ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 17 August 2013

సిరుల వరాల దేవి


అనంత విశ్వాన్ని 'లక్షించేది' లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో 'కనిపెట్టుకుని', 'గమనించి' పాలించే శక్తి- అని భావార్థం. కనులు తెరవడాన్ని సృష్టిగా, మూయడాన్ని లయగా సంకేతిస్తే- ఆ రెంటి నడుమ ఉన్నది 'స్థితి'గా భావించవచ్చు. పరమేశ్వర శక్తిచే జరిగే సృష్టి స్థితి లయలే 'ఈక్షణ' శక్తిగా వేదరుషులు అభివర్ణించారు.
సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ 'లక్ష్యం'గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే 'లక్ష్మి'. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి. భృగు ప్రజాపతి, ఖ్యాతి దంపతులకు పరాశక్తి మహాలక్ష్మిగా ఆవిర్భవించింది. జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీన్ని 'భృగు'వారమనీ వ్యవహరిస్తారు. భృగు పుత్రికగా లక్ష్మీదేవికి 'భార్గవి' అని దివ్యనామం. పర్వతరాజు (హిమవాన్‌) పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు. నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణుదయనే ఆయా లోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి... ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీస్థానాలుగా చెబుతారు. శాస్త్రాలు ప్రస్తావించిన సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి- ఒకే లక్ష్మి తాలూకు విభిన్న రూపాలివి.

సిద్ధలక్ష్మి: ఎవరు ఏ సాధన చేసినా, ఏ కార్యాన్ని తలపెట్టినా అది సాఫల్యం చెందాలని ఆశిస్తారు. ఆ సఫలతే సిద్ధి. ఆ సిద్ధి- సాధన దశలో లక్ష్యంగా, సిద్ధదశలో ప్రాప్తి(ఫలం)గా ఉంటుంది. కార్యానికి ప్రయోజనం సిద్ధి. చేసిన పని వ్యర్థంకాకుండా ఫలింపజేసే భగవత్కారుణ్యం సిద్ధలక్ష్మి. ఆధ్యాత్మిక సాధనలే కాక, భౌతిక సాధనలకూ సిద్ధి కావాలి కదా! అందుకే కార్యసాధకుల ఉపాస్య దేవి ఈమె. సిద్ధి లభించేలా సాధనకు ఉత్తేజాన్ని, వనరులను, శక్తిని అనుగ్రహించే దేవి ఈ సిద్ధలక్ష్మి. యోగాలు, కర్మలు ఈ తల్లి వల్లనే ఫలిస్తాయంటారు.

మోక్షలక్ష్మి: తత్వపరంగా- ప్రాపంచికమైన అజ్ఞాన బంధనం నుంచి 'విడుదల' చెంది, పరమాత్మతో తాదాత్మ్యం చెందడమే మోక్షం. ఈ మోక్షమనే సంపదను, మోక్షానికి అవసరమైన యోగ, విచారణాది జ్ఞానశక్తులను ప్రసాదించే ఈశ్వరశక్తి- మోక్షలక్ష్మి. నిష్కాములైన యోగులకు గమ్యమైన తత్వం ఈ మూర్తి.

భౌతికదృష్టితో చూస్తే- దుఃఖాల నుంచి, పాపాల నుంచి, సమస్యల నుంచి 'విడుదల' (ముక్తి) అనుగ్రహించే దేవి ఈ లక్ష్మి. 
జయలక్ష్మి: జయమంటే గెలుపు. ప్రతివారూ తామున్న రంగంలో అందరికంటే గొప్పగా ఉండాలని కోరుకోవడం సహజం. అలా 'పైచేయి'గా, 'మించి' ప్రకాశించే విధంగా ఉండటమే జయం. అంతేకాక- ధర్మార్థ కామమోక్షాలు అనే పురుషార్థాలను సాధించడాన్ని 'జయం' అంటారు. ఈ రెండు అర్థాలు జయ శబ్దానికి ఉన్నాయి. ఈ రెండు రకాల 'జయా'లను ప్రసాదించే తల్లి జయలక్ష్మి. అవరోధాలను దాటగలగడమే నిజమైన జయం. భౌతిక ప్రగతికీ, ఆధ్యాత్మికోన్నతికీ ఆటంకాలైన వివిధ అవాంఛనీయ శక్తులను నెగ్గుకు రాగలిగే స్త్థెర్యాన్నీ, శక్తినీ ప్రసాదించి గెలుపునిచ్చే దేవత ఈ దేవి. 'విజయలక్ష్మి'గానూ కీర్తిస్తారు.

సరస్వతి: జ్ఞానరూపమైన సంపద (లక్ష్మి) సరస్వతి. విద్యాలక్ష్మిగా ప్రసిద్ధిచెందిన దేవత. ఐహిక జీవనానికి పనికివచ్చే అనేక విద్యలు, సూక్ష్మమైన యజ్ఞవిద్యలు- ఈ సరస్వతి 'అపరావిద్యల' రూపాలు. ఆత్మజ్ఞానాన్ని అందించే బ్రహ్మవిద్య 'పరావిద్యా' స్వరూపం. ఈ విద్యల రూపంలో ఉన్న జ్ఞానవిజ్ఞాన రూప ఐశ్వర్యమే ఈ మాత.

శ్రీలక్ష్మి: శ్రేష్ఠత్వాన్నీ, శోభనీ సూచించే శబ్దం శ్రీ. అదే విధంగా రుగ్విజుసామాత్మకమైన వేదవిద్యకూ 'శ్రీ' అని పేరు. అన్ని లోకాల్లోని గొప్పతనాలు, శోభలు, ఉత్సాహానందాది రూపాలను 'శ్రీ' అనే పదం (అక్షరం) ద్వారా బోధిస్తారు. మరొక భావనలో- 'శ్రీ' అంటే ఆశ్రయించేది, ఆశ్రయంగా ఉన్నది- అని రెండర్థాలు. జ్యోతిని కాంతిలా, బెల్లాన్ని తీపిలా- పరమేశ్వరుని ఆశ్రయించుకున్న ఆతని అవిభాజ్య స్వాభావికశక్తి 'శ్రీ'.సర్వజీవులకు ఆశ్రయంగా, ఆధారంగా ఉన్నది కనుక శ్రీ.

వరలక్ష్మి: 'వర' శబ్దానికి 'కోరుకున్నది' అని అర్థం. అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి. 
వారివారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవి కావాలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపద లేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ ఈ వరలక్ష్మి. వాస్తవానికి ఈ వరలక్ష్మిలో మిగిలిన అయిదు లక్ష్ములనూ సమన్వయించి చరమ నామంగా చెబుతారు. 

'ప్రతి స్త్రీలోనూ లక్ష్మీకళ ఉన్నది' అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీరూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం- ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం.
                                                                        - సామవేదం షణ్ముఖశర్మ

No comments:

Post a Comment