ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 4 August 2013

హిత వచనాలు


    సంఘంలో శ్రేష్ఠ పురుషుడు ఎలా నడుచుకొంటాడో, ఆయనను అనుసరించే అందరూ అలాగే నడుచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఆయన ధర్మాధర్మాలకు, మంచి చెడులకు ఏది ప్రమాణం అని చెబితే, లోకం అదే ప్రమాణాన్ని అవలంబిస్తుంది అంటుంది భగవద్గీత.

శ్రేష్ఠుడు అంటే రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ఆదరణీయుడు, ఆదర్శప్రాయుడు, అనుసరణీయుడు, 'పెద్ద'వాడు, 'గొప్ప'వాడు, సంఘంలో ఒక ఉన్నత స్థానం, హోదా కలవాడు. రాజ్యానికి రాజు శ్రేష్ఠుడు. అందుకే 'యథారాజా తథా ప్రజాః' అని లోకోక్తి. కుటుంబంలో కుటుంబ పెద్ద, తండ్రిగానీ తల్లిగానీ, శ్రేష్ఠులు. పిల్లల మీద వాళ్ళను పెంచే తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంటుంది. ఒక సంస్థలో ఉన్నతాధికారి శ్రేష్ఠ పురుషుడు. అందుకే ఆ సంస్థలో సమర్థత, క్రమశిక్షణ, విలువలు ఆయనను బట్టి ఉంటాయి. సాధారణంగా విద్యార్థులకు ఉపాధ్యాయుడు శ్రేష్ఠ పురుషుడు. ఒక రాజకీయ పక్షానికి దాని నాయకుడు శ్రేష్ఠ పురుషుడు.

శ్రేష్ఠ పురుషులను అనుకరించే లోకం పోకడలో ఒక విచిత్రం కనిపిస్తుంది. శ్రేష్ఠుల ప్రవర్తన విధానాన్ని, తమకు చేతనైనంత వరకు వాళ్ల అనుయాయులు అనుకరిస్తారు. శ్రేష్ఠులు తాము ఆచరించకుండా ఇతరులకు నోటి మాటలుగా చెప్పే నీతులు ఎంత మంచివైనా, హితకరమైనా అనుయాయులు వాటిని సాధారణంగా పెడచెవిన పెడతారు. శ్రేష్ఠులు 'చేసేది' అనుయాయులు అనుసరిస్తారుగానీ, అందుకు విరుద్ధంగా వాళ్లు 'చెప్పే' మాటలను సాధారణంగా పాటించరు.

పిల్లలకు తల్లిదండ్రులు ఎన్నో హితవులు చెబుతారు. పిల్లలు మాత్రం సాధారణంగా తల్లిదండ్రులు చేసేది చూసి, దాన్ని మాత్రమే ప్రయత్నపూర్వకంగానో, అప్రయత్నంగానో అనుకరిస్తారు. తల్లిదండ్రులు చెప్పింది విని ఆ ప్రకారం నడుచుకొనే పిల్లలు అరుదు. తండ్రి తాను ధూమపానం చేస్తూ, కొడుకును చేయొద్దంటే కొడుకేం చేస్తాడు? తాను కూడా చాటుగానో మాటుగానో ధూమపానం చేస్తాడు. తమ పెద్దలను గురించి తాము అగౌరవంగా మాట్లాడుతూ, పిల్లలకు మాత్రం 'పెద్దలను గౌరవించవలెను' అని నోటి మాటగా ఎంత బోధించినా, సాధారణంగా అది వ్యర్థమే అవుతుంది. నాయకుడు ఆడంబరంగా అట్టహాసంగా బతుకుతూ, అనుయాయులను నిరాడంబరంగా ఉండమని బోధిస్తే వాళ్లేం చేస్తారు? అదే చేస్తారు- తాము చాలా పటాటోపంగా ఉండి, వినే ఇతరులకు మాత్రం సీదా సాదాగా ఉండమని బోధిస్తారు!

