దైవదర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్నది శిలా విగ్రహమో, చెక్కబొమ్మో అనుకోకూడదు. దానిలోని దైవత్వాన్ని మనం అనుభూతం చేసుకోవాలి. క్షేత్రాల్లో ఆధ్యాత్మిక చైతన్యం విరాజిల్లుతూ ఉంటుంది. క్షేత్రదర్శనాలకోసం చేసే ప్రయాణాలను తీర్థయాత్రలంటారు. తీర్థయాత్రలకు, విహారయాత్రలకు మధ్య చాలా తేడా ఉంది. నిత్యజీవనంలో కాస్త ఆటవిడుపుకోసం, మానసిక ఆహ్లాదంకోసం చేసేవి విహారయాత్రలు. అవి మనిషిని సేదతీరుస్తాయి. దివ్య ఆధ్యాత్మిక అనుభూతికోసం, ఆత్మసంతృప్తికోసం సంస్కారవంతమైన చిత్తం తీర్థయాత్రలను కోరుకుంటుంది. విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు మనిషి మానసికస్థితి ఒకలా ఉంటుంది, పుణ్యతీర్థాలను సేవించేటప్పుడు మరొకలా ఉంటుంది.
మహాభారతం అరణ్యపర్వంలో తీర్థయాత్రలకు వెళ్ళదలచినవారికి ఉండవలసిన యోగ్యతల గురించి భీష్ముడికి పులస్త్యుడు చెబుతాడు. వ్రత నిష్ఠ, శౌచం, ధర్మశుభస్థితి, ఉపవాసదీక్ష వంటి లక్షణాలు వివరించి, అవన్నీ ఉంటే తప్ప, 'తీర్థములాడనేరరు' అంటాడు పులస్త్యుడు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళదలచినవారి మానసిక సంసిద్ధత ఎలా ఉండాలో చెబుతాడు.
భారతంలోనే కాదు, శ్రీదేవీభాగవతం వంటి అనేక పురాణాల్లో సైతం మనిషి ముందుగా దీక్ష తీసుకుని మరీ తీర్థయాత్రా సేవనం చేయాలని ఉంది. అలాంటివారిని అన్నమయ్య 'సువ్రతులు'గా వర్ణించాడు. భక్తితో, ఆర్తితో దేవుడి దివ్యసాక్షాత్కార అనుభవం కోసం అర్రులుచాస్తూ ఆతృతగా వెళ్ళాలన్నాడు. తిరుమల గిరుల్లోను, కొండమీద ప్రతీ అణువు పావనం, ప్రతి శిలా సాలగ్రామం, ప్రతి అంశం బ్రహ్మమయం అన్న భావనతో సంతోషంగా వెళ్ళాలి. ఆ రకమైన మానసిక సంసిద్ధతతో వెళ్ళినప్పుడు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతి మనిషికి దక్కుతుంది. అంతేతప్ప- సెలవులు వచ్చాయనో, విహారయాత్రలకనో పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు. దేవుడి నెలవులు కనుగొనడం కోసం వెళ్ళాలి.
తీర్థయాత్రలకే కాదు, విహారయాత్రలకు సైతం ఒక పద్థతి అవసరం. మానసిక సంసిద్ధత ముఖ్యం. ప్రకృతితో మనిషి బంధం గట్టిపడేందుకు విహారయాత్రలు గొప్పగా ఉపకరిస్తాయి. ఇటీవలి కాలంలో ప్రకృతికీ మనిషికీ మధ్య వైరం బాగా పెరిగిపోయింది. మనిషి చేతిలో ప్రకృతి సర్వవిధాలా నాశనమవుతోంది. సఖ్యత పూర్తిగా చెడిపోయింది. భయంకరమైన కాలుష్యంలో మునిగిపోయి, దేహం మట్టికొట్టుకుపోయి, మన మనసు మసిబారిపోతున్న స్థితిలోంచి ఒకసారి చల్లని మంచుకొండల్లోకి, పచ్చని అడవుల్లోకి, మెత్తని ఇసుక తిన్నెలపైకి వెళ్ళి గడిపితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వహించండి! తీరిగ్గా కూర్చుని వరిపైరు వయ్యారాలను గమనిస్తూ చేలగట్లపై విహరిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి!
