ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 7 July 2013

గమ్యం


ఇద్దరు బాటసారులు ఒక ఎడారిలో నడిచి పోతున్నారు. ఇద్దరి గమ్యస్థానం ఒక్కటే! 'ఈ ఎడారిలో ఒకచోట శీతలజలం గల గొప్ప సరస్సు ఉంది. అక్కడకు చేరుకుంటే కష్టాలన్నీ కడతేరినట్లే!' అని పెద్దలు చెప్పగా ఇద్దరూ విన్నారు. ఆ మాట నమ్మి ఇద్దరూ ఎంతదూరం ప్రయాణించినా చెరువు జాడే కనపడలేదు. పైన ఎండ మండిపోతోంది. కింద ఇసుక నిప్పుల కొలిమిలా ఉంది. నాలుక పిడచకట్టుకుపోతోంది. దాహంతో బాటసారులు తపించిపోతున్నారు. దూరంగా నీటి మడుగులు కనబడుతున్నాయి. ఇద్దరిలో ఒకడు గబగబా అక్కడికి చేరుకున్నాడు. తీరా చూస్తే అక్కడ ఇసుక దిబ్బలు తప్ప నీటిజాడే లేదు.

రెండో బాటసారి నిబ్బరంగా ఉన్నాడు. ఎండమావులు ఎలా భ్రాంతి పెడతాయో అతడికి తెలుసు. మొదటి వ్యక్తికి తెలియదు. అందువల్ల మాటిమాటికీ నిరాశా నిస్పృహలకు లోనవుతున్నాడు. 'ఇక నేను గమ్యస్థానం చేరలేను!'- ఈ ఆలోచన రాగానే అతడి కాళ్లు వణికాయి. ఉన్న కాస్త సత్తువా హఠాత్తుగా హరించుకుపోయింది. తూలి, కూలిపోయాడు. రెండో బాటసారి 'కొంచెం ఓపిక పట్టు! అదిగో ఆ కనబడే చెట్ల వెనకాల తళతళ మెరిసే నీళ్లు కనబడటంలేదా? దగ్గరకు వచ్చేశాం. లే లేచి నడువు, నా భుజం మీద చెయ్యి వెయ్యి. నిన్ను కూడా గమ్యస్థానానికి చేరుస్తా' అన్నాడు. 'కాదు, అంతా భ్రాంతే. ఆ కనబడేది కూడా ఎండమావే... అంతా వట్టిదే... మనం ఎప్పటికీ గమ్యస్థానం చేరలేం' అంటూ మొదటి బాటసారి కళ్లు మూశాడు. రెండో బాటసారి పట్టు వదలకుండా ముందుకు సాగిపోయాడు. కొద్దిదూరంలోనే శీతల జలాశయం నయనానందకరంగా దర్శనం ఇచ్చింది. అతడి జీవిత లక్ష్యం నెరవేరింది.

నిజానికి అందరి గమ్యమూ ఒక్కటే! ఇది ఒకే ప్రపంచం. అన్నింటిలోనూ ఏకత్వమే భాసిస్తుంది. వ్యక్తులు మాత్రం స్వతంత్రులు. సత్యాన్వేషకులు. మొదట్లో అందరివీ సుసంపన్నమైన ఆదర్శాలే. ఈశ్వర తత్వాన్ని అన్వేషించాలనే తపన అందరికీ ఉంటుంది. ఆ దిశగా కార్యోన్ముఖులవుతారు. ప్రయాణం మొదలుపెడతారు. కొందరిని అజ్ఞానం ఆవరిస్తుంది. వాళ్లు నిరాశకు లోనవుతారు. తాము అసమర్థులమని భావిస్తారు. కుంగిపోతారు. మానసిక బలహీనత పొరపాట్లకు, నేరప్రవృత్తికి దారితీస్తుంది. వాళ్లు బాధలు అనుభవిస్తారు. మాయ ఆవరించి ఉన్నంతవరకూ ఈ కష్టాలు తప్పవు. వీటిని దూరం చేసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గం రాచబాట. ఈ దారిలో ప్రయాణం సుఖప్రదం.

ఈ నిస్సహాయ భావనకు నైరాశ్యానికి కారణం ఎవరు? మనమే! ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారనుకోవడం భ్రమ. మనకు చేయూత మన లోపలినుంచే లభిస్తుంది. మన ప్రయాణం వృథా కాదు. అప్పుడప్పుడు దారి తప్పవచ్చు. మార్గాయాసం కలగవచ్చు. తుదకు అవన్నీ మనకు ఉపకరించేవే. 'గమ్యం చేరే వరకు ఆగవద్దు... జాగృతి చెందండి' అని ఉపనిషత్‌ బోధ. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినవారు గమ్యం చేరుకోగలుగుతారు. వారే మనకు ఆదర్శం.

