ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday, 15 August 2013

దివ్య జీవనదీప్తి



'ఈ భూమిపై భగవంతుడు శాశ్వతంగా భాసిస్తుండాలి. అందుకే నా తపస్సు' అని అరవిందులు ప్రవచించారు. దివ్య జీవనమే ఆయన సందేశం. దివ్య జీవనమే ఆయన సంగీతం.

భగవంతుని ప్రసక్తిలేని ప్రపంచం, జీవితం అపరిపూర్ణం. పరిమితం. సత్యచైతన్యమనే వినూతన చేతస్సును సాధించడం ద్వారా అందమైన, ఆనందమయమైన, పరిపూర్ణ సామరస్య మాధుర్యమయమైన జీవితం గడపవచ్చునని అరవిందులు పూర్ణయోగం ద్వారా గ్రహించారు. ఆ సత్య చైతన్యాన్ని తనలో సుస్థిరం చేసుకోవడానికే తన యావజ్జీవితం శ్రమించారు. చాలామంది మేధావులకు, ద్రష్టలకు ఈ ప్రపంచం వివిధ రకాలుగా, వివిధ కోణాల్లో అర్థమైంది. వారు ఎన్నో ప్రవచనాలు, దర్శనాలు అందించి వెళ్లారు. అవన్నీ మానవాళి శ్రేయం కోసమే. ఇన్నిఉన్నా- ఎందరో ప్రవక్తలు, అవతారమూర్తులు వచ్చివెళ్లినా, ఈ భూమి మారలేదు. సృష్టి తిరిగి అర్థంకాని ఒక క్లిష్టప్రహేళికగా, ఒక దుష్ట ప్రహసనంగా, మానవమారణ హోమాగ్ని జ్వాలల్లో (అరవిందులు తపస్సు చేస్తున్న సమయానికి) దిక్కులేక ఆహుతి అయ్యే అనాథ లాగా మారిపోయింది. ఆమెను రక్షించే హస్తాలు ఎక్కడ? యుగయుగాల మానవాళి అశ్రురాశికి, భగ్నమైపోతున్నవారి కలలకు, అందరినీ చిత్రహింసలు పెడుతున్న దుర్విధికి మూలకారణం ఏమిటి? ఒక మహోన్నత సమాజస్థాపనలో మానవ అపజయాలకు, వైఫల్యాలకు అసలు కారణం ఏమిటి? పూర్ణయోగ చైతన్యశిఖరంలో ధ్యాన నిమగ్నమైన అరవిందులకు ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఎక్కడైతే అన్ని యోగాలు, దర్శనాలు ఆగిపోయాయో, అక్కడినుంచి పూర్ణయోగ ప్రస్థానం ప్రారంభమైంది.

ఈ భూమి పరివర్తన, మానవ చైతన్య పరివర్తన అరవిందుని యోగప్రణాళికలో ప్రధాన అంశాలు. మనిషి చిన్న ఆశాదీపికలు వెలిగించుకుని పెనుచీకటిలో ప్రయాణం సాగిస్తుంటాడు. మహాసత్యం నుంచి రాలిన చిన్న శకలం జగద్రక్షక కాంతిసర్వస్వం అనుకుంటాడు. అన్ని సత్యాలను అధిగమించి, అతీతంగా మెరిసే మహోజ్జ్వల సత్యాన్ని అతను తిరస్కరిస్తాడు. అన్ని వెలుగులకు మూలమైన మహాజ్యోతిర్నివహాన్ని తోసిపుచ్చుతాడు.

'అంతిమ మహా సత్యం పూర్ణ సాక్షాత్కారం పొందినప్పుడే భూమి పరివర్తన సుసాధ్యమవుతుంది. అంతవరకు నా ప్రయత్నం, నా పోరాటం ఆగవు. భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చేవరకు నేను విశ్రాంతి పొందను'- ఇదీ అరవిందుల వజ్రసంకల్పం.

'ఈ భూమి మారదు. స్వర్గం రాదు. నువ్వు ఆరాధించే మహాసత్యం లేనే లేదు. అది అభూతకల్పన. నీ ప్రయత్నం నిష్ఫలం' అని దుష్టులు, దురాత్ములు పరిహసించినా ఆయన నిరాశ చెందలేదు. భగవంతుని నీరవతలో ఇంతవరకు ఎవరికీ దృగ్గోచరంకాని సత్యాలెన్నో ఆయన వీక్షించారు. మానవ జీవనగర్భంలో భవిష్యత్‌ దేవత రూపుదిద్దుకుంటున్నది. మన మర్త్యత్వం బలహీనతలనుంచే ఒక చిరంతన శక్తి ప్రభవించనున్నది. తొలి జీవకణంలో బంధితమైన దైవత్వం అమృతత్వం వైపు అధిరోహిస్తోంది. అదే పరిణామ రహస్యం. అంతులేని బాధాగ్నితో నిండిన కాలస్రవంతిలో ఈ భూమి ఒక దుస్స్వప్నం కాదు. భగవంతుడే ఈ భూమిని సృష్టించాడు. ఈ భూమి తనలో భగవంతుణ్ని సృష్టించి (ఆవిష్కరించి) తీరుతుంది. దేవతలాంటి పూర్ణమానవుడు- అరవిందుని స్వప్నం! భువిపై స్వర్గం- ఆయన సమున్నత ఆదర్శం! దివ్యజీవన ఆవిర్భావం- ఆయన యోగ పరమావధి!                                                                                          - కె.యజ్ఞన్న

No comments:

Post a Comment