ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 12 August 2013

ప్రేమ నేత్రం


దేవుడు తన ఆనందాన్ని నాలో అనుభవిస్తున్నాడు అని నిశ్చయంగా ఎవరు చెప్పగలరు? దైవాన్ని అనుభవిస్తున్న వాళ్లు. అనుభవమే అనుభవాన్ని ఇస్తుంది. అది అపరోక్ష అనుభూతి. నేను రోడ్డుమీద ఉన్నా, ఆఫీసులో పనిచేసుకుంటున్నా, ఇంట్లో వ్యవహారం సాగిస్తున్నా- ఆయన కృప నామీద ఉంటే... దుఃఖంలో కూడా సహాయం చేస్తున్న హస్తం నన్ను ప్రేమతో స్పృశిస్తున్నట్లుగా ఉంటుంది. నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది.
కాషాయ వస్త్రాలతో నా శరీరాన్ని కప్పుతాను. నా హృదయంలో ప్రేమ ఉండదు. అప్పుడు నన్ను ఎవరు దైవభావంతో చూస్తారు? కనీసం మంచి మానవుడిగానైనా గుర్తించరు.

ఖురాన్‌లో సూక్తులు వల్లెవేస్తాను. భగవద్గీత ప్రవచనాలు అలవోకగా చెబుతాను. వేదం చెప్పినందుకు నాకు బంగారు కడియాలు తొడిగారు. నా హృదయం ప్రేమలో మునిగి తాండవమాడదు. నా వల్ల సంఘానికి ఏమి ప్రయోజనం?

మరకైనా లేకుండా హృదయంలో మాలిన్యాలన్నింటినీ కడిగేసుకున్న తరవాత, నిరక్షరాస్యుడికీ పరమేశ్వరుడు ప్రేమామృతాన్ని పంచడానికి తహతహలాడుతాడు. వసంతం వనంలో ప్రవేశించినప్పుడు సహజంగా కోయిల అటువైపే పరుగులు తీస్తుంది కదా.

భగవంతుని సమాగమంలో తప్ప తృప్తిలేని జీవితం కావాలి. దానికోసం పాటుపడాలి. కాలం కరిగిపోతూ ఉంటుంది. పగలు సుఖం ఉండదు. రాత్రి నిద్ర ఉండదు. ఈశ్వరుడు రాడు. నేనేం చేయాలి అనే తపనతో హృదయం రగిలిపోవాలి. అప్పుడే ఆనంద పరవశుణ్ని చేసే ఆ మురళీరవం వినిపిస్తుంది. కాంతులు విరజిమ్ముతుంది.

అత్యంత సూక్ష్మమైనది దైవ మార్గం. ఆనందాన్వేషణలో మునిగి ఉన్నవాడికే ప్రేమ లోతు తెలుస్తుంది. నీటిలో ఈదే చేపకు లోతులు తెలియవా? 'సదాచార కర్మలకంటే సహజ మార్గంలోనే భగవంతుడు తెలుస్తాడు' అంటాడు కబీరు. పాండిత్యం వల్ల జ్ఞానం వస్తుంది. అనుభవం రాదు. రకరకాలుగా పోగు చేసిన జ్ఞాన సమాచారం మనసును కప్పేస్తుంది. అటువంటి మనసు సత్యాన్ని దర్శించలేదు.

ఓ పండితుడు ఫకీరు దగ్గరకు వెళ్ళాడు. అతడి చేతిమీద ఓ చిలుకు కూర్చుని ఉంది. పంజరం లేదు కానీ, ఎగిరిపోవడాన్ని ఆ చిలుక మరిచిపోయింది. ఆ చిలుక మాట్లాడుతోంది- పండితుడికి బదులు.

'రామా! రామా! జపించు రామ నామం! జపించు రామ నామం!'

'భలే మాట్లాడుతోందే ఈ చిలుక!' అన్నాడు ఫకీరు. పండితుడన్నాడు- 'అవును స్వామీ, ఈ చిలుక మహాజ్ఞాని!'

ఆ మాటలు విని ఫకీరు నవ్వాడు. 'నిజమే అయ్యుండాలి... మరి జ్ఞానులందరూ చిలుకలాగే తప్ప వేరుగా ఉండటం లేదుకదా' అన్నాడు. మత గ్రంథాలను, మహా వాక్యాలను బట్టీపట్టి అప్పజెప్పడం కాదు జ్ఞాన ప్రాప్తికి మార్గం. ఎప్పటినుంచో అంతటా సాక్షాత్కారం అయి ఉన్న సత్యాన్ని చూడటానికి కావలసిన చూపును పొందటం. 'నాకు తెలుసు' అనేవాడికి ఎవడూ ఏమీ చూపించడు. చెప్పడు.

తెలుసుకున్నవాడు, తెలుసుకోవాల్సిన విషయం- ఈ రెండూ లేని ఒక పవిత్రమైన శూన్యం ఏర్పడినప్పుడే, భగవంతుడు అక్కడికి వచ్చి చేరతాడు. గొయ్యి తవ్వి మట్టితీసి వదిలేస్తే, అందులోకి వర్షపు నీరు వచ్చి చేరినట్లు.

విశ్వవ్యాప్తమైన సత్యాన్ని దర్శించటానికి ప్రేమ నేత్రాన్ని తెరిచి ఉంచుకోవాలి. హృదయాన్ని మేల్కొలిపే సద్గురువును మనం కలుసుకున్నప్పుడు ఏది రాయో ఏది రత్నమో అతడే తేలుస్తాడు. ప్రేమ-వైరాగ్యాల రహస్యాలు అతడికి తెలిసినట్లు ఎవరికీ తెలియదు!

- ఆనందసాయి స్వామి

No comments:

Post a Comment