ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 28 July 2013

ఆషాఢ బోనాలు

 మైక్య జీవన సౌందర్యానికి ప్రతిబింబాలు- పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలు, జాతరలు, వేడుకలు. పేరేదైనా సరే, సామూహిక భక్తి చైతన్యం, సమష్టితత్వం, సామాజిక ఐక్యత ఈ సంబరాల్లో ప్రకటితమవుతాయి. సమస్త ప్రకృతినీ దైవస్వరూపంగా, దివ్యశక్తిగా ఆరాధన చేసే సనాతన సంప్రదాయం మనది. ప్రకృతి శక్తి అయిన జగన్మాతను మంత్రతంత్రాలతో, యజ్ఞయాగాదులతో అర్చించే విధానమే కాక, నిష్కల్మష భక్తితో, తమకు తెలిసిన పద్ధతిలో, తమకు అనుకూలమైన రీతిలో అమ్మను ఆరాధించే సంస్కృతి కూడా అమలులో ఉంది. జీవవైవిధ్యానికి ప్రతిఫలంగానే ప్రకృతి మాతను కొలుచుకుని, అనుగ్రహాన్ని పొందడానికి ఈ వెసులుబాటును, అందుబాటును మనం పొందగలిగాం. ఆ పరంపరలోనిదే తెలంగాణ ప్రాంతంలో నిర్వహించుకునే బోనాల సంబరం. ఆషాఢ బోనాలు, ఆషాఢ జాతరగా వ్యవహరించే ఈ సంరంభానికి జానపదుల సంస్కృతీ సంప్రదాయాలే ఆలంబన.

దైవశక్తి ఏ కొందరిదో కాదు, అందరిదీ అనే భావన జానపదుల వేడుకల్లో పరిఢవిల్లుతుంది. తమ జీవనశైలిని సమ్మిళితం చేసి దేవతల్ని ఆరాధించే ఉదాత్త వైఖరి బోనాల సంబరంలో వెల్లివిరుస్తుంది. ప్రకృతిశక్తి విభిన్న కళలే గ్రామదేవతలని దేవీభాగవతం చెబుతోంది. వీరి శుభదీవెన వల్లే గ్రామాల్లో ఎలాంటి ఉపద్రవాలు, అరిష్టాలు కలగకుండా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని ప్రతీతి. వర్షాలకు నెలవైన ఆషాఢమాసం ప్రకృతిపరంగా ఎన్నో మార్పులకు నేపథ్యం వహిస్తుంది. ఎన్నో రోగకారక పరిస్థితులున్న ఈ తరుణంలో అన్ని అవరోధాల్నీ, అనారోగ్యకర వాతావరణాన్ని అధిగమించాలంటే గ్రామదేవతల ఆరాధనే మార్గమని జానపదుల నమ్మకం. పోచమ్మ, ఎల్లమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ వంటి గ్రామదేవతల స్వరూపాలు వైదిక సంస్కృతినుంచి విస్తరిల్లినవే! గ్రామం ఎల్లల్లో ఉండే అమ్మ (ఎల్లమ్మ), చిత్తశాంతిని కలిగించే అమ్మ (చిత్తారమ్మ), నూకలు అనగా ఆహారాన్ని అందించే అమ్మ (నూకాలమ్మ), ముక్తిని ఇచ్చే అమ్మ (ముత్యాలమ్మ), ఎల్లరూ కొలిచే అమ్మ (ఎల్లారమ్మ), భక్తుల్ని బ్రోచే అమ్మ (పోచమ్మ), చింతల్ని నివారించే అమ్మ (చింతాలమ్మ)... ఇలా జానపదులు తమ పలుకుబడులకు అనువుగా అమ్మ ఇచ్చే అనుగ్రహాన్ని బట్టి, వారికి పేర్లను ఏర్పాటుచేసుకుని పూజలు నిర్వహిస్తారు. నైవేద్యాల్ని సమర్పిస్తారు. ఆషాఢమాసంలో జానపదులు తమ నివాస ప్రాంత పరిసరాల్లో ఉండే గ్రామదేవతలకు ప్రత్యేకంగా బోనాలు (అన్న పదార్థాలు) సమర్పణ చేస్తారు. పదిహేనో శతాబ్దం నుంచి ఈ సంప్రదాయం పరివ్యాప్తిలో ఉంది. భాగ్యనగరంలో కులీ కుతుబ్‌షాహీల కాలంలో ఈ సంప్రదాయం విశేషంగా పరిఢవిల్లింది. నేటికీ ఈ సంవిధానం ఓ మహత్తర వేడుకగా, లక్షలాది భక్తులు పాల్గొనే ఉత్సాహపూరిత సంరంభంగా ఆకట్టుకుంటోంది. చరిత్రాత్మకమైన గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ఆషాఢంలో మొదటి బోనాల వేడుక ఆరంభమవుతుంది. ఘటం ఎదుర్కోళ్లతో సంబరాలకు శ్రీకారం చుడతారు. వ్యాధి నిరోధకశక్తిని పెంచే, క్రిమికీటకాదుల్ని నివారింపజేసే పసుపు కలిపిన నీరు వేపకొమ్మలతో చిలకరిస్తూ అమ్మతల్లి ఆలయాలకు భక్తులు బయలుదేరతారు. తమ మొక్కుబడుల్ని అనుసరించి అన్న పదార్థాల్ని బోనపు ఘటాల్లో అమర్చి నివేదన చేస్తారు.