లోకం పోకడ ఇది కాకపోతే, లోకం ఇలా ఉండదు. లోకంలో అందరూ ఉత్తములే ఉంటారు! ఎందుకంటే, లోకంలో మంచి మాటలు 'చెప్పే' వాళ్లకూ, ఆదర్శాలు వల్లించే వారికీ కొదవలేదు. ఆ హితబోధలన్నీ విని ఆచరించే వాళ్లే తక్కువ. తల్లిదండ్రులందరూ పిల్లలకు అత్యుత్తమ ప్రవర్తన కలిగి ఉండాలనే చెబుతారు. వారి మాటలు విని ఆచరిస్తే, లోకంలో పిల్లలందరూ బుద్ధిమంతులుగానే ఉండాలి. గురువులు, నేతలు ప్రజలను నీతిగా జీవించమనే చెబుతారు. దాని ప్రకారం నడుచుకొంటే పౌరులందరూ ధర్మపరులే కావాలి. ఏ మత గ్రంథమూ శాస్త్రమూ దొంగతనాలు చెయ్యమనీ, పరులను పీడించమనీ చెప్పదు. యథాశక్తి పరోపకారం చెయ్యమనే చెబుతుంది. ఈ బోధలు అందరూ అనుసరిస్తే సమాజంలో నేరం అనేదే ఉండదు. సమాజమంతా పరోపకార పరాయణత్వంలోనే మునిగి తేలుతుండాలి. మరి అలా జరగదేం? శ్రేష్ఠులు చెప్పేదొకటీ (అది కొంచెం కష్టమైనదీ), చేసేదొకటీ (అది కొంచెం తేలికైనదీ) అయితే వాళ్ల అనుయాయులు పెద్దలు చేసినట్టే చేస్తారు. చెప్పినట్టు చేయరు. అలా అనుకరించటానికి కష్టమైన మంచి లక్షణాలు ఆ శ్రేష్ఠుడి దగ్గర ఉంటే, వాటిని మాత్రం వదిలి, తేలికగా అనుకరించగలిగిన అవలక్షణాలను మాత్రం అందిపుచ్చుకొంటారు.

అందుకే తాను చెప్పినదేదో ఆచరించి కూడా చూపగలవారు మహనీయులు. అలాంటి తల్లిదండ్రులు, నాయకులు, గురువులు సంఘానికెంతో విలువైన వాళ్లు. వాళ్లే 'ఆచార్యులు'. ఆచార్యుడంటే నిర్వచనమే అది: తాను బోధించే విషయాలను బాగా ఆకళింపు చేసుకొని, వాటిని ఆచరించటం ఎలాగో ఇతరులకు నోటిమాటగా నేర్పటమే గాక, స్వయంగా ఆచరించి చూపేవాడు ఆచార్యుడు.

గురువుకు, వికాసాన్నీ పురోగతినీ కలిగించే దోవ ఏదో తెలిసికూడా, తన పరిమితుల వల్ల తాను ఆ మార్గాన వెళ్లలేకపోవచ్చు. శక్తి ఉంటే శిష్యులు గురువును మించకూడదా? చరిత్రలో ఎందరో మహానుభావులు గురువు చూపిన మార్గంలో నడిచి, గురువు కంటే ఉన్నతిని సాధించారు. శ్రీరాముడు విశ్వామిత్రుడి దగ్గర అస్త్ర విద్యా రహస్యాలు నేర్చుకొన్నాడుగాని 'మహర్షీ, తమరే ఇంత కోపిష్ఠివారు, ఈర్ష్యాద్వేషాలకు లోనై బోలెడంత తపశ్శక్తి వ్యర్థం చేసుకొన్నారు. తమరి వద్ద నేను నేర్చేదేమిటి?' అని దోషాలు ఎంచలేదు. శ్రీకృష్ణుడితో అర్జునుడు 'నువ్వు ఆయుధం పట్టవు. నన్ను మాత్రం యుద్ధం చెయ్యమని చెబుతున్నావు!' అంటూ వాదం పెట్టుకోలేదు.

తైత్తిరీయ ఉపనిషత్తులో ఆచార్యుడు, విద్య పూర్తి చేసుకొని వెళ్తున్న శిష్యుడితో ఇలా అంటాడు: 'నాయనా! సత్యం పలుకు, ధర్మం ఆచరించు. మాలాంటివారి ప్రవర్తన నువ్వు చూశావు. దానిలో మంచి ఏదో అది మాత్రమే అనుసరించు. మిగిలినది అనుసరించవద్దు!
                                                              - మల్లాది హనుమంతరావు

No comments:

Post a Comment