ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 27 August 2013

అమృతరసం


మూలం నుంచి శాఖాగ్రం వరకు వ్యాపించి ఉండే వృక్షరసాన్ని- అది యథాతథంగా ఉన్నప్పుడు అనుభవించడం సాధ్యంకాదు. ఆ వృక్షరసాన్నే ఫలరూపంలో అనుభవించడం సులభం. కనుకనే లోకం ఫలాన్ని ఆశిస్తుంది. క్షీరంలో నెయ్యి సర్వవ్యాప్తంగా ఉంటుంది. కానీ, నెయ్యిలో ఉండే కమ్మదనాన్ని క్షీరంలో పొందలేం. పాలను తరచి నెయ్యి వేరు చేసిన తరవాతే రసానుభూతి కలుగుతుంది.

అదేవిధంగా భక్తి జ్ఞాన వైరాగ్య స్థాపనకై వేదవ్యాస మహర్షి వేదాల నుంచి భాగవత సారం తీసి, లోకానికి ప్రసాదించాడు. భాగవతం అంటే భగవంతుడి గురించి తెలియజేసేది. భగవద్భక్తులను భాగవతులు అంటారు. భగవంతుడు భాగవతుల్లో వ్యక్తమవుతాడన్న భావన భాగవత గ్రంథానికి పునాది. పద్దెనిమిది వేల శ్లోకాలతో, పన్నెండు స్కంధాల్లో భాగవత మహాపురాణ రచన ఉంటుంది.

ప్రప్రథమంగా ఈ మహాపురాణాన్ని, తన నాభి కమలంలో ఆసీనుడై సంసార భయకంపితుడైన బ్రహ్మకు- కరుణారస హృదయంతో శ్రీమన్నారాయణుడు వినిపించాడు. ఇది ఆదిలోను, అంతంలోను వైరాగ్యయుక్తమైన గాథలతో, భగవల్లీలా కథామృత ప్రవాహరూపమై భక్తకోటికి మహదానందాన్నిస్తూ విరాజిల్లుతోంది. దీంట్లో ధర్మం, నిష్కలుషంగా, నిష్కంటకంగా నిరూపితమైంది.

విష్ణుభక్తులకు తరగని మూలధనమైన భాగవతం- పురాణాల్లో నుదుటి తిలకం వంటిది. భాగవత శ్రవణాసక్తి జనించిన మరుక్షణంలోనే ఆ మనిషి హృదయవీధిలో శ్రీకృష్ణభగవానుడు స్థిరుడై నిలిచిఉంటాడు. అరణ్యంలో సింహగర్జన విని సాధుజంతువులు భయంతో పారిపోయినట్లు, భాగవత ఘోష వల్ల కలిదోషాలు నశించిపోతాయంటారు.

వేదవ్యాస మహర్షి దీనిలో పరమహంసలకు ఉపయుక్తమైన జ్ఞానాన్ని సర్వసమర్థంగా ఉపదేశం చేశాడు. పరిశుద్ధాంతఃకరణంతో, భక్తిశ్రద్ధాసమన్వితుడై భాగవత పఠన, మనన, ధ్యానాలు చేసేవారికి మోక్షం కరతలామలకమవుతోందని చెబుతారు. అగ్నిహోత్రం అనేకానేక కాష్ఠాలను దహించేవిధంగా- భాగవతం సర్వపాపాలను హరించివేస్తుందని అంటారు.

భాగవతాన్ని భక్తితో ఏకాగ్రతతో ఇతరులకు వినిపించేవారి హృదయం పవిత్రమవుతుంది. నిత్యం భాగవతపఠనం జరిగే గృహం తీర్థరూపం పొందుతుంది. అక్కడ నివసించేవారు పాపప్రక్షాళన చేసుకొని పరిశుద్ధులవుతారు. గంగా, గయా, కాశీ, పుష్కర, ప్రయోగాది నదులు ఇవ్వలేని పుణ్యఫలం భాగవతం ఇస్తుందని ప్రతీతి.

దీన్ని అధ్యయనం చేయడంవల్ల ధీశక్తీ, సామ్రాజ్యం, ధనాధిపత్యం, పాపవిముక్తీ కలుగుతాయని పురాణవచనం. ఈ గ్రంథాన్ని ఆశ్రయించినవారికి వేరొక శాస్త్రంగాని, తరుణోపాయ సాధనంగాని అవసరంలేదంటారు. భాగవత పారాయణమే జ్ఞానయజ్ఞంగా చెబుతారు. శ్రీశుకాది మహాజ్ఞానులంతా భాగవత పఠన రూపమైన జ్ఞానయజ్ఞం ఆచరించినవారే.

శాపగ్రస్తుడైన పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశం చేసిన సమయంలో శుకమహర్షి- ఆ రాజర్షికి ఆత్మతత్వ ప్రతిపాదకమైన భాగవత తత్వం వినిపిస్తాడు. భాగవతం భూలోక అమృతరసం అనీ, ఇటువంటిది స్వర్గ సత్య కైలాస వైకుంఠాది లోకాల్లో లభ్యంకాదనీ అభివర్ణిస్తాడు.                                                                                                 - భరణి 

No comments:

Post a Comment