ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday, 29 August 2013

అమృతతుల్య అనుభూతి


 లోకంలోని అనుభూతులన్నింటిలోకీ తలమానికమైంది ఆధ్యాత్మికానుభూతి. నిజానికదో అలౌకికానుభూతి. ఆనందకాసారం. బ్రహ్మానంద మూలకం. మానవ జీవిత సార్థక్య రహస్యాన్ని తెలుసుకున్నవారు దాన్ని పొందేందుకు జీవితకాల సాధనకు కంకణం కట్టుకునే అమృతోపమాన వ్రతం. ఉత్కృష్ట మనోరథం.

ఆధ్యాత్మిక అనుభూతికి కారణం ఏమిటి, ఆధారం ఏమిటి? అసలు అందుకు ఏం కావాలి? ఒక గొప్ప క్షేత్ర దర్శనమా, తీవ్రమైన ధ్యాన యోగమా, అత్యుత్తమమైన గురువు పర్యవేక్షణలో సాధనలా? అధిక కాల అనుష్ఠానమా, తపనా, వ్రతాలు, నిష్ఠలు, ఉపవాసంలాంటి హఠయోగాలా? ఇన్నీ, ఇవన్నీ. అవును. కానీ... కాకపోవచ్చుకూడా. ఎందుకంటే ప్రాపంచికాంశాల్లో ఒక పని పక్వానికి రావడానికి, ఫలించడానికి కాల నియమం ఉంటుంది. కానీ పారమార్థికం అలా కాదు.

సత్కర్మలు చేస్తూ ఫలితాన్ని భగవంతుడికి అర్పించి, ఆయన ఇచ్చే ప్రసాదం కోసం వేచి ఉండటమే మనం చేయవలసిన, చేయగలిగిన పని.

అయితే ఈ అనుభూతి ఏమిటి? అది పొందాలని ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన ప్రతివారికీ ఉంటుంది కదా? నిజానికి అదే కదా మనిషి పొందవలసింది. అయితే ఎందులో ఉంది... ఆ అపురూప అనుభూతి? ఏ సత్కర్మలో ఉంది, ఏ గొప్ప సాధనలో ఉంది? దీనికి గొప్ప కర్మలు చేయవలసిన అవసరం లేదు. అది గొప్ప కర్మచేసే సందర్భంలో కావచ్చు. లేదా ఆ కర్మ తాలూకు నిరామయ గాఢ నిశ్శబ్దంలో కావచ్చు. లేదా ఈ రెండూ కాని సాధారణ స్థితిలోనూ సంభవించవచ్చు.

మనలోని భగవదున్మత్తత, ప్రేమ, పరితాపం ఏ క్షణంలో, ఏ కణంలో, ఏ కోణంలో దాన్ని మనకు అందిస్తుందో తెలీదు. భగవంతుడిపట్ల భక్తి, అనురక్తి అధికమయ్యే కొలదీ ఆయన తాలూకు పరిమళాన్ని మనకు పంచేందుకు ప్రకృతిలో సర్వత్రా, సర్వకాల సర్వావస్థల్లోనూ అవకాశం కాచుకొనే ఉంటుంది. భక్తుడు ఆయనను పొందాలనే తీవ్ర పరితాపంతో తపించిపోతున్నప్పుడు పంచ భూతాత్మకమైన ఈ ప్రపంచంలోని ఏ భూతమైనా ఆ అనుభూతిని ఇవ్వగలదు. ఒక చల్లని గాలి తెర భగవత్‌ స్పర్శలా అనుభూతిని ఇవ్వవచ్చు. అరచేతిలోని ఔపోసనా జలం భగవంతుణ్నే లోపలికి సేవిస్తున్న అపూర్వానుభూతిని కలిగించవచ్చు. ఒక సాధారణ దీపంలో ఆ పరంజ్యోతి స్వరూపాన్నీ దర్శించవచ్చు.

రామకృష్ణ పరమహంస తన ధర్మపత్ని అయిన శారదాదేవిలో ఆ పరదేవతను కనుగొన్నారు. వారి చిన్నతనంలో ఒక దేవతను కొలిచే కార్యం మీద వూరి స్త్రీలతో కలిసి పొలాల మధ్యలో వెళ్తూండగా ఆకాశంలోని పక్షల బారును చూసి గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యానికి లోనయ్యారు. రాధ నెమలిని చూసినా, నీలి మేఘాన్ని చూసినా కృష్ణ భావంతో మైమరచిపోయేది. త్యాగరాజు తన సంగీతంతో భగవదనుభూతి పొందారు. అన్నమయ్య వేంకటేశ్వరుని భక్తిపూర్వక కీర్తనల్లోనే గాక స్వామి శృంగార రసపోషణనూ ఆధ్మాత్మికానందంగా మలచుకున్నారు. ఇందులో అసంబంద్ధం ఏమీ లేదు. సర్వత్రా దైవాన్ని భావించేవారు, ఆశించేవారు ఎల్లెడలా దర్శించగలరు. స్పర్శించగలరు. అణువణువునా భగవదనురక్తితో తపించేవారు ఒక యుగళగీతంలోని స్వర సంచలనానికి కూడా ఆధ్యాత్మికానుభూతితో కళ్లు అరమోడ్పులై పులకలు పోగలరు. లేగదూడను చూసి గోవు పొదుగు చేపినట్లు భగవంతుడి స్మరణమాత్రం చేతనే (ఒక్కోసారి అది కూడా లేకుండానే) ప్రకృతిలోని ప్రతి అణు స్పందనలోనూ, స్పర్శలోనూ, శబ్దంలోనూ, నిశ్శబ్దంలోనూ భగవంతుని అనుభూతి చెందగలడు భక్తుడు. 
                                                                          - చక్కిలం విజయలక్ష్మి 

No comments:

Post a Comment