విహారయాత్రలకు వెళ్ళడమంటే ప్రకృతి సోయగాలను ఆస్వాదించడానికి వెళ్ళాలి. ఒక సీతాకోకచిలుకను చూస్తే- అంత చిన్నజీవి ఎన్నెన్ని రంగులతో ఎంత అందంగా ఉందో కదా అనిపించాలి. ఒక్కరోజుతో తన జీవితాన్ని చాలించే పువ్వు అంత హాయిగా నవ్వుతూ ఎంత పరిమళాన్ని వెదజల్లుతోందో చూసి మనం మురిసిపోవాలి. చక్కగా అల్లుకున్న తమలపాకు తీగలకు ఈ పూటే చిగిర్చిన లేలేత చివురాకు మృదుస్పర్శకు ముందెన్నడో మొలిచిన ముదురాకుల ముతకదనానికి గలతేడా మన చేతికి తెలిసిందంటే- ప్రకృతితో ఇంకా స్నేహం మిగిలి ఉందని అర్థం. మన గుండెలో ఎక్కడో ఓ మూల కాస్త పచ్చదనం ఇంకా మిగిలే ఉందని ధైర్యం. అందుకోసం విహారయాత్రలు! మన హోదాలు, బాధ్యతలు, కష్టాలు, కాలుష్యాలు అన్నింటినీ కాసేపు మరిచిపోయి, కాస్తంత పచ్చిగాలిని హాయిగా పీల్చుకొని ప్రకృతికి ధన్యవాదాలు చెప్పుకోవడం కోసం మనం విహారయాత్రలు తలపెట్టాలి.
తీర్థయాత్రలంటే ఏవేవో నియమాలంటారు, పోనీ విహారయాత్రలన్నా ఆస్వాదిస్తున్నారా అంటే- అదీ సందేహమే! చాలామందికి విహారయాత్రలపట్ల ఆసక్తి, అవగాహన ఉండటంలేదు. గోదావరిలో పాపికొండల విహారయాత్రలకు వందలమంది నిత్యం వెళుతూనే ఉంటారు. కమ్మనిమట్టి వాసనతో మొదలై చల్లని పిల్లగాలులు, గోదావరి తరగల నురుగులు, గాలిలోంచి తేలివచ్చే పట్టిసీమ గుడిగంటల మోతలు, నదికిరువైపులా జనపచేల తెల్లని మొవ్వులు... దూరంగా ఆకుపచ్చని నునుపుకొండలు, పసుపు పచ్చని పూలతో విరగబూసిన నువ్వుచేలు... నీళ్ళను చీల్చుకుంటూ లాంచీ పోతుంటే వచ్చే లయబద్ధమైన సంగీతం, నీలిమబ్బులు, గోదావరి వయ్యారాలు... వీటన్నింటినీ ఆస్వాదించాలి. వాటిని వదిలేసి- ఖరీదైన బోట్లలోని శీతల మందిరాల్లో తలుపులు బిడాయించుకుని పేకాటతో కాలక్షేపం చేసేవాళ్లకు విహార యాత్రలు అక్కర్లేదు. మనిషి తనలోకి ఇంకెప్పుడు తొంగిచూడగలడు? తిరిగొస్తుంటే మళ్ళీ ఎప్పుడో! అన్న బెంగ పుట్టించాలి. వాలిపోయే పొద్దుకు ప్రకృతి అద్దుతున్న వర్ణాలను చూసి మురిసిపోవాలి. గోదావరిలో మునిగిపోతున్న సూర్యుణ్ని చూస్తే- అయ్యో ఈ రోజెంత త్వరగా అయిపోయిందో కదా! అనిపించాలి. తలచుకున్నప్పుడల్లా జ్ఞాపకాలు తియ్యగా చెలరేగి మనసుకు కితకితలు పెట్టాలి. విహారయాత్రలు మనిషి జీవితంలోకి ఇంద్రధనుస్సులోని రంగులన్నింటినీ ఒంపాలి. ఇన్ని వర్ణాలా అని మనిషి అబ్బురపోవాలి. అదీ విహారయాత్రల పరమార్థం!
సంస్కారశుద్ధి లేకుంటే తీర్థయాత్రలు వ్యర్థం.
సంతోషసిద్ధి లేకుంటే విహారయాత్రలూ వ్యర్థమే!
- ఎర్రాప్రగడ రామకృష్ణ
No comments:
Post a Comment