ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 10 June 2013

జీవన సంధ్య

                               
     ప్ర
తీ మనిషి జీవితంలో బాల్యం, కౌమార్యం, యౌవనం, వార్ధక్యం అనే నాలుగు దశలు చోటుచేసుకుంటాయి. మొదటి మూడు దశల గురించి ఏ మనిషీ ఆందోళన చెందడు. వృద్ధాప్యాన్ని మాత్రం శాపంగా భావిస్తాడు. ఆలోచించి చూస్తే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇదొక జీవన సంధ్య. ఈ వార్ధక్య దశ అందరి జీవితాల్లోను ప్రవేశిస్తుంది. తాత్వికచింతనకు, సామాజికసేవకు ఈ దశ ఎంతో అనుకూలమైనది. శాస్త్రీయ, జీవన ధర్మాలను ఆచరించడానికీ ఈ దశ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ దశలో శాంతి మార్గంలో నడవాలని రుషులు ప్రబోధించారు. వృద్ధాప్యంలో మనిషి సమస్యలనుంచి విముక్తిని ఆపేక్షిస్తాడు. ప్రశాంత జీవనవిధానం కోరుకుంటాడు. ఈ దశను ఆదర్శంగా మలచుకుంటే ఎలాంటి వాళ్లయినా పరిపూర్ణ మనశ్శాంతిని పొందుతారు.

పురాణ గ్రంథాల్లో మహా పురుషులెవరూ వృద్ధాప్యం గురించి విచారించలేదు. ఆ దశలోనే లోక కల్యాణం కోసం శ్రమించి కీర్తిని ఆర్జించారు. వాల్మీకి, వేదవ్యాసుడు వృద్ధాప్యంలోనే అజరామరమైన గ్రంథాలు రచించారు. ఉత్తములకు అన్ని దశలూ సమానమే. ఉత్తముడు ప్రతీ దశను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. జన ప్రయోజనకరమైన కార్యాలు ఆచరించి ఆదర్శమూర్తిగా పేరు గడిస్తాడు.

సాధారణంగా మనిషి వృద్ధాప్య దశ గురించి ముందుగా ఆలోచించి భయంతోను, ఆందోళనలోను నిత్యం విచారగ్రస్తుడవుతుంటాడు. దీనివల్ల మానసిక స్త్థెర్యం కోల్పోయి ముందుగానే వృద్ధుడవుతాడు. నిజానికి వృద్ధాప్యం శరీరానికే తప్ప మనసుకు కాదు. ఎలాంటివాళ్లకైనా మనసెప్పుడూ నిత్యనూతనంగా, చైతన్యవంతంగా ఉండాలి. మనసు ఆశలకు, ఆశయాలకు నిలయం. ఆ మనసును నచ్చిన వ్యాపకంవైపు, మంచి కార్యాల వైపు మళ్ళిస్తే మనిషి తన వయసును, వార్ధక్యాన్ని కూడా మరిచిపోతాడు.

ఇంక వృద్ధాప్యంలో ప్రతి మనిషీ ఓ తోడుకోసం పరితపిస్తాడు. ఒంటరితనం భరించలేకపోతాడు. ఎవరు దూరమైనా విలవిల్లాడిపోతాడు. దీనికి కారణం ఆత్మజ్ఞానం లోపించడమే. ఆధ్యాత్మిక పథంవైపు ప్రయాణించే మనిషి తన శరీరం గురించి ఏ క్షణమూ ఆలోచించడు. అంతర్ముఖుడై పరమాత్మ అన్వేషణలో నిమగ్నమవుతాడు. ఎవరు దూరమైనా చింతించడు. మానవ జన్మ సార్థకతను తెలుసుకుంటూ సన్మార్గంవైపు ప్రయాణిస్తాడు. ఆత్మవిశ్వాసం కలిగిన మనిషి వార్ధక్యంలోనూ అఖండ విజయాలు సాధిస్తాడని ఎందరో మహానుభావులు రుజువుచేశారు. ఏభైమూడో ఏట మార్గరేట్‌ థాచర్‌ బ్రిటన్‌కు తొలిమహిళా మేయర్‌గా ఎన్నికైంది. తన అరవై అయిదో ఏట విన్‌స్టన్‌ చర్చిల్‌ ప్రధానమంత్రి అయ్యాడు. హిట్లర్‌ని ఎదుర్కోగలిగాడు.

ప్రతి మనిషిలోనూ అనంతమైన శక్తి అంతర్గతంగా ఉంటుంది. దాన్ని వెలికితీయాలి. ఛార్లెస్‌ డికెన్స్‌ రచనలకు మొదట్లో ఆదరణ దక్కలేదు. అయినా అతడు నిరాశపడలేదు. ఆత్మవిశ్వాసంతో రచనా వ్యాసంగం కొనసాగించి గొప్ప రచయితగా పేరు సంపాదించాడు. థామస్‌ ఆల్వా ఎడిసన్‌కి చెందిన మిలియన్ల డాలర్ల విలువచేసే సంస్థ అగ్నికి ఆహుతి అయినప్పుడు ఆయన వయసు అరవై ఏడు. అప్పుడు ఎడిసన్‌ ఊహ ఎలా ఉందో తెలుసా! ఇక ముందు కొత్త విషయాలపై దృష్టి కేంద్రీకరించాలని భావించి ఫొటోగ్రఫీని కనుగొన్నాడు. ఎవరికైనా తన శక్తియుక్తులమీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అప్పుడు ఏ దశలోనైనా మనిషి ఉత్సాహభరితంగా ఉంటాడు. వృద్ధాప్యం గురించి ఏనాడూ ఆందోళన చెందడు. ఒక్కసారి ప్రకృతిని గమనించండి. ఎన్ని సంవత్సరాలైనా వృక్షాలు ఫలసంపదను ప్రాణికోటికి అందిస్తూనే ఉంటాయి. అలాగే పశుపక్ష్యాదులు తమ ఆహారాన్ని తామే సంపాదించుకుంటాయి.

మనిషి కూడా ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకోవాలి. వార్ధక్యాన్ని మరిచిపోయి ప్రశాంతమైన జీవన విధానం అవలంబించాలి. ఆదర్శవంతమైన కార్యాలు చేయాలి. పనిలో నిమగ్నమైన మనిషికి వార్ధక్యం గురించి ఎలాంటి ఆలోచనారాదు. అప్పుడతడు ప్రజల దృష్టిలో వృద్ధుడు కాదు. ఓ ఆదర్శపురుషుడు, ఓ అమృతమూర్తి, పరమాత్మకు నిజమైన భక్తుడు.
                                                                 - విశ్వనాథ రమ

No comments:

Post a Comment