ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 20 July 2013

విశ్వలీల‌..

                                 
 
విశ్వం భగవత్‌ సంకల్పంవల్లనే ప్రభవించింది. భగవంతుడు ప్రతి మనిషిలోనూ స్పందిస్తున్నాడు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసమే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. తన సంకల్పం ప్రకారం సృష్టి పురోగమించేటట్లు ఆయన సకల చర్యలు తీసుకుంటున్నాడు. సర్వలోకాలను సృష్టించిన పిమ్మట భగవంతుడు ఆ లోకాల్లోకి ప్రవేశించినట్లు ప్రాచీన వేదం చెబుతోంది. విశ్వంలోకి ప్రవేశించి విశ్వమంతటా పరివ్యాప్తమై ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగే మనకు నక్షత్రాలుగా మిణుకుమంటోంది. ఆ వెలుగే సముద్రాల్లో నీలంగా భాసిస్తోంది. ఆ వెలుగు చిన్నగుండెగా మారి ప్రతి జీవిలో కొట్టుకుంటోంది. ఆ వెలుగు మన వూపిరి. ఆ వెలుగు ఆగిపోతే మన వూపిరి ఆగిపోతుంది.

జీవితంలో ప్రతి కదలికకు అర్థం ఉంది. మనకే కాదు భగవంతుడికి సైతం అందులో పరమార్థం కనిపిస్తుంది. సృష్టి అంతా కూడా ఆయన కదలిక. సంభూతి. ఆయన వైభవం. మనమే అన్ని పనులు చేస్తున్నట్లు, మన కోరికలను తీర్చుకుంటున్నట్లు, ఆకర్షణ లేనివాటిని తిరస్కరిస్తున్నట్లు అనుకుంటుంటాం. మనపై భగవంతుడు బలవంతంగా దుఃఖాలను ఎందుకు రుద్దుతున్నాడో తెలియదు. 'తన స్వర్గంలో భగవంతుడికేం హాయిగా ఉన్నాడు. భూమిపై జరిగే ఘోరాలను, నేరాలను పట్టించుకోడు. ఈ దుఃఖాగ్ని గుండంలో మనల్ని పడవేసి కాల్చుకు తింటున్నాడు' అని నిందిస్తాం. 'జీవితం ఎలా ఉంటే అలాగే అనుభవించాలి. వివరాల జోలికి వెళ్లవద్దు' అని మరికొందరి సిద్ధాంతం. కాని భగవంతుడు మానవాళి శ్రేయాన్నే మనసులో పెట్టుకుని వేల మార్గాల్లో ఆలోచిస్తుంటాడు. సాధారణ మానవులం- 'భగవంతుడికి అనేక ఇతర పనులుంటాయి. మన సంగతి అసలు పట్టించుకోడు' అని, 'మనం చీమల్లాగా కనిపిస్తాం, అసలు మనవైపు చూడనే చూడడు' అని వాపోతుంటాం.

ఇది తప్పుడు భావన. అసంఖ్యాక జన్మల్లో, తన జీవన పరమావధిని నెరవేర్చుకోవడానికి ప్రతి జీవిలోను సత్య బీజం నిక్షిప్తమై ఉంటుందంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రతి చిన్న కదలికకు ఒక విశిష్టత ఉంటుంది. ఈ ప్రపంచంలో, ప్రతి జీవిలో ఒక మేధస్సు పనిచేస్తుంటుంది. ప్రతి ఆలోచనను, ప్రతి సంవేదనను, ప్రతి ప్రేరణను, ప్రతి చర్యను గుర్తించి ఆత్మకు నివేదిస్తుంది.

మనకు తెలిసినా తెలియకపోయినా పరిణమిస్తున్న ప్రతి జీవిలోని చైతన్య వికాసమే తన జీవితం. తన వెనక భగవత్సంకల్పం ఏమిటో తెలుసుకోవడానికి ఆత్మ శ్రమిస్తుంటుంది. దీన్నిబట్టిచూస్తే, ప్రపంచంలో జరిగే ప్రతి పనినీ భగవంతుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఏం చేసుకుంటారో అది చేసుకోండి- అని భగవంతుడు విధి అనే దీర్ఘపాశాన్ని మనపైకి విసిరివేయలేదు. ప్రతి జీవిలోనూ భగవంతుడు సాయుజ్యం చెందుతాడు. నిజానికి ప్రతి జీవీ భగవంతుడి జ్యోతిర్మయ కిరణ ప్రసారమే.

'పరమాత్మలో అందరూ ఉన్నారు. అందరిలోనూ ఉన్నాడు. ఆయనే అంతా' అని ఉపనిషత్‌ చెబుతుంది. పరిణామ క్రమంలో అభివ్యక్తమవుతున్న పరమాత్మ వ్యష్టిగా, సమష్టిగా ప్రతి కదలికలోని ఆనందరస ప్రవాహాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఇదొక అంతర్గత రాసలీల. కాలం నిర్మించిన అద్భుతాలను భగవంతుడు ప్రేమిస్తాడు. కాలమే సంకల్ప ప్రదీప్తమైన కదలిక. కాలంలో జరిగేదంతా భగవంతుడి కదలికే.

భగవంతుడు మానవాళి ఆశలకు, బాధలకు ప్రతిస్పందిస్తాడు. మన గాథల్ని శ్రద్ధగా వింటాడు (చెప్పగలిగితే). మన జీవితాల్లో ఆయన పాత్రను మనం మరచిపోతే అసలు ఈ లీలలోని ఆనందాన్ని మనం పోగొట్టుకున్నట్లే. ఆయన తనతో తానే నిరంతర లీల సాగిస్తున్నాడు. మనం కనుక అది తెలుసుకుంటే జీవిత ముఖచిత్రమే మారిపోతుంది. అది భగవంతుడి స్వీయ ఆవిష్కరణలో ఆనందమయ విన్యాసం!
                                                                                       
  -  కె.యజ్ఞన్న 

No comments:

Post a Comment