సృష్టిలో మరే ప్రాణికీ లేని విధంగా మనిషికి రెండు జీవితాలుంటాయి. భార్యాబిడ్డలు ఆస్తిపాస్తులతో కూడిన లౌకిక జీవితం, భక్తి భావ సంలీన పాత్రమైన ఆధ్యాత్మిక జీవితం. ఈ రెండింటి మధ్య సమన్వయం కుదుర్చుకోవడంలో మనిషి సామర్థ్యం దాగుంటుంది. అలా చేయలేని జీవితం అసంపూర్ణమే అవుతుంది. కనిపించేదంతా ఏనాటికైనా నశించేదే కాబట్టి శాశ్వతమైన పారమార్థిక సంపద కలవారే ధన్యులు.
లౌకిక జీవితంలో అత్యంత సంపన్నత ఏ కొద్దిమందికో ఉంటుంది. సంపన్నులై ఉండి సద్గుణాలతో ప్రకాశిస్తూ పరోపకార చింతనగల ధన్యాత్ములు అదృష్టవంతులు. తరాల తరబడి కూర్చుని తిన్నా తరగనంత సంపద గడించినవాడైనా ద్రవ్యం ఇంకా వృద్ధిచెందే మార్గమేమిటా అని ఆలోచిస్తాడు. ఎంత ధనం చేకూరాక ఇక సంపాదించే అవసరం ఉండదో తేల్చుకోలేక ఇంకా ఇంకా కావాలని మానవులు తపించడం లోక వైచిత్రి.
హైందవ ధర్మంలో ఐశ్వర్య దేవతగా శ్రీమహాలక్ష్మి పూజలందుకొంటుంది. ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అమ్మవారి కుమారులు. సకల సంపదలను ప్రసాదించగల శ్రీసూక్త మంత్రానికి రుషులు వీరే!
రాజముద్ర లేకపోతే రూపాయి నోట్లూ చిత్తు కాగితాలే సుమా?! సంపద- ధన ధాన్యరూపంలోను, ఏనుగులు, గుర్రాలు, రథాదివాహనాలు, పదవులు, అధికారంగాను అలరారుతుంది.
దాస దాసీ జనం, సేవకులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనాలు, ధనం, ధాన్యం- ఇవన్నీ అష్త్టెశ్వర్యాలుగా చెబుతారు. అష్త్టెశ్వర్యాలకు అతీతంగా ఆరోగ్యం మహాభాగ్యంగా అభివర్ణిస్తారు.
సంపద ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆనందంగా బతకవచ్చని మనిషి భ్రమపడతాడు. ఆస్తిపాస్తులను వృద్ధి చేసుకొనే ప్రయత్నంలో డస్సిపోతాడు. డబ్బు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే 'మాట'లో పాటించవలసిన మితం ధన సంపాదన విషయంలోనూ పాటించవలసి ఉంది. వివేకవంతులు మిగులు ధనంతో సేవాకార్యక్రమాలు నిర్వహించి సేవాభాగ్యం పొందుతారు. మనిషి సేవాభాగ్యానికి ఉపకరించే మరో ధనం ఆధ్యాత్మిక సంపద. అనుష్ఠానపరులు ఆధ్యాత్మిక ధనాన్ని ప్రవర్ధిల్లజేసుకోవడానికి జపధ్యానాది కర్మలు ఆచరిస్తారు.
సత్యద్రష్టలైన యోగులు ఆస్తిపాస్తులను త్యజించి అరణ్యాలకు పోయి తపోధనాన్ని ఆర్జించే ప్రయత్నం చేసేవారు. ఆధ్యాత్మిక ప్రస్థానంలో తపోఫలంగా అంది వచ్చే మరో సంపద మోక్షలక్ష్మి.
లోకంలో నాలుగు రకాల మనుషులుంటారు. నిత్యజీవులు- ఆధ్యాత్మికతను నలుగురికీ బోధిస్తూ సాధక లోకాన్ని సదా జాగృతం చేసేవారు. ముముక్షువులు- మోక్షలక్ష్మి కృపాకటాక్షం కోసం ఎదురుచూసే మోక్షార్థులు. బద్ధజీవులు- విషయానందాల విషవలయంలో మునిగితేలే లౌకికులు. ముక్తజీవులు- విషయ సుఖాల ఎండమావి నుంచి ముక్తులైన జ్ఞానులు. ఆధ్యాత్మికం ద్వారా ఆనందమయ జీవితం లక్ష్యమైనవారే నిజానికి అదృష్టవంతులు. ఉన్నత విద్య కాకపోయినా ఏ కొద్దిపాటిదైనా విలువలతో కూడిన చదువు చదివినవారు, చేతికందినవి లోకోత్తర విజయాలు కాకపోయినా చిన్నపాటి కృతార్థత సాధించిన కార్యశీలురు, ధైర్యసాహసాలు ప్రదర్శించే యువకులు; వాత్సల్యం ప్రదర్శించే తల్లిదండ్రులుగల చిన్నారులు- వీరందరూ లక్ష్మీదేవి అనుగ్రహ భాగ్యానికి నోచుకున్నవారే!
అష్త్టెశ్వర్యాలు ఆనందాన్ని పంచుతాయని భావిస్తాం. వాటికి అతీతంగా ఆధ్యాత్మిక వివేచన ఆత్మానందానికి ప్రేరణ అవుతుంది. ఆ భాగ్యం పొందినవారందరూ లక్ష్మీపుత్రులే! ఈ సత్యం తెలుసుకున్న ఎవరి జీవితాల్లోనూ నిరాశ, అసంతృప్తులకు చోటుండదు.
-గోపాలుని రఘుపతిరావు
No comments:
Post a Comment