ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday, 21 October 2013

వూయల పండుగ

భారతదేశంలో పండుగలన్నీ దాదాపు దేవతల చుట్టూ అల్లుకొన్నవే. స్త్రీలుకానీ, పురుషులు కానీ వారి వారి జీవితాల్లో ఎదుర్కొనే కష్టాలు, దుఃఖాలను నివృత్తి చేయడానికి ప్రాచీన కాలంనాటి రుషిపుంగవులు ఎంతో ఆలోచించి ఏర్పాటుచేసిన వ్రతాలు, నోములు, యాగాలు- ఒక పట్టాన అంతుచిక్కవు. వాటిని చూసి హేతువు తెల్లబోతుంది. 'మా కష్టాలు పోతే చాలు. ఏ నమ్మకమైనా, మాకు నష్టం లేదు' అనే మానసిక తత్వం నుంచి బయలుదేరిన కథలు ఈ వ్రతాల్లో మనకు కనిపిస్తాయి. అవి అన్నీ ప్రగాఢ విశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. కాలక్రమేణా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందినకొద్దీ ఒకనాడు వాటిని ఆదరించిన మనసే వాటిని దూరం చేసుకొంది. అయినా ఇంకా అక్కడక్కడ అవి బతికే ఉన్నాయి.

పూర్వం ఒక మహారాజుకు కావేరి అనే అతిలోక సౌందర్యవతి అయిన కుమార్తె పుట్టింది. ఆమెకు పెళ్లీడు రాగానే వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె అట్లతద్ది వ్రత కథను విన్నది. ఆమె తన స్నేహితురాళ్లు- మంత్రి కుమార్తె, సేనాపతి కుమార్తె, పురోహితుడి కూతురుతో కలిసి 'చంద్రోదయ ఉమా వ్రతం' (అట్లతద్ది) భక్తితో ఆచరించింది. ఈ వ్రతం ఆచరించిన వారికి నవ యౌవనవంతులైన భర్తలు లభిస్తారని ఆనాటి నమ్మకం. రాజు కుమార్తెకు తప్ప మిగిలినవారికి అందమైన భర్తలు లభించారు. రాజు కుమార్తె పెళ్లి ప్రయత్నాలన్నీ విఫలం కాసాగాయి. ఆమె విసిగిపోయి పక్కనేవున్న అడవికి పోయి తపస్సు చేసింది. పార్వతీ పరమేశ్వరులు ఆమెకు కనిపించి తపస్సుకు కారణం తెలుసుకొన్నారు. 'నేను ఉమా వ్రతాన్ని ఆచరించినా ఎందుకు ఫలించలేదు?' అని అడిగింది రాజకుమార్తె. 'ఆ నోము నోచే సమయంలో ఉపవాస దీక్షను తాళలేక సొమ్మసిల్లిపోగా, నీ సోదరులు అద్దంలో చంద్రుని చూపించారు. నువ్వు దీక్ష విరమించావు. ఆ విధంగా వ్రత భంగమైంది. వచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు క్రమంతప్పక వ్రతం ఆచరించు... నీ కోరిక నెరవేరుతుంది' అని కావేరిని దీవించి ఆదిదంపతులు అదృశ్యమయ్యారు. కావేరి అలాగే శ్రద్ధతో వ్రతం చేసి చక్కని భర్తను వివాహమాడిందని కథ.

ఈ పండుగను పల్లెల్లో 'వూయల పండుగ' అంటారు. ఈ పండుగ ముందురోజు భోగి అంటారు (సంక్రాంతి భోగి వేరు). స్త్రీలు, పిల్లలు గోరింటాకు పెట్టుకుంటారు. బాగా పండితే అనురాగం నిండిన భర్త వస్తాడని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు. మర్నాడు తదియనాడు ఉదయాన్నే లేచి చద్ది అన్నం, గోంగూర పచ్చడి, పెరుగన్నం కడుపారా భుజించి పొరుగువారిని లేపుతూ 'అట్ల తద్దోయ్‌, ఆరట్లోయ్‌' అని పాటలు పాడతారు. ఆ రోజు చంద్రోదయం అయ్యేవరకు ఉపవాసం ఉండి, తరవాత స్నానంచేసి అట్లు వేసుకుని నివేదనకు సిద్ధం చేసుకుంటారు. షోడశోపచారాలతో ఉమా శంకరులను పూజించి, వ్రతకథను చెప్పుకొని అక్షతలు శిరస్సుపై వేసుకొని ముత్త్తెదువలతో కలిసి భుజిస్తారు.

వివాహం అనేది స్త్రీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన. ఆదిదంపతుల ఆశీస్సులతో ఆనందప్రదమైన అనురాగ దాంపత్యం లభిస్తుందని ఆనాటివారి గట్టి నమ్మకం. శ్రద్ధ, నమ్మకంతో జీవితాల్ని అందంగా మలచుకోవచ్చని ఈ పండుగ సందేశం.
                                                                                          - కె.యజ్ఞన్న

No comments:

Post a Comment