పురుష ప్రయత్న ప్రాముఖ్యాన్ని భగవంతుడే నిర్దేశించాడు. మన మనసుకైన గాయాలు కానీ, మన తనువుకైన గాయాలు కానీ మానిపోయేలా చేసే శక్తి ఒక్కకాలానికే ఉంది. అందుకే కాలమంత ఆత్మీయబంధువు, ఆపద్బంధువు వేరెవరూ లేరనడం అత్యుక్తి కాదు. ఈ క్షణం అనివార్యం- ఉదయాస్తమయాల్లా! ఆ క్షణాన్ని వివేచనలోకి, విచక్షణలోకి అనువదించుకోగలిగే సామర్థ్యం సంపాదించుకోవాలి. అందుకు మహాత్ముల అనుభవాల్ని, ఆశయ ధర్మాలను క్షుణ్నంగా అవగతం చేసుకోవాలి. సమాజాన్ని చదవాలి. ఒక ద్రౌపది 'నవ్వు'కే అవమాన ఆగ్రహావేశాలకు గురైన దుర్యోధనుడు ఏ క్షణంలో పగ, ప్రతీకార జ్వాలలో మనసును దగ్ధం చేసుకున్నాడో- ఆ క్షణమే అతడి మరణానికి నాంది అయింది.

సంపదలున్నా, ఆపదలు సంభవించినా ధీరోదాత్తులు చలించరు. ఎలాగంటే- సూర్యుడు ఉదయ సమయంలోను, అస్తమయ వేళలోను తన అరుణిమను వదలడు కదా! ఏ కాలంలో, ఏ సమస్య ఎదురైనా నీటి వరదకు గరికపోచ తలవంచి- ఆ తరవాత యథాప్రకారం తలెత్తుతుంది. 'పాదరసం' లాంటి కాలాన్ని పట్టుకుని తన విజయానికి అనువుగా మలచుకోవడంలోనే ఉంది మనిషి తెలివి.

మనిషి ఆయుర్దాయం నూరేళ్లు. అందులో సగం నిద్రకు, కొంత విశ్రాంతికి, ఇంకొంత అమాయక బాల్యానికి, మరికొంత వృద్ధాప్యానికి, కొంత కబుర్లకు, మరికొంత ప్రయాణాలకు, ఇంకొంత అనారోగ్యాలకు... ఇలా ఖర్చయిపోతుంటే తన జీవితకాలంలో మనిషి ఏం సాధించినట్టు?

'కాలానికి నేనెంతో విలువిస్తాను. ఆ విషయమై ఎన్ని గంటలైనా మాట్లాడగలను' అని చమత్కరించాడో కవి. ఎన్ని పనులు అనివార్యమైనా చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో దైవచింతనకు, నామస్మరణకు, ధార్మిక కార్యకలాపాలకు సమయం కేటాయించడం అనివార్యంగా భావించాలి మనిషి. జ్ఞాననేత్రాలను వికసింపజేయగల శక్తిని ప్రసాదించిన ఈ మానవజన్మ మళ్ళీ మనకు లభిస్తుందో లేదో! అందుకే మన జీవనకాలాన్ని ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు వర్గీకరణ చేసుకోవాలి. పాండవులు కాలానికి వశులైనా, తమ దురదృష్టకర సమయాన్ని అజ్ఞాతవాసంలో సమర్థంగా మలచుకున్నారు. 'కాలనైజాన్ని చక్కగా అవగతం చేసుకున్నవాడికి జీవితం విలువ బాగా తెలుస్తుంది' అంటాడు తత్వవేత్త జాన్సన్‌. 'ధన జన యౌవనాదులు గర్వాన్ని కలిగిస్తాయి. అవన్నీ కాలచక్ర భ్రమణంలో కలిసిపోయేవే' అంటారు శంకర భగవత్పాదులు. శ్రీకృష్ణుడి కాలధర్మ వార్తకు ఖిన్నుడైన అర్జునుడు వ్యాసుడివల్ల కాలాతీత తత్వబోధ గ్రహిస్తాడు. 'సమయమూ, సాగర తరంగమూ ఒకరికోసం ఆగవు' అని ఆంగ్లసామెత. 'కాలాయనమః' అన్న వేద కథనం మనకు సర్వదా స్మరణయోగ్యమైనది.
                                                                                                        - చిమ్మపూడి శ్రీరామమూర్తి 

No comments:

Post a Comment