ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 18 June 2013

మంత్రంలాంటి మాటలు


   వెలగపండుకు గుజ్జు ఎక్కువ, గింజలు తక్కువ. కొన్ని ద్రాక్షపండ్లకు గింజలే ఉండవు. అరటిపండు తొక్క తీయగానే పండు తినేయడమే. కొంతమంది వాళ్ల భాషా పటాటోప చాతుర్యంతో వూదరగొడుతూ ఉంటారు. మరి కొంతమంది వాళ్ల వాక్ప్రవాహ శక్తితో ఎదుటివాళ్ల మతి పోగొడుతూ ఉంటారు. అతి తక్కువమందే చెప్పాల్సింది సూటిగా, చక్కగా చెబుతారు.
భాషతో ఎంతగా అలంకరించినా, అందులో విషయం లేకపోతే అది తేలిపోతుంది. ఎన్ని రకాల పద విన్యాసాలు చేసినా చెప్పాల్సిన విషయం మీద స్పష్టత లేకపోతే, అది చదివిన మరుక్షణమే స్మృతిపథంనుంచి జారిపోతుంది.

ఎన్ని లొల్లాయి పదాలు పాడితే ఒక త్యాగరాజు కీర్తనకు సరి అవుతుంది? ఎన్ని కవితలు ఆశువుగా చెబితే ఒక కబీరు మహాశయుడి దోహాకు సమానమవుతుంది? శబ్దాలు శ్రవణానందకరంగా ఎంత విన్యాసాలు చేసినా, అవి ఎన్నటికైనా ఓంకారాన్ని మించగలవా?

కూర్చడం, పేర్చడం, అలంకరించడం అరువు తెచ్చుకున్న పద్ధతి. కనుగొనడం, సృష్టించడం అరుదైన పద్ధతి. ఎక్కడెక్కడి భావాలో నావికావు. చుట్టూ ఉన్న వాతావరణం నన్ను కదిలించాలి. పరిస్థితులు నన్ను మెలిపెట్టాలి. బాధలు నన్ను సాన పట్టాలి. జ్ఞానార్తి నా హృదయాన్ని తడిగుడ్డ పిండినట్లు పిండాలి. ఒక్క చుక్క రాలినా చాలు, అది మన సొంత భావమవుతుంది. పారిభాషపదకోశంలోని పదాలన్నీ వరసగా పేర్చినా అందులో మన భావం అంటూ ఒకటి లేకపోతే అది శవాలంకరణతో సమానం. అందుకే ఆదిశంకరులు 'శబ్దఝురి కీకారణ్యం చిత్త విభ్రమ కారణం' అన్నారు.

తెలియనివాళ్లు మెచ్చుకున్నారని బుడబుక్కలవాడి పాట సామవేద గానమవుతుందా? రెండూ నల్లటి పక్షులైనా కాకికి, కోయిలకు కూతలో తేడా లేదా? మహాభారతం మొత్తం చదివితే శాశ్వతంగా గుర్తుండిపోయేది ఆ పరమాత్మ ప్రసాదించిన గీతాసారాంశమే కదా? రామాయణం ఎన్నిసార్లు పారాయణ చేసినా ఒక్క రామప్రేమ తప్ప ఏది మనలను వెంటాడుతుంది? భాగవతం ఎన్నిసార్లు శ్రవణం చేసినా శ్రీహరి రక్షించిన భక్తులే కళ్లముందు మెదులుతుంటారు.

సరళంగా, సూటిగా ఉండి, అసాధారణంగా అనిపించేది 'సత్యం' ఒక్కటే. దాన్ని చెప్పాలంటే- భావనలు అందవు. చిన్ని నోరు కలిగిన చంటిపిల్లాడు పెద్ద వస్తువును నోట పెట్టుకోవాలని తాపత్రయపడినట్లు ఏదో ఒక ప్రయత్నం చెయ్యడమే. అదెంత వరకు సఫలీకృతం అవుతుందన్నది చెప్పలేం.

తెలిసినవాళ్లు చెప్పలేక చెప్పరు. తెలియనివాళ్లు ఏదో తెలిసి, చెప్పాలని చెబుతూ ఉంటారు. నిజమైన గురువు మాత్రమే దాన్ని చెప్పగలడు. అసలైన శిష్యుడు మాత్రమే దాన్ని గ్రహించగలడు. వాళ్లది హృదయ భాష. హృదయం మాట్లాడుతుందా? సత్యం మాట్లాడటానికి నోరు పనికి రాదు. హృదయం కావాలి. హృదయం నోరులేకుండా మాట్లాడుతుంది. హృదయాలతో మాట్లాడుతుంది. హృదయమే ప్రాతిపదికన జీవించేవాళ్లు భాషా పటాటోపానికి దూరంగా ఉంటారు. సహజమైన పుష్పాలు ఇచ్చే సౌరభం కృత్రిమ పుష్పాలు ఇస్తాయా? ఎంత మెరుస్తున్నా గాజుపెంకు వజ్రం అవుతుందా?

విలువిచ్చి, విలువైన విషయాన్ని సందర్భానుసారం అసాధారణంగా చెప్పాలి. అద్భుతంగా చెప్పాలి. అందంగా చెప్పాలి. అవ్యాజమైన ప్రేమతో చెప్పాలి. గంగిగోవు పాలు గరిటడైన చాలు. కడివెడైననేమి ఖరము పాలు అన్నాడు వేమన యోగి. మంత్రంలాంటి మాట ఒకటి చాలు. శక్తిని నింపుతుంది. చేవ ఇస్తుంది. అమృతమై పని చేసి మృత సంజీవిని అవుతుంది.
                                                            - ఆనంద సాయి స్వామి 

No comments:

Post a Comment