ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 10 July 2013

మూడు రథాల విశిష్టయాత్ర


   ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురీ జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతిలో ఒక 'అద్భుతం' అని వర్ణించవలసినదే. పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పురీ క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు. జ్ఞానేంద్రియ స్థానమైన వదనమే, ప్రధానంగా కలిగిన విశిష్ట సౌందర్యవంతమైన జగన్నాథ బలభద్ర సుభద్రల దారు విగ్రహాలు మరే క్షేత్రంలోనూ కానరాని లావణ్యాలు.
విభిన్న కళారీతిలో అద్వితీయ వాస్తుశిల్పంతో నిర్మితమైన భవ్యమందిరం జగన్నాథాలయం. ప్రతి ఆలయంలోనూ రథోత్సవాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడి రథాలు, ఉత్సవం పూర్తిగా విభిన్నం. మహోత్సాహంతో జనవాహిని పాల్గొనే యాత్ర కూడా ప్రపంచపు వింత వేడుకే.

వాసుదేవుని జగన్నాథమూర్తి, సంకర్షణ స్వరూపమైన బలభద్రుడి విగ్రహం, శక్తితత్వమైన సుభద్రా దారురూపం- మూడు రథాలపై భక్తులను అనుగ్రహించేందుకు వూరేగే దివ్య దృశ్యం అపురూపమైన అనుభూతిని ప్రసాదిస్తుంది. జగన్నాథుడి చెంత సుదర్శనమూర్తి విష్ణురక్షను కలిగించేదిగా శాస్త్రం వర్ణిస్తోంది.

మూడు రథాలను ప్రతి ఏడాదీ నూతనంగా నిర్మిస్తూనే ఉంటారు. ఇవి కూడా దారురథాలే. వీటి నిర్మాణంలోనూ ఎన్నో ఆగమశాస్త్ర నియమాలను అనుసరిస్తారు.

జగన్నాథుడి రథం- 'నందిఘోష'. దీనికి గరుడధ్వజ, కపిధ్వజ- అనే నామాంతరాలున్నాయి. ఇది సుమారు నలభై అయిదు అడుగుల ఎత్తుతోనూ, అంతే విస్తీర్ణంతోనూ ఉండే బృహద్రథం. ఒక్కొక్కటి ఏడడుగుల వ్యాసంతో ఉన్న పదహారు చక్రాలు అమర్చిన రథమిది. ఎరుపు, పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. గరుడుని రక్షణలో ఉన్న ఈ రథానికి సారథి- 'దారకుడు'. ధ్వజం పేరు 'త్రైలోక్యమోహిని'. అశ్వాల పేర్లు- శంఖ, వలాహక, శ్వేత, హరిదశ్వ. శంఖుచూడుడనే నాగదేవత దీని పగ్గాలకు అధిదేవత. ఈ రథాన్ని అధిష్ఠించి ఉండే దేవతలు- వరాహ, గోవర్ధన, గోపీకృష్ణ, నృసింహ, రామ, నారాయణ, త్రివిక్రమ, హనుమ, రుద్ర (తొమ్మిదిమంది).

బలభద్రుడి రథం పేరు 'తాళధ్వజ'. ఇది సుమారు నలభై నాలుగడుగుల ఎత్తయిన రథం. పద్నాలుగు చక్రాలు అమర్చి ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చటి వస్త్రాలతో అలంకరిస్తారు. వసుదేవుడు రక్షకుడు. సారథి పేరు- మాతలి. గుర్రాల పేర్లు- తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనవ. పగ్గాలను అధిష్ఠించే నాగదేవత- వాసుకి. అధిష్ఠించి ఉండే తొమ్మిది దేవతలు- గణేశ, కార్తికేయ, సర్వమంగళ, ప్రలంబరి, హతాయుధ, మృత్యుంజయ, నతాంవర, ముక్తేశ్వర, శేషదేవ.

