ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 14 August 2013

మాటలో మాధుర్యం


జ్ఞాలు అనేకరకాలు. అందులో 'వాక్‌ యజ్ఞం' ఒకటి. జీవితంలో వాక్కును యజ్ఞసమంగా వినియోగించటం వాగ్యజ్ఞం. 'యజ్ఞ సమం' అంటే- వాక్కుతో యజ్ఞం చేస్తామా, అదెలా?! యజ్ఞం అతి పవిత్రమైంది. దేన్ని భగవంతుడికి అర్పించాలో దాన్ని అగ్ని ద్వారా మంత్రయుక్తంగా సమర్పించటం. దేవతల ప్రీత్యర్థం చేసేది. కోరికలు లేని వరం కోసం కూడా యజ్ఞం చేసేవారున్నారు. పూర్వ రుషులు అలాంటివారు. యజ్ఞం ఆసాంతం అతి పవిత్రం. అత్యంత శుభప్రదం. శోభాయమానం.

జీవితంలో, జీవితాంతం వాక్కుతో యజ్ఞం చేసేవారున్నారు. హరిశ్చంద్రుడు అలా చేశాడు. నోట్లోంచి వెలువడిన ప్రతి మాటను సత్యంగా మలచుకున్నాడు. ఆ క్రమంలో- చక్రవర్తి హరిశ్చంద్రుడు రాజ్య సర్వాన్నీ పోగొట్టుకున్నాడు. భార్యాబిడ్డలను కోల్పోయాడు. కాటికాపరి అయ్యాడు. కుమారుడికి స్వయంగా శవదహనం చేసేందుక్కూడా సిద్ధమయ్యాడు. ఆయన సత్యాన్ని మాత్రమే మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి మాటను సత్యం చేశాడు. కోల్పోయినది లెక్కకాదు. సత్యాన్ని పాలించటమే లెక్క.

రఘువంశ రాజులూ రాజ్యంతోపాటు సత్యవాక్కునూ పరిపాలించారు. అందువల్లే ఒకరాజు ధర్మపత్నినే రుషికి అప్పగించేందుకు సిద్ధపడ్డాడు. మరోరాజు ప్రాణాధికమైన కుమారుడు రాముని అడవులకు పంపేందుకూ ఒప్పుకొన్నాడు. వాక్కు అంటే కేవలం నాలుక మీంచి వచ్చేది కాదు. వట్టి నోటిమాట కాదు. వాక్కు శబ్ద బ్రహ్మ... ఓంకారంలా. మనం దాన్ని అలాగే భావించాలి. అలాగే భాషించాలి. నోట్లోంచి వెలువడిన ప్రతి మాట, ప్రతి అక్షరం ఒక యజ్ఞ ఆహుతిగా, సమిధగా పరమాత్మ ప్రీత్యర్థం మనం చేస్తున్న వాక్‌ యజ్ఞకుండంలో సమర్పించాలి. మన హృదయంలో, కంఠస్థానంలోని విశుద్ధి చక్రంలో పరమాత్మ కొలువై ఉన్నాడంటారు. జిహ్వమీద సాక్షాత్‌ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఆసీనురాలై ఉందంటారు. నాభి స్థానంలోంచి బయలుదేరిన వాక్‌ ప్రవాహధార వూర్ధ్వ ముఖంగా ఎగసి నాలుకమీది నుంచి బయటికి రావాలి. హరిపాదాల పుట్టి, శివుని అభిషేకించి, స్ఫటిక సదృశ ప్రవాహంగా భువివైపు ప్రవహిస్తూ వస్తున్న గంగాదేవికి, ప్రవాహ వేదికగా నిలిచిన దేవభూమిలాంటి మన 'దేహభూమి' వాక్కు ప్రవహించే అతిపవిత్ర వేదికగా, భూమిగా, భూమికగా ఉంది. దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఎలా వాడుకుంటున్నాం? అబద్ధం, కటుత్వం, కుటిలత్వం, స్వార్థం, అసభ్య పదజాలం లాంటి వ్యర్థ పదార్థాలు కలగలిసిన మురుగు కాలువలు ప్రవహించాల్సిన ప్రవాహ స్థానాలా దేవతా నిలయాలు!? మనం ఆలయాలలో దేవతా విగ్రహాలను గంగాజలంతో గోక్షీరంతో, గోదధితో, గోఘృతంతో, అగ్నితప్త భస్మంతో, పరిమళ ద్రవ్యాలతో అభిషేకిస్తాం. మనలోని స్వయంభువులైన దేవతలను స్పృశిస్తూ, అభిషేకిస్తూ బయటికి రావలసింది మలినమైన వాక్‌ ప్రవాహమా? దుర్వాసనలు వెదజల్లే వాడిన పువ్వులా? తాజా పువ్వులను పసుపు, కుంకుమ, చందనం అద్ది భగవంతుని పాదాలవద్ద ఉంచుతాం. గంగాజలంలోనైనా తులసిదళాలు వేసిగానీ ఆ జలాన్ని వినియోగించం. ఎంత శుభ్రమైన, పవిత్రమైన వస్తువులనైనా 'అపవిత్ర: పవిత్రోవా...' అంటూ మళ్ళీ మంత్రాచ్ఛాదిత జలంతో ప్రోక్షణంతో పవిత్రం చేసిగానీ పూజకు ఉపయోగించం.

మన వాక్కు సహజంగానే ఓ అభిషేక జలం. గంగాజలం. అగ్నిపూతమైన ఓ పుష్పం. రూపం లేని వాయు సంబారం. ఆకాశ సదృశం. పూజకు ఇంతకంటే పవిత్రమైన సంబారం ఉందా? యజ్ఞానికి ఇంతకంటే ఉపయుక్తమైన ఆహుతి ఉందా? పారిజాతాన్ని పేడలో అద్ది పూజకు పెడతామా? నారికేళానికి మసి దిద్ది దేవుడి ముందు కొడతామా? ఏమిటీ అజ్ఞానం! అసత్యాలు, పరుష వాక్యాలు, పెడమాటలు... వీటితోనా మాటలను నిర్మించటం!

మాట ఒక పువ్వులా ఉండాలి. ఒక వెన్నెల రేఖలా ఉండాలి. రాముడిలా మాట్లాడాలి. హనుమలా భాషించాలి. కోకిల గానంలా సంభాషించాలి. మనకు కావలసింది స్వరమాధుర్యం కాదు. భావ మాధుర్యం, మార్దవం, మన్నన, సత్యం. ఔను. వాక్కుకు సత్యం వెన్నెముక కావాలి. హృదయం కావాలి. అదే స్వరం కావాలి. సర్వం కావాలి. మాట ఒక మంత్రం కావాలి. వాగ్యజ్ఞానికి అదే సంబారం. అదే సమిధ. అదే ఆహుతి. అదే పూర్ణాహుతి!                                                                           - చక్కిలం విజయలక్ష్మి

No comments:

Post a Comment