ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 21 July 2013

దేవుడు మనవాడు ఏ పద్ధతైనా, విధానమైనా, మార్గమైనా- మనం ఎందుకు తెలుసుకోవాలి? అందులో ఉన్న ప్రయోజనాన్ని పొంది మన జీవితం ఇంకా సుఖంగా గడపడానికి. తెలుసుకుంటున్న కొద్దీ బతకడం సులువు కావాలి. అన్నీ తెలుసుకుంటున్నవాడికి ఇంకా ఏదో మిగిలి ఉంది తెలుసుకోవడానికి అనిపిస్తుంది. అజ్ఞానానికి అంతం ఉంది. జ్ఞానానికి అంతం లేదు. జ్ఞానం అనంతం బ్రహ్మ. దైవరూపంలో మనం తెలుసుకునేది జ్ఞానాన్నే. జ్ఞానానికి రూపం ఉండదు. విగ్రహానికి రూపం ఉంటుంది. నామం ఉంటుంది. అదే భగవంతుడు అనుకుంటారు చాలామంది. అక్కడ మన భావం దివ్యంగా పవిత్రంగా ఉంటే దైవమవుతుంది. లేదంటే రాతి బొమ్మ.

దైవాన్ని తెలుసుకుని జీవించేవాళ్లు ఎలా ఉంటారు? మనలాగే ఒక నోరు, రెండు కళ్లు, రెండు చెవులు, ఒక ముక్కు, ఒక తలతోనే ఉంటారా? ఇంకా ఏమైనా మార్పులు వస్తాయా? భౌతికంగా ఏ మార్పులూ ఉండవు. అహంకారాన్ని పోగొట్టుకుంటారు. అరిషడ్వర్గాలను పోగొట్టుకుంటారు. 'నేను'ని వదిలించుకుంటారు. సహజంగా ఉంటారు. సాత్వికంగా ఉంటారు. ప్రేమగా ఉంటారు. నిరాడంబరంగా ఉంటారు. ఉండీ లేనట్లుగా ఉంటారు. తామరాకు మీద నీటిబొట్టు చందాన జీవిస్తుంటారు.

దైవాన్ని చూసినవాళ్లు వరసలో చివరన నిలబడతారు. ఎవరికీ పోటీగా ఉండరు. ఇస్తే అతి తక్కువగా పుచ్చుకొంటారు. ఇవ్వకపోతే అడగరు. అకారణంగా తిట్టినా ఆవేశానికి లోనుకారు. ఆవేశం వచ్చినా అది నాది కాదు అన్నట్లు చూస్తారు. సినిమాహాల్లో కూర్చుని సినిమా చూస్తున్నవాళ్లు ప్రభావితం అవుతున్నట్లు ఉద్వేగానికి, ఆందోళనకు గురికారు. తామే సినిమా తీస్తున్నవారిలా నిశ్చలంగా ఉంటారు. వారికిచ్చిన పనిని వారు ధర్మబద్ధంగా వృత్తిధర్మంగా సాక్షీభూత దృష్టితో చేస్తుంటారు. హరిశ్చంద్రుడు కాటికాపరి వృత్తి చేసినట్లు.

దైవం గురించి తెలియనివాళ్లు, బాహ్యాడంబరాలు, పటాటోపాల గురించి బాగా తెలిసినవాళ్లు, తాము సర్వజ్ఞులం అనుకున్నవాళ్లు లోకాన్ని పక్కదోవ పట్టించేస్తుంటారు. తప్పుడు బోధలు చేసే ఉపాధ్యాయుడి కంటే అసలు ఏ బోధా చేయని ఉపాధ్యాయుడు మంచివాడు. అదృష్టవశాత్తు పరిణామ క్రమంలో కొంతమందికి ఆధ్యాత్మిక పదవులు వస్తాయి. వాటితో భగవంతుడి సామీప్యాన్ని పొందాలి. లేకపోతే మంచి చేద్దామనుకుని చెడుచేసేవాళ్లలాగ దైవానికి దూరమైపోతాం.

తవ్వుతున్న కొద్దీ, తోడుతున్న కొద్దీ నీరు వూరుతున్నట్లు మంచి విషయాలు తప్పక మనల్ని చుట్టుముడతాయి. దైవీజ్ఞానం వ్యక్తి వికాసానికి, సంఘ వికాసానికి, వ్యవస్థ వికాసానికి తప్పక ప్రయోజనకారి అవుతుంది. లేకపోతే యుగయుగాలుగా ఈ జ్ఞానాన్వేషణ ఎందుకు?

వైద్యుడు కనిపించినట్లు, న్యాయవాది కనిపించినట్లు, సాంకేతిక నిపుణుడు కనిపించినట్లు- దైవం కనిపించడానికి ఒక రూపాన్ని పెట్టుకోడు. మనమే చూడాలి. ఏ రూపంలోనైనా చూడొచ్చు. చూసినప్పుడు మన హృదయంలో దైవభావం ఉండాలి. మనసంతా నిండాలి.

ఈ రోజుల్లో నిర్వచనాలు మారిపోతున్నాయి. మాటలకు విపరీత అర్థాలు వెదుకుతున్నారు. భావాలను చక్కగా ఎవరికి తగినట్లు వాళ్లు అన్వయించుకుంటున్నారు. దైవసేవలు అయిదు నక్షత్రాల హోటల్లో భోజన పదార్థాల ఖరీదులను మించిపోతున్నాయి. సామాన్యుడికి దేవుడు దొరకడు. దేవుడు సామాన్యుడు కాడు. ఏ మార్గంలోనైనా సంపాదించు. ఎవరినైనా వంచించు. ధనం సంపాదించు. నోట్లకట్టలు పట్టుకు రా. అప్పుడే దేవుడు నీ దగ్గరకు వస్తాడు అంటున్నారు. అతడు దేవుడా, వాళ్లు దైవ సేవకులా?

దేవుడు మనవాడు. మనలోనివాడు. అందరివాడు. అతడు ఇంట్లో ఉంటాడు. ఒంట్లో ఉంటాడు. వసంతకాలంలో పచ్చదనంకోసం వెదుక్కోవాలా? సూర్యోదయం అయిన తరవాత వెలుగు ఎక్కడుంది అని ఎవరైనా అడుగుతారా? మట్టి లేని భూమి ఉందా? నరుణ్ని విడిచి నారాయణుడు ఉండగలడా? సరిగ్గా ఆలోచిస్తే- దేవుణ్ని మనం చూస్తున్నామా, దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఎవరి దర్శనం ఎవరికి కావాలి?- ఆనందసాయి స్వామి 

No comments:

Post a Comment