ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 20 August 2013

శ్రావణ పూర్ణిమ


ర్షంతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం. మేఘమాలికలు బారులుతీరి మురిపించే సమయం. ప్రకృతి సస్యశ్యామలమై పులకరింతలతో పరిఢవిల్లే కాలం... అదే ఈ వర్ష రుతువులో అడుగడుగునా పర్వదినాలతో శోభిల్లే శ్రావణమాసం. స్థితి కారకుడైన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం పూర్ణిమనాటి చంద్రునితో కూడిన మాసం కనుక శ్రావణమని ప్రఖ్యాతి చెందింది. మన సంస్కృతీ సంప్రదాయాల్ని శ్రావణమాసంలోని పండుగలు విశేషంగా ప్రతిఫలిస్తాయి. ఆ పరంపరలోనిదే శ్రావణపూర్ణిమ. సౌభ్రాతృత్వం, సామరస్యం, సహజీవన మాధుర్యం, సౌమనస్యాలకు ఈ పర్వదినం ప్రతీక. కలిమిలేములకు, వర్గ విచక్షణలతో సంబంధం లేకుండా ఆసేతు హిమాచలం ఆనందోత్సాహాలతో దీన్ని నిర్వహించుకుంటారు. భారతీయ కుటుంబ బాంధవ్యాల్లోని మధురిమలకు ఇది ప్రతిబింబం. సోదర సోదరీమణుల ప్రేమానుబంధానికి చిహ్నం రక్షాబంధన ఉత్సవం. శ్రావణ పూర్ణిమనే రక్షికా పూర్ణిమ, జంధ్యాల పున్నమి, రాఖీపూర్ణిమ, నూలిపున్నమి, నారికేళ పున్నమి అనే పేర్లతోనూ వ్యవహరిస్తారు.

ప్రాచీన భారతీయ విద్యావిధానంలో అధ్యయన ప్రక్రియ శ్రావణ మాసంలోనే ప్రారంభమయ్యేది. వేదాధ్యయనానికి బ్రహ్మోపదేశం తప్పనిసరి అని చెబుతారు. బ్రహ్మోపదేశ స్వీకరణకు సూచికగా యజ్ఞోపవీత ధారణ చేస్తారు. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యేముందు చేపట్టే సంవిధానాన్ని 'శ్రావణి' అంటారు. ఆ శ్రావణిలో భాగంగా దీక్షాకంకణాన్ని రక్షాబంధనం పేరిట ధరించే సంప్రదాయం ఏర్పడింది. కాలక్రమంలో రక్షకట్టుకోవడం ధార్మికపరమైన చర్యగా స్థిరపడింది. సమాజంలో కుటుంబ విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు విఘాతం వాటిల్లినప్పుడు ఒకరికొకరు రక్షకులమై ఉంటామని చాటిచెప్పేదే రక్షాబంధనం. పరస్పర రక్షణ ద్వారా సమాజ పరిరక్షణ ఏర్పడుతుంది. దీనిద్వారా ధర్మరక్షణ సాకారమవుతుందని ఈ రక్షికా పూర్ణిమ సందేశమిస్తుంది.

భవిష్య పురాణంలో రక్షాబంధన ప్రాశస్త్యం వివరంగా ఉంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు దీని విశేషాన్ని వెల్లడించినట్టు పురాణం పేర్కొంటోంది. మహాతేజోవంతుడు, దానశీలుడు, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని దేవతల అభీష్టం మేరకు శ్రీహరి తన శక్తితో బంధించాడంటారు. 'నా శక్తిని రక్షాబంధన రూపంలో నిన్ను చుట్టుముడుతూ బంధిస్తుంది. ఈ బంధం నిన్ను ఎల్లవేళలా రక్షిస్తుంది. ఇది నీకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది' - అని బలిచక్రవర్తికి విష్ణుమూర్తి అభయాన్ని ప్రసాదించినట్టు పురాణోక్తి. శ్రావణ పూర్ణిమనాడు లక్ష్మీనారాయణుల ఆరాధనం విశేష ఫలితాల్ని అందిస్తుందని ధర్మసింధు చెబుతోంది.

మరాఠాయోధుడైన ఛత్రపతి శివాజీ- భవానీదేవి కృపానుగ్రహంవల్ల ఖడ్గాన్ని, దానితోపాటు రక్షాకంకణాన్ని స్వీకరించాడంటారు. వీటిద్వారా శివాజీ మహరాజ్‌ ఎన్నో విజయాలందుకున్నాడని ప్రతీతి. మొగలాయీ పాలకులు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించే తరుణంలో రాజపుత్ర వనితలు తమ ఆత్మాభిమానంకోసం, మాన సంరక్షణకోసం ఈ రక్షాబంధన ఆచారానికి విశేష ప్రచారం కల్పించారంటారు. శ్రావణ పూర్ణిమని పాల్కురికి సోమనాథుడు 'నూలి పున్నమి'గా పేర్కొన్నాడు. నూలుతో వడికిన జంధ్యాల్ని మంత్రపూర్వకంగా ధరించడం ఈ పున్నమి ప్రత్యేకత. ఈ పూర్ణిమనాడే కొత్తగా ఉపనయనం అయినవారికి ఉపాకర్మను నిర్వహిస్తారు. కర్ణాటకలో ఈ పర్వదినాన్ని నారికేళ పున్నమిగా జరుపుకొంటారు. సముద్రానికి గోక్షీరం, ఫలపుష్పాలు, కొబ్బరికాయల్ని నివేదిస్తారు. జలసిరుల్ని కురిపించే సముద్రుడికి కృతజ్ఞతలు చెప్పడమే ఈ ప్రక్రియలోని ఆంతర్యం.

శ్రావణ పూర్ణిమనే హయగ్రీవ జయంతిగా వ్యవహరిస్తారు. వేదాపహారియైన రాక్షసుణ్ని హయ(గుర్రం) వదనంతో మూర్తీభవించిన హయగ్రీవుడు సంహరించాడంటారు. వేదోద్ధారకుడైన హయగ్రీవుడు సర్వవిద్యలకు ఆధారభూతుడు. లౌకిక పారమార్థిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన దోహదపడుతుందంటారు. అందుకే హయగ్రీవ స్వామి స్తుతితోనే అమరకోశం ఆరంభమవుతుంది. సంస్కృత భాషా దినోత్సవంగానూ శ్రావణ పూర్ణిమ విఖ్యాతి పొందింది. సామాజిక, లౌకిక, ఆధ్యాత్మిక, పారమార్థిక, ప్రాకృతిక, చారిత్రక అంశాలు ఎన్నో శ్రావణ పూర్ణిమతో ముడివడి ఉన్నాయి. సంప్రదాయాలు, ఆచారాలేవైనా దేశవ్యాప్తంగా నిర్వహించుకునే రాఖీపూర్ణిమ వేడుక భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతమై నిలుస్తోంది. విశేషపర్వదినమై వెలుగుతోంది.
                                                                - డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

No comments:

Post a Comment