ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday, 4 August 2013

స్నేహం

                          
  రెండు మనసుల మధుర సమాగమం స్నేహం. స్నేహమే సర్వస్వం. జీవితానికి అర్థం చెప్పేది స్నేహమే. అంతకన్నా తీయనిది సృష్టిలో లేదు. స్నేహాన్ని మించిన పెన్నిధి లేదు. స్నేహం దేవతల సన్నిధి. స్నేహం- ప్రాణం, ప్రణవం, వేదం. స్నేహం ఒక అభయహస్తం. ఒక అమృతహస్తం. స్నేహం శాంతి. స్నేహం ఒక వెలుగు, ఒక వెన్నెల, ఒక ఓదార్పు, ఒక వూరట.

స్నేహం ఎవరితోనైనా చేయవచ్చు. దానికి కుల, జాతి, మత, వర్గ, వర్ణ విభేదాలు తెలియవు. హృదయమే స్నేహం చిరునామా. మంచివారితో స్నేహంచేసి, మన మంచితనాన్ని, వారిలోని మంచితనాన్ని మరింత పెంచుకోవాలి. మిత్రుడు చెడు మార్గాలు పడితే, సన్మార్గం వైపు తిప్పే యత్నం చేయాలి. స్నేహానికి ద్వేషం తెలియదు. స్నేహానికి వ్యతిరేక పదం లేదు. హృదయాన్ని పంచి ఇవ్వాలి. మీకు స్నేహం లేకపోతే జీవితం శూన్యం. ఏదో వెలితి అనిపిస్తుంది!

స్నేహితుని చిరునవ్వులు మనకు దారిచూపే చిరుదీపాలు. ఆత్మకు పడిన చల్లని నీడ స్నేహం. స్నేహం స్నేహంగానే చివరి దాకా మిగిలిపోవాలి. వెలిగిపోవాలి. అపార్థాలతో అంతరించే స్నేహం స్నేహమే కాదు. స్నేహం సంపదకన్నా గొప్పది. ఒంటరిగా ఉన్నవేళ రూపాయి నోట్లు మనతో తీయని కబుర్లు చెప్పవు, చెప్పలేవు. డబ్బు అయిపోతుందనే బెంగ ఉంటుంది. స్నేహం అలా కాదు. అది రోజురోజుకూ పెరుగుతుంది. స్నేహం నిఘంటువులో ప్రతి మాటకూ అర్థం త్యాగం. వ్యాకరణం, గద్యం లాంటి జీవితంలో స్నేహం ఒక మనోజ్ఞ కవిత. ఎడారి లాంటి జీవితానికి చల్లని చిరుగాలి. అమృత స్పర్శ స్నేహం. కాంతి ధార కురిపించే మరో రుతుపవనం.

పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, చదువు, కీర్తి, ప్రతిభ... జీవితంలో ఇవన్నీ చాలా అవసరం. స్నేహంలోని తీయదనం వాటిని మించిందని గర్వంగా చెప్పుకొందాం. ఆపదలో ఆదుకొనే దైవహస్తం అది. స్నేహాన్ని, స్నేహితుణ్ని ఏనాడూ మరవకూడదు. మనం దైవాన్ని మరచిపోగలమా, గురువును మరచిపోగలమా, తల్లిదండ్రుల్ని మరచిపోగలమా, మన ఆత్మబంధువుల్ని మరచిపోగలమా? స్నేహితులూ అటువంటివారే.


స్నేహితుల గురించి వారి పరోక్షంలో ఇతరులతో ఏనాడూ చెడ్డగా చెప్పకూడదు. అటువంటివారే ఆప్తమిత్రులు, ఆత్మీయమిత్రులు. స్నేహం పూలచెట్టు వంటిది. రోజూ పూలు ఇస్తుంది. మంచితనం పరిమళాన్ని, మంచిమాటల తేనె వూటల్ని అందిస్తుంది. దాన్ని పోషించడం మన వంతు. ఏ వస్తువులు పోయినా విచారించి, తరవాత మరచిపోతాం. స్నేహాన్ని పోగొట్టుకొంటే మళ్ళీ దొరకదు. స్నేహం కాలం చెరపలేని రెండు ఆత్మల సమైక్య సంతకం. ఏ వీణా వినిపించలేని అమృతవర్షిణి. స్నేహం రత్నహారం. గుండె ఖజానాలో భద్రంగా దాచుకోవాలి. ప్రాణమిచ్చే స్నేహితుడు, మనల్ని కాపాడే స్నేహితుడు 'అంతర్యామి'కి బాహ్యరూపం. ఈ లోకంలో స్నేహాన్ని మించిన స్వర్గం లేదు. అవసరంలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అంటారు. అనుక్షణం మన శ్రేయం కోరేవాడే అసలైన స్నేహితుడు. మహోన్నత పదవి లభించవచ్చు. స్వర్గలోకాధిపత్యం దొరకవచ్చు. కానీ, భూమ్మీద గొప్ప స్నేహితుడు దొరకడం అదృష్టం. అరుదు. సుకృతం.
- కె. యజ్ఞన్న 


No comments:

Post a Comment