ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday, 4 June 2013

ధర్మాచరణ


భగవంతుడు మనిషిని సృష్టించిందెందుకు? ఆకర్షణల్ని అందుబాటులో పెట్టి, వాటిని ఆస్వాదించవద్దని ఆంక్షలు విధించేందుకేనా? ఇదేనా భగవంతుడి అనంత అహేతుక ప్రేమ? ఇది ఒక పడవలో గడ్డిమోపును, మేకను, పులిని ఎక్కించి నదిని దాటమని పంపటం కాదా? సంసారసాగరం లాంటి నదిని దాటమని చిన్న పరిధిగల పడవలో ఈ పరస్పర ఆకర్షణగల ప్రాణుల్ని పంపితే ఏమవుతుంది? మేక గడ్డిని మేయదా, పులి మేకను భక్షించదా? దేవుడికి ఏమిటీ చెలగాటం!?
నిజమే. మనకు అలాగే అనిపిస్తుంది. ప్రకృతి, ఆకర్షణలు, మనిషి- ఒకే పరిధిలో విడదీయరాని సహజ సహజీవనం. ఒక జంతువు ఆకర్షించే ఆహారానికి లొంగి తినేందుకు ప్రయత్నించి సాధ్యం కాకపోతే వదిలేస్తుంది. దాని ఆశ, ప్రయత్నం అంతవరకే. కానీ మనిషి? మనసున్న మనిషి, బుద్ధి కలిగిన మనిషి, అహంకారం ఆవరించి ఉన్న మనిషి ఏం చేస్తాడు? మనిషి అహంకారం గడ్డి మేస్తుంది. ఆశతోపాటు నిరాశ, బాధ, దెబ్బతినే అహంకారం, ప్రతీకారం అతడి సొంతం. మరి రెండువైపులా పదునున్న కత్తిలాంటి మనిషిముందు వేట పెట్టి, వేటాడకూడదంటే అతడి పరిస్థితేమిటి? అసలు దేవుడి ఉద్దేశమేమిటి?

విచ్చలవిడితనం ఏ విషయంలో ఉన్నా అది కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. దేనికైనా ఒక నియతి అవసరం. ఒక నియంత్రణ అవసరం. పాలనా నిర్వహణలో ఒక ప్రణాళిక రచించగలం. ధర్మరక్షణకో ధార్మిక నియమావళి నిర్వచించగలం, అనుసరించగలం. సృష్టిచాలనకో ధార్మిక నియమావళి అవసరం. దాన్నే భగవంతుడూ అనుసరించాడు. న్యాయం, ధర్మం సర్వమానవాళికీ సమానంగా అందాలంటే, పంచాలంటే, వారు అనుసరించాలంటే- భగవంతుడికైనా ఒక శాశ్వత ప్రణాళిక అవసరమే. అదే మానవుల నుంచి ఆశించే భక్తి, మోక్షాకాంక్ష, వాటిని పెంచి పోషించే ఇంద్రియనిగ్రహం, ధర్మాచరణ, వేద విహిత జీవనం. భగవంతుడుగానీ, వేదాలుగానీ, శాస్త్రాలుగానీ అనుభవాన్నించి మానవుణ్ని వంచించలేదు. బలవంతంగా మెడలు వంచలేదు. అవి ధార్మిక పునాదుల మీద జీవన హర్మ్యాన్ని నిర్మించుకొమ్మన్నాయి. న్యాయచక్రాల మీద అనుభవ వాహనాన్ని నడుపుకొమ్మన్నాయి. తలెత్తుకుని ఆనందతీరం చేరుకొమ్మన్నాయి.

శాస్త్రీయత ఉన్నప్పుడే ఏ అంశమైనా నియమిత పద్ధతిని, పరిపూర్ణతను సంతరించుకుంటుంది. అస్తవ్యస్తత నుంచి సవ్య నిర్మాణతను, ఆచరణను అందిపుచ్చుకొంటుంది. విశృంఖలత్వం నుంచి ఒక నియమంలో, ఒక సవ్యమైన, సౌకర్యవంతమైన చట్రంలో ఇమిడ్చినప్పుడే ఒక అంశం మీద పూర్తి అవగాహన అందరికీ కలుగుతుంది. ఆచరణయోగ్యం అవుతుంది. అదే ధర్మం. ఈ క్రమంలో ఈ నియమానుసరణలో కొందరు కొన్ని కోల్పోవచ్చు. అయితే సార్వత్రిక, సామాజిక, శాశ్వత ప్రయోజనాల ముందు ఏ కొందరి ఇబ్బందో పరిగణనలోకి రాదు. ఇంద్రియాలు, వాటి వినియోగం, అనుభవమూ అయినా అంతే. ధర్మ నిరతి, నియతి అనుభవాన్ని పవిత్రం చేస్తాయి. నియమబద్ధం చేస్తాయి. దారిలో నడవవద్దని ఎవరూ చెప్పరు. దారి ఉన్నది నడిచేందుకే. కానీ... చూసుకుని వెళ్లాలి. కంటకాలుండొచ్చు. అపమార్గాన పడవచ్చు. ఆహారం తీసుకోవద్దని ఎవరూ అనరు. ఆహారం ఉన్నది తినేందుకే. కానీ... చూసుకుని తీసుకోవాలి. అపకారం చేసేది ఉండవచ్చు. అజీర్తిపాలు కావచ్చు. చేప నీటిలోనే ఉంటుంది. అయినా అనవసరంగా నీళ్లు తాగదు. పక్షికి రెక్కలున్నాయి. అయినా అదేపనిగా ఎగరదు. ఏ క్రూరమృగానికైనా పదునైన పళ్లు, గోళ్లు ఉంటాయి. అయినా ఎదురుపడిన దాన్నల్లా హింసించవు. ఏదైనా దేన్నయినా అవసరం మేరకే. జ్ఞానం లేకపోయినా వాటి జీవనసరళిని అవి అనుసరిస్తాయి. మనిషీ అలా అనుసరిస్తే రుషి అవుతాడు. (నిజానికి మనిషి పుట్టింది రుషి అయ్యేందుకే). ప్రకృతి మధ్య జీవిస్తాడు. పవిత్రతను ఆస్వాదిస్తాడు. క్రూరమృగాలతో కూడా సహజీవనం చేస్తాడు. ఆయన(రుషి) కూడా ఇంద్రియాలను వినియోగిస్తాడు- కాదు- నియోగిస్తాడు... వినియోగించడు. అప్పుడు... సద్వినియోగమైన ఇంద్రియాలు మనిషికి ఆపదలను కలిగించవు. ఆనందాన్నే ఇస్తాయి. అరిషడ్వర్గాలను ఆమడదూరంలో ఉంచుతాయి.

మనిషి కూర్మం(తాబేలు)లా జీవించాలి. ప్రమాదాల్ని పసిగట్టినప్పుడు ఇంద్రియాల్ని తాబేలులా ఉపసంహరించుకోవాలి. ఈ ప్రపంచం వైవిధ్య భరితం. ద్వంద్వమయం. విచక్షణతో మనిషి మెలగి మాధవుడయ్యే ప్రయత్నం చేయాలి... నిజాయతీతో నిబద్ధతతో.
                                                      - చక్కిలం విజయలక్ష్మి 

No comments:

Post a Comment