జగత్తు ఒక రంగస్థలం. అందరూ పాత్రధారులే. వీధిలో ఒక తుంటరి ఒక యువతిని అవమానిస్తున్నాడు. దారిన పోయేవాళ్లు అది చూసి ఆగ్రహించారు. వెంటనే ముందుకు ఉరికి వాడికి దేహశుద్ధి చేసి 'ఇక ఎప్పుడైనా ఇలా అబలలను అవమానిస్తే నీ అంతు చూస్తాం!' అని గట్టిగా బుద్ధి చెప్పారు. ఇలా ధర్మసంస్థాపనకు నడుం బిగించినవాళ్లు ఒక నాటకశాలకు వెళ్లారు. అక్కడ 'ద్రౌపదీ మాన సంరక్షణం' నాటక ప్రదర్శన జరుగుతోంది. దుర్యోధన దుశ్శాసన పాత్రధారులు విజృంభించి నటిస్తున్నారు. వారి ప్రతిభను ప్రశంసిస్తూ ప్రేక్షకులు మళ్ళా మళ్లా వారిచేత ద్రౌపదీ వస్త్రాపహరణం గావింపజేస్తూ, సంభాషణలు చెప్పిస్తూ హర్షధ్వానాలు గావిస్తున్నారు! ఈ ప్రేక్షకులకు తెలుసు- ఇదంతా వట్టిదే... ఉత్త మాయ... భ్రాంతి అని. జగన్నాటకంలో ఇదొక అంతర్నాటకం!

'ఇది నిజంగా మన ఎదుట జరుగుతున్నది' అని భ్రాంతి చెందితే దుర్యోధన దుశ్శాసన పాత్రధారులపై ప్రేక్షకులు కక్ష వహిస్తారు. కానీ, నాటకంలో లీనమైన సహృదయులు తాత్కాలికంగా రసానుభూతి చెంది కాసేపు మైమరచిపోతారు. భవభూతి రచించిన ఉత్తర రామచరితం నాటకంలో 'అంతర్నాటకం' ఉంది. రామలక్ష్మణుల వినోదార్థం వాల్మీకి ఒక నాటకం ప్రదర్శింపజేస్తాడు. అన్నగారి ఆనతిని అనుసరించి లక్ష్మణుడు సీతమ్మను అడవిలో దించిపోవడంతో ఆ అంతర్నాటకం ఆరంభమవుతుంది. రాముడు తన జీవితాన్నే ఒక నాటకంగా చూడవలసి వచ్చింది. ఆనందం బదులు రాముడికి పట్టరాని దుఃఖం కలిగింది. శోకంతో స్పృహతప్పి పడిపోతాడు. మాయామేయ జగం సత్యమని మానవుడు ఎంత భ్రాంతి పడతాడో భవభూతి ఈ నాటక ఘట్టంలో చిత్రించాడు.

ఈ మాయ మాటిమాటికీ మనల్ని ఆవరిస్తూ, ఆవహిస్తూ ఉంటుంది. భ్రాంతులనుంచి మానవుడు బయటపడటం కష్టమవుతూ ఉంటుంది. అందుకే ఎండమావుల్ని నీటి మడుగులుగా భ్రాంతిపడటం! ఆ మృగతృష్ణల్లో నీరు తాగే ప్రయత్నంలో తుదకు నైరాశ్యం మిగులుతుంది. గమ్యం చేరకుండానే జీవితం అంతం అవుతుంది.

జీవనం కోసం నటన చేయవచ్చుకానీ, నటనే జీవితం కాకూడదు. నటన యథార్థమని భ్రాంతి పడకూడదు. నటన జీవితానికి అనుకరణ మాత్రమే. ప్రకృతిలో కూడా అనుకరణలుంటాయి. నీటి మడుగుల్ని అనుకరించే ప్రకృతి వైచిత్రే ఎండమావి. అక్కడ నీరు ఉండదు. కానీ, నీటి మడుగు ఉన్నట్లు భ్రాంతి కలుగుతుంది. చలి చెలమ కోసం వెదికే ప్రయత్నంలో ఎదురయ్యే ఎండమావుల్ని చూసి మనసును చెదరనీయకూడదు. అలాగైతేనే గమ్యం చేరడం సాధ్యం!
                                                        - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment