ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 13 June 2013

పవిత్రత..


తామెంతో ఆచారవంతులమని భావించేవారు అస్పృశ్యత పాటిస్తుంటారు. శుచిగా ఉండవలసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అంతరాలయంలోని మూలవిరాట్టుకు అభిషేక, అలంకారాది సేవలు చేస్తున్నప్పుడు, అలా చేసేవారు ఎవరినీ తాకరు. తాకకూడదనేది ఆచార సంప్రదాయం. తప్పు లేదు. కానీ, ఈ ధోరణి అంతటా సందర్భరహితంగా కొనసాగిస్తే మాత్రం అది గర్హనీయమే అవుతుంది.
                         శుచి, శుభ్రత మన జీవితంలో ఒక భాగం కావాలి. లేకపోతే మనల్ని అనారోగ్యాలు కమ్ముకునే ప్రమాదం ఉంది. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఎంతో శుచిగా ఉంటారు. ఆ సందర్భంలో శస్త్ర చికిత్సామందిరంలోకి ఇతరులకు ప్రవేశం ఉండదు. ఆ సమయంలో అది రోగికి ప్రాణదానం చేసే అపర దేవాలయం.

ఈ రెండు సందర్భాలూ తప్ప ఇంకెక్కడ అస్పృశ్యత పాటించినా అది ఇతరుల్ని అవమానించటమే అవుతుంది. శుభ్రత- అపరిశుభ్రతల తేడాలు తప్ప జాతి, మత, కుల భేదాలు అస్పృశ్యతకు కారణం కారాదు. ఆధ్యాత్మిక దృష్టితో చూసినా అపరిశుభ్రత సరైంది కాదు.

ఆదిశంకరులకు చండాలరూపుడై పరమశివుడు ఎదురైన ఘటన గుర్తుందా? 'తప్పుకో... తప్పుకో...' అని హెచ్చరించగా 'ఎవరు తప్పుకోవాలి, ఏది తప్పుకోవాలి, అశాశ్వతమైన శరీరమా, శాశ్వతమైన ఆత్మా?' అని ఎదురు ప్రశ్నించి అజ్ఞానపు తెరలు తొలగించాడు శివుడు. ఈ ఉదంతం అందరికీ ఆదర్శ పాఠంగా గుర్తుండాలి. ఎందుకంటే, అణుదీపిక లాంటి ఆత్మ అనేక శరీరాల్లో ప్రభవిస్తోంది. ఆత్మ నిష్క్రమిస్తే శరీరం శవమే. చండాలుడిలోనూ శివాంశ ఉంటుందనేదే ఆదిశంకరుల జ్ఞానోదయ కథలోని సారాంశం.

శుచిగా ఉన్నవారందరూ పవిత్రులుగా చెప్పలేం.
పవిత్రులు శుచిగా ఉండి తీరాల్సిన అవసరం లేదు.
పవిత్రత శరీరానికి సంబంధించింది కాదు. మనసుకు సంబంధించింది. భావశుద్ధివల్ల మన చర్యలు నిష్కళంకంగా ఉంటాయి. ఈ సందర్భంగా మనం రామకృష్ణ-వివేకానందులకు సంబంధించిన సంఘటన ఒకటి స్మరించుకోవాలి.

రామకృష్ణుడు శుద్ధ శాకాహారి. శిష్యుల్నీ అలాగే ఉండాలని ఆదేశించేవారు. ఒకసారి వివేకానందుడు చేపలు తిన్నాడని ఇతర శిష్యులు నేరంగా గురువుగారికి చెప్పారు. ఆయన 'వివేకానందుడికి ఏ దోషమూ అంటదు. కారణం- అతడి మనసు తినేవాటిమీద ఉండదు. మీరు అలా కాదు. అందుకే మీకు ఆంక్షలు. అతడికి అలాంటివి అవసరం లేదు' అని చెప్పారట.

శరీర శుభ్రతనే కాదు- మనసునూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతరాలయ శుభ్రతలో అర్చకులు ఎంత శ్రద్ధ చూపుతారో, ఆధ్యాత్మిక సాధకులూ అంతరంగ శుభ్రతలో అంతటి శ్రద్ధ పాటించాలి. అప్పుడే దేహం దేవాలయమవుతుంది. అంతరంగం అంతరాలయమై విలసిల్లుతుంది. అంతర్యామి మూలవిరాట్టు అవుతాడు.
                 
అంతరంగ స్వచ్ఛతే అసలు పవిత్రత. పరిమళ ద్రవ్యాలు శరీరాన్ని పరిమళింపజేయగలవు భావాలను కాదు. పవిత్రులకు హృదయాల్లో అంతర్యామి దర్శనం లభిస్తూనే ఉంటుంది. 
                                                                                                                                                                                                  - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 


No comments:

Post a Comment