ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 1 June 2013

ఆనందోత్సవం



  మనిషి నిత్య సంతోషిగా జీవించాలని ఆకాంక్షిస్తాడు. కానీ, నిత్య దుఃఖితుడిగా కాలం వెళ్లబుచ్చుతుంటాడు. తన అభివృద్ధికి ఎన్నో నిచ్చెనలు సిద్ధం చేసుకుంటాడు. అన్ని నిచ్చెనలూ ఆకాశానికే వేస్తాడు! ఏ నిచ్చెనా నిలబడదు. నిరాశతో నీరసం వచ్చేస్తుంది. తన కళ్లముందే తన కంటే గొప్పవాళ్లవుతున్న వాళ్లను చూస్తుంటే ఉక్రోషం ముంచుకొచ్చేస్తుంటుంది. తన దృష్టిలో తనంత గొప్పవాడు తానే! అలాంటప్పుడు ఇతరులు తనకంటే గొప్పవాళ్లు ఎలా కాగలుగుతున్నారు? బహుశా అడ్డదారులు తొక్కుతూ ఉండొచ్చు- ఇదీ సగటు మనిషి ఆలోచనా సరళి!

సుఖాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని శరీరానికి, మనసుకు, పంచేంద్రియాలకు పంచేస్తారు. భౌతిక సుఖాలు మానసిక ఆనందాన్ని కొంతమేరకే కలిగించగలుగుతాయి. మిగిలినదంతా అసంతృప్తీ, అసంతోషమే!
మనిషి ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటాడు.

అంతరంగం అందుకు విరుద్ధంగా అలజడితో ఉంటుంది. కొరకరాని కొయ్యల్లాంటి సమస్యలు వేధిస్తూ విసిగిస్తుంటాయి. కొద్దిమంది మాత్రమే వీటి ఛాయల్ని మొహం మీద కనబడకుండా జాగ్రత్తపడతారు. మిగతావారిని ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్టే కనిపిస్తారు. ఒక పట్టాన వీళ్లను దుఃఖం వదలదు.

తాను దుఃఖంలో ఉండగా ఇతరులు ఆనందంగా ఉండరాదనే భావనతో కొందరుంటారు. ఇతరులకు దుఃఖం కలిగించే సూటిపోటి మాటలు ప్రయోగిస్తుంటారు. ఇవి కత్తుల కంటే లోతైన గాయాలు చేస్తుంటాయి. కొందరు దేవుడి ముందు ప్రమాణం చేసినంత కచ్చితంగా- ఎవరికీ ఎలాంటి ఉపకారమూ చెయ్యరు. ఎవరన్నా సాయం కోరితే, అంతకన్నా పుణ్యకార్యం ఇంకోటి లేనట్టు నమ్మబలుకుతారు. శుష్క వాగ్దానాలు చేస్తారు. చివరకు నేతిబీర సామెతను నిజం చేస్తుంటారు.

ఇలాంటివన్నీ ఆధ్యాత్మిక నేరాల కిందకు వస్తాయి.

అసత్యజీవనం గడిపే వ్యక్తులే ఇలా ప్రవర్తిస్తారు. విచిత్రమేమిటంటే, పరమభక్తులుగా వీరు చేసే నటనకు ప్రజలు దిమ్మెరపోవాల్సిందే! ఏది శూన్యమో, లేనిది ఉన్నట్టుగా చూపదలుస్తామో దానికే ప్రచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి, అలాంటి ప్రచారాలు ఆధ్యాత్మిక వ్యాపారమే తప్ప, నిజమైన ఆధ్యాత్మికత కానే కాదు.

అంతరంగాన్ని మురికితో, మలినాలతో నింపుకొని ఉన్నంతకాలం ఆనందానుభవం అసాధ్యం. అజీర్ణరోగి విందు రుచుల్ని ఆస్వాదించలేడు. చంచల స్వభావి తపస్వి కాలేడు. దురాశాపరుడు సజ్జనుడు కాలేడు. భోగి రోగి కాగలడేమోగానీ, యోగి కాలేడు.

లంగరు వేసిన పడవల్లా మనుషులు ఆధ్యాత్మిక స్రవంతిలో మమేకం కాలేక, 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' అన్నట్టు చలనం, చైతన్యం లేకుండా జీవించి, ప్రపంచం నుంచి నిష్క్రమిస్తుంటారు. మన సంకుచిత భావాలే మనసుకు సంకెళ్లు. వాటిని తెంచుకోవాలంటే, ఎవరికి వారు గట్టి ప్రయత్నం చెయ్యాలి. నాస్తికభావ ప్రభావాల నుంచీ బయటపడాలి. దైవాన్ని మనం నిర్వచించాల్సిన పనిలేదు. లక్షల సంవత్సరాలుగా ఆయన ఉనికి ప్రకటితమవుతూనే ఉంది. కళ్లు మూసుకుని వెన్నెల ఎలా ఆనందించగలం? అజ్ఞానాంధకారం మనం కల్పించుకున్నదే! జ్ఞానకళికను వెలిగించుకోగలిగితే, ఆ క్షణం నుంచి జీవితమంతా ఆనందోత్సవమే!
                                                           - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

No comments:

Post a Comment