సాకబెట్టుట (పసుపు జలంతో అభిషేకం), ఫలహారపు బండ్లు (ఆహార పదార్థాల తరలింపు), గావుపట్టుట (సొర, గుమ్మడికాయలతో అమ్మవారికి దృష్టిదోషాన్ని నివారించడం), రంగం (భవిష్యవాణి వివరించడం) వంటి ప్రక్రియలతో ఈ బోనాల వేడుక భక్తుల కోలాహలం, ఆనందాల మధ్య వర్ధిల్లుతుంది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలోని బోనాల సందడితో ఈ ఉత్సవ శోభ పతాకస్థాయిని చేరుకుంటుంది. ఆషాఢంలోని ఆదివారాల్లో ఆర్భాటంగా ఈ జాతర కొనసాగుతుంది. లాల్‌దర్వాజ అక్కన్న మాదన్న గుడిలో భక్తులు తుది బోనాల్ని సమర్పించడంతో జాతర సుసంపన్నమవుతుంది.

ఆషాఢంలో శక్తిదేవతల్ని పలు ప్రాంతాల్లో, వివిధ రీతుల్లో అర్చిస్తారు. ఉపాహారాల పేరుతో ఇళ్లల్లో ఆహార పదార్థాల్ని నివేదన చేస్తారు. కొలుపులు, సందళ్లు పేరిట జాతరలు జరుపుతారు. జీవకోటికి ఆధారమైంది- అన్నం. జీవోత్పత్తి, దేహనిర్మాణం, పోషణలు అన్నంవల్లే జరుగుతున్నాయని గీతాచార్యుడి వచనం. భోజనానికి ప్రతిరూపమైన బోనాన్ని స్వీకరించి, సూక్ష్మరూపులైన దేవతాశక్తులు కూడా సంతృప్తి చెందుతాయంటారు. యజ్ఞద్రవ్యమైన అన్నాన్ని సమర్పించడం వల్ల ప్రకృతి శక్తులు ఆనందిస్తాయని పెద్దల మాట. వర్షం, పాడిపంటలు వంటివి ప్రకృతివల్లే మనకు అందుతున్నాయి. 'నీ అనుగ్రహం వల్ల మాకు దక్కినదాన్ని, తిరిగి నీకే నివేదన చేస్తున్నాం, మమ్మల్ని తరింపజేయి' అని ప్రకృతిని వేడుకోవడమే బోనాల సమర్పణలోని అసలైన అంతరార్థం.
                                                           - డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

No comments:

Post a Comment