ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 22 July 2013

గురు పూర్ణిమ

                            
 నాలుగు ముఖాలు ఉండటం బ్రహ్మరూపం. నాలుగు చేతులు ఉండటం విష్ణు లక్షణం. నొసట కన్ను ఉండటం శివుడి లక్షణం. అయినా ఒకే ముఖం ఉండి కూడా ఆయన బ్రహ్మ. రెండు చేతులే ఉండి కూడా ఆయన విష్ణువు నొసట కన్ను లేకున్నా ఆయన శివుడు. ఆయన త్రిమూర్తుల లక్షణాలను పుణికిపుచ్చుకొన్నాడు. అందుకే ఆయన భగవానుడు. ఆయన వ్యాస భగవానుడు- బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు.

వ్యాసుడు భారతీయ సంస్కృతిని రూపుదిద్దాడు. వేదాలను విభజించి చక్కగా పరిష్కరించాడు. పంచమ వేదంగా కౌరవ, పాండవ గాథను 'మహాభారతం'గా నిర్మించాడు. అందులో శ్రీకృష్ణప్రోక్తం, సర్వోపనిషత్తు సారమైన 'గీత'ను గ్రథనం (కూర్పు) చేశాడు. భాగవతాది పురాణాలు లోకానికి అందించాడు. వ్యాసుడు తన శిష్యుల్లో పైలుడికి రుగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణవేదాన్ని అప్పగించి లోకంలో ప్రసరింపజేశాడు. వ్యాసుడు పరిపూర్ణ తత్వజ్ఞానంతో బ్రహ్మసూత్రాలు రచించాడు. వాటిలో విశ్వంలోని ఏ తాత్విక ధారనూ విడిచిపెట్టకుండా సరళ సుందరశైలిలో చర్చించాడు. 'మునుల్లో నేను వ్యాసుడిని' అంటాడు గీతలో శ్రీకృష్ణుడు.

యోగి అయినవాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఘర్షణకు తావులేకుండా కర్తవ్యాన్ని బాధ్యతాయుతమైన లీలగా ఎలా నిర్వహిస్తాడో వ్యాసుడి జీవితంలో మనం దర్శించవచ్చు. లోకహితార్థమై ఒక వంక తపస్సు, మరొకవంక శిష్యులకు శిక్షణ, ఇంకొకవంక ఆశ్రితరక్షణ నిర్వహిస్తూనే- అవసరమైనప్పుడల్లా జన్మనిచ్చిన తల్లిని దర్శిస్తూ తగినరీతిన సేవిస్తూ వచ్చాడు వ్యాసుడు. వైరాగ్యం అంటే బాధ్యతలను వదిలిపెట్టడం కాదని, వ్యామోహపడకుండా బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహించడమనే సందేశాన్ని మహాభారతంలో వ్యాసుడి పాత్ర మనకందిస్తుంది. కృష్ణుణ్ని మానవమాత్రుడిగా గాక పరిపూర్ణ అవతార పురుషుడిగా దర్శించిన మొదటివాడు వ్యాసుడు.

వ్యాసుడి జనన తిథిని 'ఆషాఢపూర్ణిమ'గా బ్రహ్మాండ పురాణం చెబుతోంది. పూర్ణిమ అంటే సమగ్రత. వ్యాసపూర్ణిమ భారతీయ సంప్రదాయంలో గురుపూర్ణిమ. శ్రీకృష్ణుడు గీతోపదేశం ద్వారా జగద్గురువైతే, శక్తిమంతమైన సంస్కృతిని, దానికి అవసరమైన విశాల వాఞ్మయాన్నీ సృష్టించిన వ్యాసుడూ లోకానికి గురువే. గురువు జ్ఞానప్రదాత. జ్ఞానం బ్రహ్మస్వరూపం. అందుకే గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర స్వరూపుడన్నారు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు, మహాత్ములైన గురువులున్నారు. సర్వగురువులకూ గురుస్థానీయుడు వేదవ్యాసుడు. అందరు గురువుల్లోనూ అంశల భేదంతో వేదవ్యాసమహర్షి ఉంటాడు. ఈ విధమైన ఏకత్వ గురుభావన ఈ దేశ సంప్రదాయం.


వ్యాసుడనేది ఒక్కడి పేరు కాదని అది ఒక వ్యవస్థ అని, ఒక పీఠమని ఒక భావన. పరాశరపుత్రుడు ఇరవై ఏడో వ్యాసుడిగా ప్రసిద్ధుడు. విష్ణుమూర్తి మానసపుత్రుడైన అపాంతరతముడే ఈ వేదవ్యాసుడిగా అవతరించాడని చెబుతారు. 'ఓయి వ్యాసా! ఓయి విశాలబుద్ధా! ఓయి వికసించిన అరవిందాలవలె దీర్ఘనేత్రాలు గలవాడా! భారతమనే తైలంతో ప్రపూర్ణమైన జ్ఞానమయప్రదీపాన్ని ప్రజ్వలింపజేశావు. అటువంటి నీకు నమస్కారం' అని ఒక ధ్యానశ్లోకం పేర్కొంటోంది.
                                                  - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

No comments:

Post a Comment