ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 11 July 2013

జీవనగానం


జీవితం జీవించడానికే ఉంది. జీవనకళ తెలుసుకోవాలి. ప్రయత్నిస్తున్నాం. కాని నిజమైన సుఖం, శాంతి దొరకటం లేదు. అవి లేకుండా జీవితం ఉందా? జీవనం గురించి ఆలోచించినప్పుడల్లా మరణం మన ఆలోచనల్లో కదలాడుతుంది. రెండు ధ్రువాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఎందుకిలా జరుగుతోంది?

చక్కగా జీవించడం తెలిస్తే మరణం గురించి భయపడనవసరం లేదు. ఒకవేళ మరణ రహస్యమే తెలిసిపోతే, జీవితం ఒక ఆటగా మారిపోతుంది. ఆడుతూ పాడుతూ జీవనయాత్ర సాగించడమే నిజమైన మానవుల లక్షణం.

మరణానికి భయపడనవసరం లేదు. మంచి చెయ్యలేకపోతున్నందుకు, చెడ్డ చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నందుకు, ఎంత ప్రయత్నించినా మన మనసు మన మాట వినకుండా, తప్పుదారి పట్టిస్తున్నందుకు భయపడాలి.

భగవంతుడికి భయపడనవసరం లేదు. మనల్ని అధోగతిపాలు చేస్తున్న మాయ ఆకర్షణలకు, మోహదృశ్యాలకు భయపడాలి. ప్రేమ స్వరూపుడైన దైవాన్ని నిత్యం ప్రేమపూర్వకంగా ఆరాధిస్తే భయం, మరణం రెండూ తొలగిపోతాయి. శాశ్వత జీవనంలోకి ఆహ్వానం అందుతుంది.

ఒక శిశువులాగా మనం ఉండలేకపోతున్నాం. ఆ దశ వెళ్లిపోయింది. ఆ బంగారు బాల్యం కనుమరుగైపోయింది. పూర్ణ శరణాగతితో ఈశ్వరుడి ముందు మోకరిల్లితే అహంకారం పటాపంచలైపోతుంది. అప్పుడు మళ్ళీ శిశుప్రాయమే. దేవుడి బిడ్డలమే అవుతాం.

అందుకే 'ఈ విశ్వానికి తండ్రిని నేను' అన్నాడు శ్రీకృష్ణుడు. జీవించడానికి మన శక్తియుక్తులు సరిపోకపోతే తండ్రి సహాయం కోరటంలో తప్పేముంది? లోకరక్షకుడిగా వ్యవహరిస్తున్న దేవుడు 'నేను నీకోసం ఉన్నాను' అంటే అర్థం చేసుకున్నవాళ్లు ఎంతమంది? ఆయనను తెలుసుకుని జీవితాన్ని బాగుచేసుకుని, అదృష్టాన్ని పండించుకున్నవాళ్లు ఎంతమంది?

జీవించడం మనకు ముఖ్యం. సహాయం చేస్తున్నవాడిని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఎంతోమంది రామ సహాయం అందుకున్నారు. చరితార్థులు అయ్యారు. శ్రీకృష్ణ ప్రేమను ఎంతోమంది పొందారు. ధన్యులయ్యారు.

అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. ఎంతమంది ఆయనను ఆర్తితో, ప్రేమతో అడుగుతున్నారు? మన జీవితం బాగుపడాలి. మనం సుఖంగా ఉండాలి. హాయిగా ఉండాలి. బాధలు, ప్రకృతి వైపరీత్యాలు మనల్ని ఇబ్బందులపాలు చెయ్యకూడదు.

గజేంద్రుడు మహావిష్ణువును ప్రార్థించినట్లు, ప్రహ్లాదుడు శ్రీహరిని స్తుతించినట్లు, మారుతి శ్రీరాముణ్ని గానం చేసినట్లు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చెయ్యలేకపోతున్నారు?

నాలుగు ముక్కలు తెలిస్తే గురువు, నాలుగు దిక్కులు తిరిగితే శిష్యుడు అనే వింత పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో నిజమైన ఆరాధన ఎలా కుదురుతుంది, నాణ్యమైన జీవన విధానం ఎలా లభిస్తుంది?

పరిస్థితులు ఎలా ఉన్నా నిరాశ పడకూడదు. లోకం మారిపోతున్నా మన హృదయంలో దేవుడిపై ప్రేమలో ఏ మార్పు రాకూడదు. నీరు పడితే బిగుసుకుపోయే కాంక్రీటులాగా మన నమ్మకాన్ని అచంచలంగా పెంచుకుంటూపోతే దైవం ముఖాముఖి అవుతాడు. అప్పుడు ఎందుకు మనకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు, ఎలా దైవజీవనాన్ని గడపాలి, అపరిమిత ఆనందానికి మనం ఎలా హక్కుదారులం కావాలో ఆయనే తెలియజేస్తాడు.

జీవనకళ ఎవరూ నేర్పరు. జీవిస్తూ నేర్చుకోవాలి. ఈదుతూ ఉంటే ఈత వచ్చినట్లు, పాడుతూ ఉంటే బాగా పాడగలిగినట్లు, సాధనచేస్తూ ఉంటే ఈ జీవితం మనకు సాధ్యమవుతుంది.

జీవితం ఒక వేణువు లాంటిది. అది ఖాళీగా, శూన్యంగా ఉంటుంది. మధుర స్వరాలను అనంతంగా ఆలాపించగల సామర్థ్యం దానికి ఉంది. కానీ, అదంతా గాయకుడి నైపుణ్యం మీదే ఆధారపడి ఉంటుంది.

మనలో ప్రతి ఒక్కరూ తమ వేణువుతో దివ్యగానాలు పలికించవచ్చు. అవధుల్లేని ఆనంద పారవశ్యాన్ని పొందవచ్చు. వెంటనే మన వేణువును మనం తీసుకుందాం. గానాన్ని ఆలపించే అవకాశాన్ని చేజారిపోనివ్వకుండా చూసుకుందాం. తెరదించక ముందే మన జీవనగానాన్ని చక్కగా ఆలపిద్దాం. ఆ బృందావన విహారి మనసు కరిగిద్దాం!                                                                                                       
                                                                    - ఆనందసాయి స్వామి 

No comments:

Post a Comment