ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 13 July 2013

విజయకేతనం


   ఆధ్యాత్మిక రంగంలో ఒక అద్వితీయమైన, అద్భుతమైన అంశం ఉంది. లౌకికమైన ఏ విషయంలోనైనా, ఏ యుద్ధంలోనైనా శ్రమించి, సాధించి, విజయం పొందాక విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక రంగంలో భగవంతుడి పట్ల ఆశ, ఆర్తి ప్రారంభమైన క్షణమే మనం మన జీవిత రథంమీద విజయకేతనం ఎగురవేయవచ్చు. ఎగిరే విజయకేతనంతోనే, ఆ ఆనందంతోనే, ఆ స్ఫూర్తితోనే ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని నడుపుకోవచ్చు. ఎందుకిలా?! కేవలం ఒక ఆలోచన లేదా ఒక భావన... దానితోనే విజయం సాధించినట్లా? ప్రయత్నం, విజయం పట్ల భరోసా, మధ్యలో విరమించే ఆలోచనలు, అవరోధాలు, ఆటంకాలు... వీటి మాటేమిటి? వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి పంక్తిలో కూర్చున్నా విస్తరి నిండా మృష్టాన్న భోజనం చేయవచ్చు. భగవంతుడు 'మనవాడు', 'నావాడు' అనుకున్న క్షణమే విజయం తథ్యమైపోయినట్లే. ఎప్పుడైనాసరే ఎన్నుకున్న అంశమే మన విజయాన్ని నిర్ధారిస్తుంది. కావలసిన అవసరాలు, ఆదరువులు, సరంజామా, సామర్థ్యం... ఆయన చూసుకుంటాడు. మనం పంక్తిలో కూర్చుంటే చాలు. ప్రయత్నంలో ఉంటే చాలు.

నిజమే... ఆధ్యాత్మిక ప్రయాణం ఒక యుద్ధమే. యుద్ధానికెప్పుడూ ఓటమి భయం ఉంటుంది. మరణభయం ఉంటుంది. శత్రు సామర్థ్య భయం ఉంటుంది. అయితే మన ప్రయాణం పరమపథానికి, మన శత్రువులు మన మనోప్రాంగణంలోనివారే. ఇక మరణమా? లేనేలేదు... కేవలం అమృతత్వమే. బయటి శత్రువులతో యుద్ధం చేయవలసివస్తే శత్రువుల శక్తియుక్తులు, సైనికసామర్థ్యం వ్యూహ రచనా రహస్యాలు... మనకు పూర్తిగా తెలిసే అవకాశం లేదు. ఆధ్యాత్మిక యుద్ధంలో శత్రువులు మన మనో ప్రాంగణంలోనివారే. మనలోని వారే. ముఖ్యంగా మనం సృష్టించుకున్నవారే. అయినా సరే... ఓడించటం కష్టం. అయినా సరే.. ఓడించే అవకాశం ఉంది. ఓడించి తీరాల్సిన అవసరమూ ఉంది. ఎవరువారు? కామక్రోధ లోభమోహమదమాత్సర్యాలు... అరిషడ్వర్గాలు. మహా బలీయమైనవారు. మనకు అర్థం కావాలిగానీ అంతకంటే బలమైన మనసు మన వశంలో ఉంది. అలాగే... అది అదుపుతప్పే ప్రమాదమూ ఉంది. దానికంటే బలమైన అరిషడ్వర్గ గజాలను అదుపుచేయగల అంకుశం లాంటి బుద్ధీ ఉంది. బుద్ధి ఆసరాతో అరిషడ్వర్గాలను అదుపుచేసి సాధనాపథంలో ప్రయాణం సాగించాలి. మరి ఓటమి సంగతి? ఎన్నెన్నో అననుకూల అవరోధాలను అధిగమించి ఓటమిని జయించే మనిషి, కృష్ణుడే హితుడై, స్నేహితుడై, సారథి అయిన అర్జునుడు... ఓటమి పొందుతాడా? ఆధ్యాత్మిక పోరాటంలో ఓటమే లేదు. విజయకేతనం పట్టుకునే విజయంవైపు నడిచే అవకాశం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో, పోరాటంలో మాత్రమే ఉంది. ఇక ఈ యుద్ధంలో మరణభయం లేదు. గెలిచేవాడికి మరణమెక్కడిది? గెలుపే అమృతత్వమైనప్పుడు, ఓటమిలేని యుద్ధం ప్రసాదించేది అమృతత్వమే కదా!

ఈ యుద్ధానికి, పోరాటానికి- పెట్టుబడి? ధనం, బలం, కాలపరిమితి... వీటితో అవసరమే లేదు. కావలసిందల్లా పరమాత్మపట్ల ప్రేమ. తీవ్రమైన ఆర్తి. వీటికి కావలసిన చిత్తశుద్ధి. నిర్మలత్వం. పవిత్రత. ఇంకా ఇలాంటివి. ఇవి మనం ఏ పెట్టుబడీ లేకుండా సాధించుకోవచ్చు. ఎప్పుడు? నిజమైన భగవత్‌ ప్రేమ ఉన్నప్పుడు. అంటే- పరమపద ప్రయాణానికైతేనేమి, పోరాటానికైతేనేమి... కావలసింది భగవంతుడి పట్ల పరమ ప్రేమ. మనలోని ఆ ప్రేమే మన విజయకేతనం. ఎగరేద్దాం.
- చక్కిలం విజయలక్ష్మి 

No comments:

Post a Comment