ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 23 July 2013

సన్నిహితుడు

                     

సమస్త ప్రాణులకు మేలు చేసేవాడు భగవంతుడితో సమానమవుతాడు. ఆ వ్యక్తి అందరికీ సన్నిహితుడే. 

మంచిని కోరేవాడు నిజమైన బంధువు, హితం కోరేవాడు నిజమైన హితుడు, సాన్నిహిత్యం కోరుకునేవాడే నిజమైన సన్నిహితుడని విజ్ఞులు చెబుతారు. హితవచనం పలికి తోటివారికి సహాయ సహకారాలందించడం ఉత్తముల లక్షణం. అటువంటి ఉత్తమ గుణాలున్న వ్యక్తి అందరికీ ఆత్మీయుడై నిరంతరం సేవాగుణం కలిగి ఉంటాడు.

ఎదుటి వ్యక్తి హితాన్ని కోరేవారు సద్భావనతో సమాజాన్ని సుభిక్షం చేస్తారు. మనం కోరకుండానే సూర్యడు తన కిరణస్పర్శచేత పద్మాలను వికసింపజేస్తున్నాడు. చంద్రుడు తన ధవళ కాంతులతో కలువలను వికసింపజేసి లోకాన్ని ఆహ్లాదపరుస్తున్నాడు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే మేఘుడు లోకానికి జీవనాధారమైన వర్షపు జల్లులను ఇస్తూ పుడమిని పునీతం చేస్తున్నాడు.

అలాగే సత్పురుషులూ ప్రతీ క్షణం పరహితం కోరుతూ ప్రపంచశాంతి కోసం పాటుపడతారు.

మీహితాన్ని కోరుకునేవాడే సన్నిహితుడని, బంధువని, అలా ఉపయోగపడనివాడు శత్రువుతో సమానమని స్మృతి చెబుతోంది. మన శరీరంలో పుట్టినప్పటికీ వ్యాధి ప్రమాదకరమైనదే. ఎక్కడో అడవిలో పుట్టినప్పటికీ మన వ్యాధిని పోగొట్టే ఔషధగుణాలున్న మూలిక మనకు ఆప్తబంధువే. అందుకే ఆత్మీయుడైనా, బంధువైనా చెడ్డవాడిని విడిచిపెట్టాలి. ఆదరాభిమానాలు ప్రదర్శించి, మన హితం కోరే వ్యక్తి పరాయివాడైనా అతడినే అత్యంత ఆత్మీయుడిగా భావించాలి.

ఆపదలో ఉన్న దీనుణ్ని కాపాడేవాడు మాత్రమే నిజమైన సన్నిహితుడని, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వెంట ఉండి సహాయం చేసేవాడే నిజమైన బంధువని రామాయణంలో వాల్మీకి వివరిస్తాడు.

రాముడితో యుద్ధానికి ముందు రావణుడు సభికులను అడిగితే- కుంభకర్ణుడు 'మహారాజా! సీతాపహరణమునకు ముందు నీవు చేసిన పనిని గురించి మాతో ఆలోచించి ఉంటే ఆ పని సర్వోత్తమంగా ఉండేది' అని హితవాక్యం చెబుతాడు.

విభీషణుడు కూడా రావణుడితో 'పరస్త్రీలను పట్టిచూడటం అపకీర్తికరం, ఆయుక్షీణం, సంపద్వినాశకరం, పాపానికి మరో రూపం. అంతకన్నా దారుణమైనది మరొకటి లేదు' అంటాడు 'సుఖాన్ని, ధర్మాన్ని పోగొట్టే కోపాన్ని విడిచిపెట్టు, తృప్తిని కీర్తిని పెంచే ధర్మాన్ని సేవించు... నా మాట విని దశరథ పుత్రుడికి సీతను తిరిగి ఇచ్చివేయి. అందరం పుత్రులతో, బంధువులతో సుఖంగా బతుకుదా'మని హితవచనాలు చెబుతాడు.

ఇలాంటి హితవాక్యాలు మనకు రామాయాణంలో ఎన్నో కనిపిస్తాయి. అందుకే ఆ పవిత్ర గ్రంథం నేటికీ అందరికీ ఆరాధ్యమైనదిగా నిలిచిపోయింది.

మహాభారతం- మనకు ఏ పనులు బాధ కలిగిస్తాయో అలాంటి పనుల్ని ఇతరుల విషయంలో చేయరాదని హితాన్ని పలికింది. పురాణాల్లోనూ సకల జీవులను హింసించరాదని, అసత్యం పలకరాదని, దొంగతనం చేయరాదని, హితం కాని దాన్ని పలకరాదని ప్రబోధించడం చూస్తుంటాం

నిజానికి మనకు అత్యంత సన్నిహితుడు ఆ పరమాత్ముడే. పూలదండలో దారం పూవులకు లోపలే ఉంటుంది. బయట ఉండదు. కాని భగవత్తత్వం ఈ చరాచర జగత్తులో లోపలా బయటా వ్యాపించి ఉంటుంది.

అందుకే సన్నిహతుడైన ఆ భగవంతుడి అనుగ్రహం పొందాలంటే మనం అందరికీ సన్నిహితుడిగా మారాలి. ఈ లోకమంతా మనదేనని భావించాలి. ఎలాంటి తారతమ్యాలూ చూపించకుండా సేవలందించాలి.

అప్పుడే ఆ పరమాత్ముడు మనకు అందుతాడు. మనం చేసే మంచి కార్యాలకు ప్రేరణ, ఉత్సాహం కలిగిస్తాడు. సహాయ సహకారాలు అందిస్తాడు. నిస్వార్థమైన మన కార్యాలకు విజయాలను ప్రసాదిస్తాడు.
                                                                            - విశ్వనాథరమ 

No comments:

Post a Comment