ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 16 June 2013

అదే మనలక్ష్యం!

                                    
    
నమంతా భౌతిక వ్యక్తులం. శుద్ధభక్తిని సాధన చేస్తేకాని పారమార్థిక వ్యక్తులం కాము. భౌతిక వ్యక్తిత్వంతో పరమాత్ముని పొందడం అసాధ్యం. పారమార్థిక భక్తులపై అనుగ్రహం ప్రదర్శించేందుకే భగవంతుడు భూమిపై అవతరిస్తాడని ఉపనిషత్తులు అంటున్నాయి. సముద్రంలో అలలకు మాదిరిగా భక్తి సాధనకూ ఉత్థానపతనాలు ఉంటాయి. ఈ పుణ్యభూమిలో అవతార పురుషుల ద్వారానే భక్తి పునరుద్ధరణకు నోచుకుంటుంది. భగవంతుడు పదిమార్లు మాత్రమే అవతరించాడని మనం అనుకొంటాం. 

దైవాన్ని దశావతారాలకే పరిమితం చేయలేం. ఆకలితో అలమటించేవాడు శుద్ధ భక్తితో- 'తండ్రీ, ఈ ఆకలిని ఈ దేహానికి ఇచ్చింది నీవే. ఆకలిని నివారించేందుకు నా ప్రయత్నాలు ఈ రోజు విఫలమయ్యాయి. ఇక ఈ క్షుద్బాధ నివారణ బాధ్యత నీదే తండ్రీ' అని ప్రార్థిస్తే... ఏ మహానుభావుడి మనసులో కారుణ్యం కలిగి పట్టెడన్నం పెట్టిస్తాడో- ఆ మహానుభావుడి హృదయంలో అవతరించిన కారుణ్యమే పరమాత్మ అవతారం! కొన్నిమార్లు భగవంతుడు ఒకరికోసమే ఏదో రూపంలో అవతరిస్తాడు. రోగికి వైద్యుడు చేసే చికిత్స రూపంలో గానీ, అడవిలో దారి తప్పినవాడికి బాటసారి రూపంలోగాని, దాహార్తికి చెంబెడు నీటిరూపంలోగాని, అవతరిస్తాడు. కావలసిందల్లా విశ్వాసం. విశాలహృదయం, దృఢవిశ్వాసం ఉన్నప్పుడే ఉన్నతమైన పారమార్థిక వ్యక్తిత్వం సాధ్యపడుతుంది. కేవలం సుఖసౌకర్యాలను అనుభవించేందుకే మానవ శరీరం ఉద్దేశితమైలేదు. లౌకిక, ఆధ్యాత్మిక జ్ఞానసముపార్జన కోసమే ఈ శరీరం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే శుద్ధభక్తి. ఇలాంటి భక్తివల్ల పరమాత్మ శక్తిని అవగతం చేసుకోగలం. నారుపోసినవాడు నీరు పోయడా అని అంటారుగాని, అది చాలా తప్పు. సర్వాన్నీ... దైవాన్ని సైతం... ప్రయత్నించి సాధించుకొనేందుకే ఈ కాయాన్ని ఇచ్చాడు. శోధనలు సాధనలు చేసి మనం అన్నీ సమకూర్చుకోవాలిగాని కోరికలన్నీ తీర్చే మూర్తి గా దైవాన్ని భావించకూడదు. పరమాత్ముడు ఏనుగులకు వాటి శరీరానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చాడు. చీమలకు సైతం జ్ఞానాన్ని కల్పించాడు. మనకేం కావాలో దైవానికి తెలియదా? మనం ఇంత చిన్న విషయాన్నీ అర్థం చేసుకోవడం లేదు. రాత్రింబవళ్లు ఈ శరీర అవసరాలకోసం ఎంతగానో పరితపిస్తున్నాం. చివరికి వందల కిలోమీటర్లు ప్రయాణించి తీర్థయాత్ర చేసి మూర్తిమంతుడైన పరమాత్ముడి ముందు నిలబడి కళ్లు మూసుకొని లౌకికపరమైన కోరికలను కోరుకొంటాం.

భగవంతుడు సంపూర్ణుడు. సమగ్రుడు. ఈ దృశ్యజగత్తు కూడా సంపూర్ణమే. పరమాత్మ నుంచి ఉత్పన్నమైనవన్నీ సంపూర్ణాలే. అలా మనమూ సంపూర్ణులమే. దైవశక్తికి అంతమే లేదు. మనం దైవానికి విధేయులమై ఉంటే చాలు... మనకన్నీ సమకూరుతాయి. దైవ విధేయతకు సౌశీల్యం, బలం అవసరం. అంతర్లీనంగా ఉన్న ఈ శక్తిని ఎవరికి వారే ఆవిష్కరించుకోవాలి. అటువంటి శక్తిమంతులే దివ్యమైన ఆత్మానుభూతికి అర్హులు. మనిషి సాధన చేయాల్సిన మహామంత్రం సౌశీల్యం. ఈ గుణంవల్ల కలిగే ఆ శక్తిని భౌతిక ధనంతో సముపార్జించుకోలేం. పారమార్థిక భక్తితో ఎవరికి వారు తమంతట తామే సాధనతో వృద్ధి చేసుకోవాలి. మనిషి సహజంగా ఆనందాన్ని అన్వేషిస్తున్నాడు... దుఃఖాన్ని కాదు. మనం దుఃఖాన్ని కోరడంలేదు కదా మరి బాధలు ఎందుకు కలుగుతున్నాయి? మన జీవితంలో కొంత దుఃఖం కొంత సుఖం తప్పవు. దాన్ని మనం మార్చలేం. కనుక భౌతిక వ్యక్తిత్వం నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. ఇది మనిషి కర్తవ్యం. ఇందుకోసం శుద్ధభక్తిని సాధన చేయాలి. ఇలా చేయడంవల్ల అంతర్యామి అనుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం కలిగితే మనిషి సత్వస్థితికి చేరతాడు. ఈ ఆధ్యాత్మిక పరిణతి ప్రపంచాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఆ ఎదుగుదల మనకు ప్రేమను, మరింత ఔదార్యాన్ని అందించే శక్తిని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక దృక్పథంతో మెలగుతూ అహంకారానికి అలజడికి తావులేకుండా నిష్కామంతో కర్మల్ని ఆచరించి చూడండి... ఏం జరుగుతుంది? ఎక్కడో సుదూరంలో ఒక సూక్ష్మప్రభ గోచరిస్తుంది. ఆ వెలుగునే లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తేచాలు... ఉద్రేకం, ఉద్వేగం, కోపం, ద్వేషం, భయం, అసూయ సమస్తం మన అడుగుల కింద ఆరిపోతాయి. అప్పుడు... మనకు అతి చేరువలో కనపడే ప్రచండమైన వెలుగే దైవం! అదే మన లక్ష్యం!!
                                                     - అప్పరుసు రమాకాంతరావు 

No comments:

Post a Comment