సుభద్రాదేవి రథం- దర్పదళన. దీనికి పద్మధ్వజ, దేవదళన అనే పేర్లు కూడా ఉన్నాయి. పన్నెండు చక్రాలమర్చిన ఈ రథం సుమారు నలభైరెండు అడుగుల ఎత్తయినది. ఎరుపు, నలుపు వస్త్రాలతో అలంకృతమైనది. జయదుర్గాదేవత- రథ రక్షకురాలు. సారథి పేరు అర్జునుడు. ధ్వజం పేరు 'నాదాంబిక'. అశ్వాల పేర్లు- రోచిక, మోచిక, జిత, అపరాజిత. పగ్గాలకు అధిదేవత 'స్వర్ణచూడ' అనే నాగదేవత. అధిష్ఠించిన తొమ్మిది దేవతలు- చండి, చాముండి, ఉగ్రతార, వనదుర్గ, శూలిదుర్గ, వారాహి, శ్యామాకాళి, మంగళ, విమల.

ఈ రథాలను అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) నాడు నిర్మించేందుకు సిద్ధమవుతారు. ఆ రోజున 'చందన యాత్ర' ఉత్సవం జరుగుతుంది. జ్యేష్ఠపూర్ణిమనాడు 'స్నానయాత్ర' మహోత్సవం. విగ్రహాలను స్వర్ణకూప జలాలను నూట ఎనిమిది కలశాలతో స్నానం చేయించి రెండు వారాలపాటు దర్శనీయం కాకుండా వేరే గదిలో ఉంచుతారు. చక్కని వర్ణాలతో చిత్రితమై, అలంకృతమైన మూర్తులను 'రథయాత్ర' నాడు ప్రజలు దర్శించవచ్చు. 'బొడొదండొ' అని ఉత్కళ భాషలో వ్యవహరించే ప్రధాన విశాల రాజమార్గాన ఈ మూడు రథాలు, ప్రజలు తాళ్లుపట్టుకు లాగుతుండగా, నృత్యవాద్యకీర్తనల నడుమ, దివ్యమైన సందడితో వూరేగి 'గుండిచా' మందిరానికి చేరుకుంటాయి.

ఇక్కడ నవదినోత్సవం- ఆషాడశుద్ధ దశమి వరకు జరుగుతుంది. ఈ కాలంలో వివిధ అవతారాలతో మూర్తులను అలంకరిస్తారు. ఈ యాత్రకు నవదిన యాత్ర, దశావతార యాత్ర- అని కూడా వ్యవహారం. అన్ని వర్గాల ప్రజలకు ఈ క్షేత్రంలో, ఈ యాత్రలో సమాన ప్రాధాన్యం లభిస్తుంది. భేదరహితమైన సమైక్య ఆధ్యాత్మికతకు సంకేతం ఈ భవ్యక్షేత్రం.

రథం నడిపేటప్పుడు 'డాహుక గీత' (డాహుకొబోలె) అనే ప్రాచీన గీతాలను పాడతారు. అసభ్యంగా అనిపించే ఈ గీతాల్లో కొన్ని సంకేతార్థాలున్నాయి. వీటివల్ల ఒక ప్రత్యేక శక్తి జాగృతమై ఈ మహారథాలను నడిపిస్తుందని- వీటి శాస్త్ర రహస్యవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

రథయాత్ర ఈ తిథినాడు విష్ణువుకు జరపడం శ్రేష్ఠమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రథయాత్ర ప్రేరణతో ప్రభావంతో ఎన్నో చోట్ల ప్రపంచంలో మహోత్సవాలు జరుగుతున్నాయి. ఒడిశాలోని పర్లాకిమిడి, జయపూర్‌ లాంటి ప్రాంతాల్లో పెద్దయెత్తున నిర్వహిస్తారు. ఇంకా దేశంలో అనేక ప్రాంతాల్లోనే కాక, కృష్ణచైతన్య సంస్థవారి ఆధ్వర్యంలో న్యూయార్క్‌, టొరంటో, లండన్‌, ప్యారిస్‌, సింగపూర్‌, బర్మింగ్‌హాం లాంటి అనేక చోట్ల, విదేశాల్లోనూ జగన్నాథ రథయాత్ర జరుగుతోంది.

విశ్వరథంపై అధిష్ఠించి నడిపించే విష్ణుదేవుడి లీలావైభవానికి ప్రత్యక్షరూపంగా ఈ రథయాత్రను సంభావించవచ్చు.
                                                                - సామవేదం షణ్ముఖశర్మ 

No comments:

Post a Comment