ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 28 August 2013

శ్రీకృష్ణ జన్మాష్టమి


హావిష్ణువు భూమిపై శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు, భూలోకం వైకుంఠం కన్నా అధిక తేజస్సుతో వెలిగింది. ఆయన సాన్నిధ్యం, ఆయన నడిచే చోటును జ్యోతిర్మయం చేసింది. శ్రీకృష్ణుడు జరిపిన రాసలీలను బ్రహ్మతోపాటు శివుడు వీక్షించి, ఆ అద్భుత నృత్యకేళి గురించి పార్వతితో చెప్పాడట. ఇతరుల భార్యలతో శ్రీకృష్ణుడు ఎలా నాట్యం చేశాడని పార్వతి సందేహం వెలిబుచ్చింది. చాలామందికి సామాన్యంగా కలిగే సందేహమే అది. అప్పుడు శివుడు 'మొత్తం విశ్వమంతా నారాయణుడి శరీరమే. ఆయన గోపికల్ని స్పృశించినప్పుడు, తనకు తానే స్పృశించినట్లు అవుతుంది. గోపికలను శ్రీకృష్ణుడు కౌగిలించుకోవడం పరమాత్మ జీవాత్మను కౌగిలించుకొన్నట్లే అని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడిపై గోపికలకు గల అపారభక్తి వారి మోక్షానికి కాంతి ద్వారాలు తెరిచాయి' అని పార్వతికి విశదం చేశాడు.
'రసం' అంటే రుచి. అన్నింటికన్నా మించిన మాధుర్యం గల రసస్వరూపుడు నారాయణుడే అని ఉపనిషత్తులు వర్ణించాయి. నిజానికి అన్ని రసాలు (రుచులు) ఆయనలో రాశీభూతమైనాయి. భగవంతుడు ఆనందం ఇస్తాడు. అదే రాసలీల. అదొక అలౌకిక సౌందర్యలీలా ఖేలన మనోజ్ఞ ప్రాభవం!

భగవంతుడు భక్తికి లొంగిపోతాడు. యశోద ఆయన్ని చిన్నతనంలో రోలుకు బంధించింది. విశ్వపరివ్యాప్తుడైన భగవంతుణ్ని ఎవరైనా తాడుతో కట్టగలరా? ఆయన సమ్మతి లేకుండా మనం ఆయన్ని తాళ్లతో బంధించగలమా? యశోద పట్ల ప్రేమవల్ల ఆయన యశోద చేతిలో బందీ అయ్యాడు. భక్తులు తమ గుండెల్లో బంధిస్తామన్నా ఆయన ఆనందంగా ఒప్పుకొంటాడు. యశోద ఆయన్ని బంధించినప్పుడు, తాడు పొడవు రెండు అడుగులు తగ్గింది. అందువల్ల ఆయన తన దేహాన్ని కుదించుకొని, యశోద కట్టడానికి అవకాశం కల్పించాడని చెబుతారు.

తాడు రెండడుగులే తగ్గడానికి వెనక పరమార్థం ఒకటి ఉన్నది. భగవంతుణ్ని చేరడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి భక్తి. రెండోది అనుష్ఠానం. నిర్ణీత సాధన చేసి తీరాలి. మనలో గర్వాహంకారాలు అణిగినప్పుడే మనలో జ్ఞానం వికాసం చెందుతుంది. సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి ఆయనే అనే భావం కలిగినప్పుడు, మనకు ఆయన దాసుడు అవుతాడు. తాను అవతారమైనా అర్జునుడికి రథసారథి అయ్యాడు. ఆ రథాశ్వాలకు స్నానం చేయించాడు. స్నేహితుడు సుదాముడు తన వద్దకు వచ్చినప్పుడు అతణ్ని సింహాసనంపై కూర్చోబెట్టాడు. సుదాముని పాదాలను కడగమని రుక్మిణిని అడిగాడు. సుదాముని పాదస్పర్శతో ఆ జలాలే పవిత్రమయ్యాయని శ్రీకృష్ణుడు రుక్మిణికి చెప్పాడు. భక్తుల మధ్య ఆయన అమితానంద పరవశుడవుతాడు. భక్తులు ఏ పేరు పెట్టి పిలిచినా ఆనందంగా పలుకుతాడు.

అన్ని లోకాలు శ్రీకృష్ణుడిలోనే ఉన్నాయి. ఆయన కాలి మువ్వలు పాతాళం, రసాతలం, ఆయన మోకాళ్ల ప్రదేశం మహాతల లోకం. ఆయన హృదయం సురలోకం. ఆయన నాభి అనంతాకాశం. ఆయన శిరస్సు సత్యలోకం. శ్రీకృష్ణుడు చల్లదనం ఇచ్చే సూర్యుడని పరమ భక్తాగ్రేసరుడు వేదాంత దేశికులు అన్నారు. శుకబ్రహ్మ శ్రీకృష్ణుడి జాతక చక్రం పూర్తిగా అందివ్వలేదు. శ్రీకృష్ణుడు జన్మించిన మాసం, నక్షత్రం మాత్రం ఇచ్చాడు. కానీ, స్వామి దేశికులు వృషభ లగ్నంలో శ్రీకృష్ణుడు జన్మించాడని, ఆయన అవతరించినప్పుడు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శని, బుధుడు అనుకూలమైన శుభకూటమిగా ఏర్పడినట్లు వివరించాడు. సాధువుల హృదయాలు ఆనందంతో పరవశించాయి. నదీజలాలు కాలుష్యాలు తొలగి పవిత్ర ప్రవాహాలయ్యాయి. చెట్లు పుష్కలంగా తియ్యని ఫలాలు అందించాయి. సూర్యుడికి గ్రహణం రావచ్చు. శ్రీకృష్ణుడనే సూర్యుడికి మాత్రం ఏనాటికీ గ్రహణం రాదు. ఆయన గీత విశ్వగీతమై అనేకమంది రాతలు మార్చింది. ఆయన అవతార అమృత కిరణాలు భూమిని ఎన్ని యుగాలైనా తేజోమయం చేస్తూనే ఉంటాయి.
                                                                                         - కె.యజ్ఞన్న 

No comments:

Post a Comment