ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 29 July 2013

బతుకు బంగారం


  బంగారం! విలువైనది... ప్రపంచమంతటా చలామణీ అయ్యేది. కొందరి దృష్టిలో పవిత్రమైంది. తప్పక ధరింపదగింది! కానీ- మనం విస్తుపోయే విషయం- 'స్వర్ణం కలికి నిలయం' అని భాగవత ప్రవచనం. అంటే, బంగారం పాపాలపుట్ట అన్నమాట!
శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. కలి ప్రవేశించాడు. పరీక్షిత్తు కలి ఆట కట్టించడానికి బయలుదేరి సరస్వతీ నదీతీరానికి వచ్చాడు. అక్కడ ఒక ఎద్దూ ఆవూ మాట్లాడుకోవడం విన్నాడు. గోమాతను వృషభం అడిగింది- 'ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కన్నబిడ్డలు నిన్ను విడిచి వెళ్లారనా? రాజులు అధర్మంగా పరిపాలిస్తున్నారనా? రాక్షసులు విజృంభించారనా? లోకంలో ఉత్పాతాలు సంభవిస్తున్నాయనా? మనుషులు ఆత్మతత్వాన్ని అవతలపెట్టారనా? లేక... నేను మూడు కాళ్లు పోగొట్టుకొని ఒంటికాలిపై నిలబడాల్సి వచ్చిందనా?'- అని. ఆ గోమాత ఎవరో కాదు, భూమాత! ప్రశ్నలడిగిన వృషభం ధర్మదేవత.

గోమాత బదులు పలికింది. 'లోగడ నీవు నాలుగు కాళ్లతో నడిచేదానివి. కలి ప్రవేశించాడు. ఒంటికాలి దానివి అయ్యావు. ఇకపై ఎవరిపై ఆధారపడి జీవించాలి?'. ఇంతలో ఒక పురుషుడు కర్రతో గోమాతను కొట్టాడు. ఎద్దును కాలితో తన్నాడు. ఈ అమానుష కృత్యం చూసిన పరీక్షిత్తుకు కోపం వచ్చింది. 'ఓ వృషభరాజా! దుఃఖించ వద్దు. ఈ దుర్మార్గుణ్ని చంపుతాను. నిన్ను నాలుగు పాదాలతో తిరిగి నడిపిస్తాను. ఓ గోమాతా! శ్రీకృష్ణుడు లేడని కుంగిపోవద్దు. నేనున్నాను. దుష్టశిక్షణకు శిష్టరక్షణకు రాజుల్ని బ్రహ్మ సృష్టించాడు. సాధుజీవుల్ని బాధించేవారిని శిక్షించని రాజు ఆయుష్షూ, సంపదా నశిస్తాయి!'. పరీక్షిత్తు పలుకులు విని వృషభం ఇలా అన్నది- 'రాజా! మావల్ల మానవులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇందాక మా కన్నీటికి కారణం అడిగావు. మన సుఖదుఃఖాలకు కారణం మనమే అని నాస్తికులు పేర్కొంటారు. ధర్మమే మూలకారణం అని మీమాంసకులు పలుకుతారు. జ్యోతిష్కులు గ్రహాలే కారణం అని గట్టిగా వాదిస్తారు. స్వభావమే కారణం అని లోకాయితికులు అభిప్రాయపడతారు. ఇందులో ఏది నిజమో తేల్చగలవా?'

'ప్రతిదీ పరమేశ్వరాధీనం!' అని వృషభం మాటలను బట్టి పరీక్షిత్తు గ్రహించాడు- తన ఎదుట ఉన్నది సాక్షాత్తు ధర్మదేవత అని నిశ్చయించుకున్నాడు. 'ఓ ధర్మదేవతా! నీకు నమస్కారం. నీకు తపస్సు, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలుండేవి. కృతయుగంలో 'గర్వం' అనే దుష్టశక్తివల్ల నీకు తపస్సు అనే ఒక పాదం పోయింది. త్రేతాయుగంలో 'సంగరూప అధర్మం'వల్ల 'శౌచం' అనే పాదం పోయింది. ద్వాపర యుగాంతంలో 'మదం' కారణంగా 'దయ' అనే పాదం పోయింది. ఇప్పుడు కలి ప్రవేశించాడు. అసత్యప్రచారం వల్ల 'సత్యం' అనే నీకున్న ఆ ఒక్క పాదాన్నే లేకుండా చేస్తాడు. ఈ గోమాత భూదేవి అని గ్రహించాను. శ్రీకృష్ణుడి పవిత్ర పాదస్పర్శతో పునీతమైన తన శరీరం దుర్మార్గుల పాదతాడనానికి గురికావాల్సి వచ్చిందే అని ఈ తల్లి శోకిస్తున్నది. మిమ్మల్ని కొడుతున్న ఈ పురుషుడే కలి. వీడినిప్పుడే అంతం చేస్తాను!' అని పరీక్షిత్తు కత్తి ఎత్తాడు. కలిపురుషుడు 'శరణు శరణు' అన్నాడు. 'శరణు అన్నవారిని రాజులు చంపకూడదు. కానీ, నీకు ఇక్కడ స్థానం లేదు. అసత్యం, చోరత్వం, కలహం, మొదలైన చెడులన్నీ నిన్ను ఆధారం చేసుకొని వ్యాపిస్తాయి. వెళ్లిపో!' అని పరీక్షిత్తు ఆగ్రహంతో పలికాడు. 'రాజా! ఎక్కడికని పోను? దయతో ఏదైనా దారి చూపించు' అని కలి ప్రార్థించాడు. 'ఓ కలీ! నీవు హింస, వెలది, జూదం, మద్యపానం అనే స్థానాల్లో నివసించు!' అన్నాడు పరీక్షిత్తు. 'రాజా! ఈ నాలుగూ కలిసిన ఒకేచోటు అనుగ్రహించు!' అని దీనంగా పలికాడు కలి. 'అయితే స్వర్ణమే నీకు తగిన చోటు!' అని కలిని పరీక్షిత్తు అనుగ్రహించాడు. దయ, తపస్సు, శౌచం అనే మూడు పాదాలూ వృషభరూపంలో ఉన్న ధర్మదేవతకు తిరిగి వచ్చాయి. గోరూపంలో ఉన్న భూదేవి సంతోషించింది. కలి కూడా బంగారంలో కలిసిపోయి కులుకుతున్నాడు. అటువంటి బంగారాన్ని రక్షించుకోవడానికే మనుషులు నానాపాట్లు పడుతుంటారు. బంగారం పంపకాల వల్ల మమతలు మాయమవుతున్నాయి. సమాజంలో సంపదకున్న విలువ సత్యానికి లేదు. దయకు లేనేలేదు. కలి అన్నింటినీ బలి తీసుకున్నాడు. స్వర్ణాభరణాలు దేవతా విగ్రహాలను కప్పివేస్తున్నాయి. అసలు రూపదర్శనం అపూర్వమయ్యే స్థితి దాపురించింది. ఇది కలిమహిమకాక మరేమిటి?
బతుకు, బంగారం- ఈ రెంటినీ న్యాయదేవత త్రాసులో పెడితే? బతుకువైపే తప్పక ముల్లు చూపుతుంది. మనకు బతుకు బంగారం లాగా ఉండాలేగాని, బంగారమే బతుకు కాదు!
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment